Vijayawada CP: జగన్‌పై చేతితోనే రాయి విసిరారు, అది అక్కడి నుంచే వచ్చింది - కీలక వివరాలు చెప్పిన సీపీ
AP Elections 2024: ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై జరిగిన దాడి గురించి విజయవాడ పోలీస్ కమిషనర్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం కీలక వివరాలు వెల్లడించారు.
Vijayawada CP Kanti Rana Tata Press Meet: సీఎం జగన్ పై జరిగిన రాయి దాడి గురించిన కీలక వివరాలను విజయవాడ సీపీ కాంతి రాణా టాటా వెల్లడించారు. సోమవారం (ఏప్రిల్ 15) ఆయన తన కార్యాలయంలో ఈ అంశంపై మీడియా సమావేశం నిర్వహించారు. ముఖ్యమంత్రిపై పడిన రాయి చేతితోనే విసిరారని సీపీ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రికి తగిలిన దెబ్బలను బట్టి.. క్యాట్ బాల్ లేదా ఎయిర్ గన్ వాడి ఉంటారని అనుమానాలు వ్యక్తం కాగా.. అందుకే తమకు ఎలాంటి ఆధారాలు లభించలేదని సీపీ చెప్పారు. సీఎంకు తగిలిన రాయి సైజు కూడా చేతిలో సరిపోయేంత సైజులోనే ఉన్నట్లుగా గుర్తించామని అన్నారు.
ఇప్పటికి ఘటన జరిగి 48 గంటలు అయ్యిందని.. ప్రాథమికంగా ఉన్న సమాచారం ప్రకారమే తాము ఈ వివరాలు చెబుతున్నామని అన్నారు. నిందితుడు దొరికితే దాడి వెనుక గల కుట్ర కోణం తెలుస్తుందని సీపీ చెప్పారు. అయితే, రాయిని చాలా బలంగా, వేగంగా విసిరారని.. అందుకే ఇద్దరికీ గాయం అయ్యిందని చెప్పారు. ‘‘సీఎంకు రాయి తగిలి, వెల్లంపల్లి శ్రీనివాస్ కి తగిలి.. రాయి అవతల పడింది. సున్నితమైన భాగాల మీద నేరుగా తగిలి ఉంటే ప్రాణాపాయంగా మారేది. వెల్లంపల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు 307 సెక్షన్ కింద కేసు పెట్టాం. కింద జనాల్లో నుంచే రాయి పైకి విసిరారు. సోషల్ మీడియాలో వచ్చే ప్రచారాలను నమ్మవద్దు’’ అని సీపీ కాంతి రాణా టాటా ప్రజలకు సూచించారు.
ఆధారాలు ఇస్తే బహుమతి
‘‘సీఎం జగన్ పై రాయి దాడి చేసిన వారి వివరాలు తెలిస్తే ఇవ్వాలని ప్రజలను కోరుతున్నాం. కేసు విచారణ కోసం అవసరమైన సమాచారం ఇస్తే రూ.2 లక్షల బహుమతి ఇస్తాం. ఆధారాలు ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతాం. ఎనిమిది బృందాలు 40 మందితో ఈ కేసు విచారణకు పని చేస్తున్నాయి. త్వరలోనే కేసును చేధిస్తున్నాం. ఇచ్చిన ఫిర్యాదు, జరిగిన ఘటన ఆధారంగా 307 సెక్షన్ పెట్టాం. నందిగామలో చంద్రబాబుపై జరిగిన దాడి ఘటన వేరు. అప్పుడు అన్ని కోణాల్లో విచారణ చేశాం. ఫిర్యాదు చేసిన వారిని రావాలని కోరినా స్పందించ లేదు. అన్ని పరిశీలించిన తరువాతే ఆ సెక్షన్ లు పెట్టాం’’ అని సీపీ అన్నారు.