Raj Kasireddy Audio: బెయిల్ రాగా విచారణకి వస్తా, అన్నీ చెప్పేస్తా, విజయసాయిరెడ్డి చరిత్ర బయటపెడతా- రాజ్‌కేసిరెడ్డి ఆడియో విడుదల
Raj Kasireddy Audio: ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో తప్పించుకొని తిరుగుతున్న రాజ్ కేసిరెడ్డి ఆడియో విడుదల చేశారు. వన్‌సైడెడ్ స్టోరీలు నమ్మొద్దని వచ్చి అన్నీ చెబుతానంటున్నారు.

Raj Kasireddy Audio: ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్‌లో రోజుకో నేత సిట్ విచారణకు హాజరవుతున్నారు. వారు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెబుతున్నారు. మొదటి నుంచి ఈ కేసులో అనుమానితుడిగా ఉన్న కేసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి మాత్రం విచారణకు రావడం లేదు. విచారణకు డుమ్మా కొడుతున్న ఆయన ఇవాళ ఓ ఆడియో విడుదల చేశారు. విజయసాయిరెడ్డిపై విమర్శలు చేశారు.
మూడుసార్లు నోటీసులు ఇచ్చినప్పటికీ రాజ్ కేసిరెడ్డి మాత్రం విచారణకు రావడం లేదు. అరెస్టు కాకుండా ఉండేదుకు కోర్టుల్లో బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. అప్పటి వరకు విచారణకు వచ్చేది లేదని ఆడియోలో స్పష్టం చేశారు. చట్టం తనకు ఇచ్చిన హక్కులను వాడుకుంటానని అంటున్నారు.
రాజ్ కేసిరెడ్డి పంపిన ఆడియోలో కేసు గురించి ఏముంది అంటే" లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి మీడియాలో నా గురించి వస్తున్న మిస్‌ఇన్ఫర్మేషన్ గురించి అడ్రెస్ చేయాలని చెప్పి ఈ ఆడియో విడుదల చేస్తున్నాను. మార్చి ఆఖరి వారంలో నేను లేని సమయంలో సిట్ అధికారులు మా ఇంటికి వచ్చి మా మదర్‌కు నోటీసులు ఇచ్చారు. నన్ను విట్‌నెస్‌గా నోటీసు ఇచ్చి విచారణకు రావాలని చెప్పారు. 24 గంటల్లోనే స్పందించి. సర్ నోటీసులు ఇచ్చారు. నేను సహకరించడానికి సిద్ధమే. వస్తాను. కానీ నన్ను ఎందుకు పిలుస్తున్నారో అనే విషయం సమాచారం ఇవ్వండని అడిగాను. స్పెసిఫిక్ డాక్యుమెంటేషన్ ఏమైనా తెమ్మంటారా అని కూడా అడిగాను. ఎవరైనా నా గురించి చెప్పిన సమాచారం ఏమైనా ఉందా అని కూడా ఆరా తీసాను.
అది తెలిస్తే నేను ప్రిపేర్ అయ్యి వస్తానని చెప్పాను. ఆ మెయిల్ పెట్టిన తర్వాత రెండోసారి నోటీసు ఇచ్చారు. తర్వాత రోజు విచారణకు రావాలని చెప్పారు. అప్పుడు నేను మా లాయర్లతో మాట్లాడాను. పరిణామాలు చూసిన లాయర్లు ఏమన్నారంటే... సాక్షిగా నోటీసులు ఇచ్చి అరెస్టు చేయాలని చూస్తున్నారు. ఏమైనా సరే కోర్టులో ప్రొటెక్షన్ తీసుకొన్న తర్వాతనే నోటీసులకు అడ్రెస్ చేయడం బెటర్ అని చెప్పారు. దీనిపై హైకోర్టులో ఛాలెంజ్ చేసాం. హైకోర్టు రీజనబుల్ టైం ఇచ్చి పిలవాలని చెప్పింది. దానిపై కూడా సుప్రీంకోర్టుకు వెళ్లాం. అది నడుస్తోంది. ముందస్తు బెయిల్ కోసం కూడా పెట్టున్నాం. అన్నింటి కంటే ముఖ్యంగా నేను విచారణకు సహకరించేందుకు సిద్ధంగా ఉన్నాను. న్యాయపోరాటం పూర్తి అయిన తర్వాత కచ్చితంగా నేను విచారణకు వస్తాను." అని చెప్పుకొచ్చారు.
ఇదే కేసులో విచారణకు హాజరైన వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన కామెంట్స్‌పై కూడా కేసిరెడ్డి స్పందించారు. ఆయన్ని నమ్మొద్దని సూచించారు. ఆయన బండారం మీడియా ముఖంగానే వెలుగులోకి తీసుకొస్తానని అన్నారు. అప్పటి వరకు సింగిల్ సైడ్ వార్తలు వేయొద్దని మీడియాకు సూచించారు.
విజయసాయిరెడ్డి గురించి ఆడియోలో రాజ్ కేసి రెడ్డి ఏమన్నారంటే..." విజయసాయిరెడ్డి అనే వ్యక్తి నిన్న మాట్లాడిన మాటల గురించి కౌంటర్ ఇవ్వాలని ఉంది. ఆ మనిషి ఒక బట్టేబాజ్ మనిషి . ఆయన గురించి ప్రస్తుతానికి ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. ఎందుకంటే... నా న్యాయపోరాటానికి సంబంధించిన ప్రక్రియ పూర్తి అయిన తర్వాత ఒకసారి వచ్చి విచారణ ఎదుర్కొన్న తర్వాత మీడియా ముందు ఈ మనిషి గురించి చెబుతాను. ఆయన చరిత్ర అంతా తీసి బయటపెడతాను. అప్పటి వరకు ఒకసైడ్ స్టోరీ విని ఓ నిర్ణయానికి రావద్దు" అని సూచించారు.





















