Vijayawada MP Keshineni Nani: తెలుగుదేశం పార్టీకి విజయవాడ ఎంపీ కేశినేని నాని రాజీనామా!
Vijayawada MP Keshineni Nani: విజయవాడ ఎంపీ కేశినేని నాని మరో బాంబు పేల్చారు. ఎంపీ పదవికి, తెలుగుదేశం పార్టీకి త్వరలోనే రాజీనామా చేయబోతున్నట్టు సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు.
Vijayawada MP Keshineni Nani: బెజవాడ ఎంపీ కేశినేని నాని ఎంపీ పదవికి, టీడీపీ పార్టీకి గుడ్ బై చెప్పనున్నట్టు ప్రకటించారు. త్వరలోనే ఢిల్లీ వెళ్లి ఎంపీ పదవికి రాజీనామా చేసి అనంతరం తెలుగు దేశం పార్టీ నుంచి కూడా బయటకు వస్తానని తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా ప్రకటించారు. దానితో విజయవాడ రాజకీయాల్లో పెను సంచలనం చోటుచేసుకుంది.
గత మూడు రోజులుగా హాట్ టాపిక్ గా కేశినేని నాని ఎపిసోడ్
2019 ఎన్నికల్లో ఎంపీగా గెలిచినప్పటి నుంచీ పార్టీపై పలు సందర్భాల్లో తన అసంతృప్తిని బయట పెట్టిన కేశినేని నానిది ఎప్పుడూ ముక్కుసూటి వ్యవహారమే. అయితే గత కొన్ని రోజులుగా ఆయనకు విజయవాడ ఎంపీ సీటు మరోసారి దక్కదు అనే ప్రచారం ఊపందుకుంది. దానికి తగ్గట్టుగానే టీడీపీలో నానికి బదులుగా ఆయన సోదరుడు కేశినేని చిన్నికి ప్రాధాన్యత లభించడాన్ని నాని పలు సందర్భాల్లో విమర్శిస్తూ వచ్చారు. అయితే ఆదివారం తిరువూరు లో చంద్రబాబు బహిరంగ సభ జరుపనున్నారు. దానికి సంబంధించిన సన్నాహక సదస్సులో కేశినేని నాని ఫొటో లేకపోవడంతో నాని, కేశినేని చిన్ని వర్గాల మధ్య కొట్లాట జరిగింది. దీనిలో బందోబస్తుకు వెళ్ళిన పోలీసులకు కూడా దెబ్బలు తగిలాయి. వెంటనే రంగంలోకి దిగిన చంద్రబాబు తన రాయబారులుగా కొనికళ్ళ నారాయణ లాంటి కీలక నేతల్ని నాని వద్దకు పంపించి తిరువూరు సభకు దూరంగా ఉండమని చెప్పినట్టు నాని తెలిపారు.
విజయవాడ ఎంపీ సీటు కూడా వచ్చే ఎన్నికల్లో తనకు ఇవ్వరని చెప్పినట్టు నాని ప్రకటించారు. ఇదే విషయమై నిన్న మాట్లాడుతూ పార్టీ అధ్యక్షుడి నిర్ణయానికి తాను విధేయుడిగా ఉంటానని అన్నారు. అయితే ఒకరోజు గడిచే లోపులోనే తాను పార్టీకి, ఎంపీ పదవికి రాజీనామా చేయబోతున్నట్టు ప్రకటించి సంచలనం సృష్టించారు. ఈ ప్రకటన కు ముందు కేశినేని నానీ తన వర్గీయులు...అభిమానులతో కీలక చర్చలు జరిపి వారి అభిప్రాయాలు తీసుకున్నారు. దీనితో నాని వ్యూహం ఏంటి... ఆయన రాజకీయ అడుగులు ఎటువైపు పడబోతున్నాయి అనేదానిపై రాజకీయ వర్గాల్లోనే కాకుండా విజయవాడ ప్రజల్లో సైతం తీవ్ర చర్చ జరుగుతోంది.