(Source: ECI/ABP News/ABP Majha)
Vice President Venkaiah: నాయకులే ప్రజల మధ్య చీలికలు తీసుకురావడం బాధాకరమన్న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
ప్రస్తుత రాజకీయాలపై వెంకయ్య వ్యంగ్యాస్త్రాలు సంధించారు. విద్యార్థి దశ నుంచి తీర్చి దిద్దితేనే మంచి రాజకీయ నాయకులు పుట్టుకొస్తారని అభిప్రాయపడ్డారు.
సమాజానికి ఆదర్శంగా ఉండాల్సిన నాయకులే ప్రజల మధ్య విభేదాలు సృష్టిస్తున్నారని విమర్శించారు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. గుంటూరులోని పాటిబండ్ల సీతారామయ్య ఉన్నత పాఠశాల వజ్రోత్సవాల్లో పాల్గొన్న ఆయన ప్రస్తుత రాజకీయాలపై ఘాటు విమర్శలు చేశారు. పాటిబండ్ల సీతారామయ్య ముందుచూపుతో ఏర్పాటు చేసిన పాఠశాల ఎందరో సమర్థులను దేశానికి అందించిందన్నారు వెంకయ్య.
కులం, మతం పేరుతో చీలిక
పాటిబండ్ల సీతారామయ్య ఉన్నత పాఠశాల విద్యార్థులు, వజ్రోత్సవానికి వచ్చిన అతిథులను ఉద్దేశించిన ప్రసంగించారు ఉపరాష్ట్రపతి వెంకయ్య. వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దని విద్య నిరుపయోగమని మహాత్మా గాంధీ చెప్పిన మాటల్ని గుర్తు చేశారు. సమాజంలో రోజురోజుకూ విలువలు తగ్గుతున్నాయని, ప్రజల్ని కులం, మతం పేరుతో విడగొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
భాషపై అదుపు లేదు
చట్ట సభల్లోనే బూతులు, అసభ్య పదజాలం వాడటం దారుణమన్నారు వెంకయ్య. కులం, మతం, నేర ప్రవృత్తి, డబ్బుకు ప్రాధాన్యత ఇవ్వటం వల్లే ఈ పరిస్థితి వచ్చిందన్నారు ఉపరాష్ట్రపతి. చదువులు డిగ్రీల కోసమో, ఉద్యోగాల కోసమో కాదన్నారు. విజ్ఞానవంతులైన యువత సమాజానికి ఉపయోగపడే సంస్కారవంతులుగా ఎదగాలని ఆకాంక్షించారు. పేదరికం, నిరక్షరాస్యత, అవినీతి, వివక్షల వంటి దురాచారాలను తావులేని నవభారత నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
ఎంతో మంది గొప్ప వ్యక్తులను దేశానికి అందించిన శ్రీ పాటిబండ్ల సీతారామయ్య ఉన్నత పాఠశాల వజ్రోత్సవ వేడుకల్లో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉంది. మానవసేవే మాధవసేవగా భావించి జీవితాన్ని ప్రజాసేవకే అంకితం చేసిన మహోన్నత దేశభక్తులు శ్రీ పాటిబండ్ల సీతారామయ్యగారు. pic.twitter.com/eLxI80xbZk
— Vice President of India (@VPSecretariat) March 1, 2022
విద్య వ్యాపారం కాదు
సమాజం కోసం పాటుపడిన వారిని ప్రజలు చిరకాలం గుర్తుంచుకుంటారని తెలిపారు వెంకయ్యనాయుడు.కొందరు విద్యను వ్యాపారంగా చేసుకుని డబ్బు సంపాదిస్తున్నారని.. ఇది సరైన విధానం కాదని సూచించారు. దేశానికి నాయకత్వం వహించే సమర్థులను తయారు చేయటం కూడా విద్య ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు ఉపరాష్ట్రపతి.
మాతృభాషలోనే చదివాం
ఉపరాష్ట్రపతి అయ్యాక కూడా తాను వేషధారణ మార్చలేదని సంప్రదాయ వస్త్రాలతో ఏ దేశానికి వెళ్లినా అందరూ గౌరవిస్తున్నారని తెలిపారు వెంకయ్య. మన సంప్రదాయాలను మనం పాటిస్తే.. ప్రపంచం మనం గౌరవిస్తుందని స్పష్టం చేశారాయన. మాతృభాషను గౌరవించుకోవాలని.. తనతో పాటు దేశ రాష్ట్రపతి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అంతా మాతృభాషలో చదివినవాళ్లమేనని గుర్తు చేశారు వెంకయ్య.
అనారోగ్యంతో మరణించిన యడ్లపాటి వెంకట్రావు మృతికి ఆ వేదిక పై నుంచి వెంకయ్యనాయుడు సంతాపం తెలిపారు. తనకు పాఠాలు చెప్పిన ఉపాధ్యాయుల వల్లే ఇంతవాడినయ్యానని నాబార్డు ఛైర్మన్ చింతల గోవిందరాజులు అన్నారు. ఇదే పాఠశాలలో చదివి ఇప్పుడు ఉత్సవాలకు రావటం పట్ల సంతోషం వెలిబుచ్చారు. గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన తాను గ్రామీణాభివృద్ధి కోసం పనిచేసే నాబార్డు ఛైర్మన్ కావటం సంతోషం కలిగించే అంశమన్నారు గోవిందరాజులు.