Vijayawada News: ప్రేమించాడు, పెళ్లి చేసుకుంటానన్నాడు - ట్రాన్స్ జెండర్ గా మార్చి డబ్బులతో పరారయ్యాడు!
Vijayawada News: వారిద్దరూ అబ్బాయిలే కానీ ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ట్రాన్స్ జెండర్ గా మార్చాడు. చివరకు ఆమె వద్ద నుంచి డబ్బులు, బంగారం తీసుకొని పారిపోయాడు.
![Vijayawada News: ప్రేమించాడు, పెళ్లి చేసుకుంటానన్నాడు - ట్రాన్స్ జెండర్ గా మార్చి డబ్బులతో పరారయ్యాడు! Vijayawada News Man Cheated Transgender in The Name of Marriage And Ran Away With Money And Gold Vijayawada News: ప్రేమించాడు, పెళ్లి చేసుకుంటానన్నాడు - ట్రాన్స్ జెండర్ గా మార్చి డబ్బులతో పరారయ్యాడు!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/08/17/1426ac619981882554b49da60ca565bb1692244649722519_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Vijayawada News: వారిద్దరూ అబ్బాయిలే. కానీ ఇద్దరూ కాలేజీ రోజుల నుంచే ఒకరినొకరు ఇష్ట పడ్డారు. ప్రేమించుకున్నారు. కలిసి మూడేళ్ల పాటు సహజీవనం కూడా చేశారు. ఈక్రమంలోనే పెళ్లి చేసుకోవాలనుకున్నారు. అయితే అందులో అమ్మాయిలా ఫీలింగ్స్ ఉండే అబ్బాయి.. ట్రాన్స్ జెండర్ గా మారితేనే పెళ్లి సాధ్యం అవుతుందని మరో యువకుడు చెప్పాడు. ఇందుకు అతడు ఒప్పుకోగానే.. ఢిల్లీకి తీసుకెళ్లి ట్రాన్స్ జెండర్ గా మారేలా ఆపరేషన్ చేయించాడు. అందుకు అయిన ఖర్చు కూడా ట్రాన్స్ జెండర్ భరించింది. అయితే ఎలాగూ ఇద్దరం పెళ్లి చేసుకుంటామన్న నమ్మకంతో ట్రాన్స్ జెండర్ తన వద్ద ఉన్న 11 సవర్ల బంగారంతో పాటు 26 రూపాయలను అతడికి ఇవ్వగా... వాటిని తీసుకొని సదరు యువకుడు పారిపోయాడు.
కృష్ణా జిల్లా పెనమలూరుకు చెందిన ఆలోకం పవన్ కుమార్, విజయవాడ పరిధిలోని కృష్ణ లంకకు చెందిన ఈలి నాగేశ్వర రావు సుమారు ఆరేళ్ల కిందట కానూరు వీఆర్ సిద్దార్థ ఇంజినీరింగ్ కాలేజీలో కలిసి చదువుకున్నారు. ఆ సమయంలో ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డారు. అది కాస్తా ప్రేమగా మారింది. దీంతో 2019లో అంటే చదువు పూర్తయిన తర్వాత ఇద్దరూ కృష్ణలంక సత్యంగారి హోటల్ సెంటర్ సమీపంలో ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నారు. గృహ యజమానికి మగవారిగానే పరిచయం చేసుకొని సహజీవనం చేశారు. ట్యూషన్ పాయింట్ కూడా నిర్వహించారు. అయితే విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులకు కూడా వారు మగవారిగానే తెలుసు. కొద్ది రోజుల తర్వాత ఇద్దరూ పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ఈక్రమంలో నాగేశ్వర రావు.. పవన్ కుమార్ ను ఢిల్లీ తీసుకెళ్లి అవయవ మార్పిడి శస్త్ర చికిత్స చేయించాడు. అతడి పేరును భ్రమరాంబికగా కూడా మార్చాడు. అయితే ఈ ఆపరేషన్ కు సుమారు 11 లక్షల ఖర్చు అయింది. దీనంతటిని భ్రమరాంబికనే చెల్లించింది.
11 సవర్ల బంగారంతోపాటు 26 లక్షలతో యువకుడి పరార్
ఎలాగూ తననే వివాహం చేసుకుంటాడన్న నమ్మకంతో భ్రమరాంబిక.. నాగేశ్వర రావుకు తన వద్ద ఉన్న 11 సవర్ల బంగారంతోపాటు 26 లక్షల రూపాయలను ఇచ్చింది. అయితే ట్రాన్స్ జెండర్ గా మారిన తర్వాత కూడా వీళ్లు చాలా కాలం పాటు కలిసే ఉన్నారు. కానీ ఆ తర్వాత అంటే గతేడాది డిసెంబర్ లో భ్రమరాంబికను ఇంటి నుంచి పంపించి వేశాడు. తన తల్లి విజయలక్ష్మితో కలిసి మంగళగిరి వెళ్లిపోయాడు. గత్యంతరం లేని స్థితిలో ఆమె పెనమలూరులోని తల్లిదండ్రుల వద్దకు వెళ్లిపోయింది. అయితే ఇటీవలే నాగేశ్వర రావు మంగళగిరిలో ఉన్నాడన్న సమాచారంతో అతడిపై ఫిర్యాదు చేసేందుకు ఇటీవల భ్రమరాంబిక మంగళగిరి పోలీసులను ఆశ్రయించింది. వ్యవహారం మొత్తం కృష్ణలంక కేంద్రంగా సాగినందున అక్కడ ఫిర్యాదు చేయాలని మంగళగిరి పోలీసులు సూచించారు. దీంతో భ్రమరాంబిక కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు నాగేశ్వరరావు, అతడి తల్లి విజయ లక్ష్మిపై ఈనెల 10వ తేదీన కేసు నమోదు అయింది. పోలీసులు దర్యాప్తు కూడా చేస్తున్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)