Vijayawada: విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో వాసిరెడ్డి పద్మ, చంద్రబాబు వాగ్వాదం
అధికార, ప్రతిపక్షాల పోటాపోటీ నిరసనలతో విజయవాడ ప్రభుత్వాసుపత్రి వద్ద టెన్షన్ నెలకొంది. చంద్రబాబు వస్తారని తెలిసే వరకు ప్రభుత్వం పట్టించుకోవడం లేదని టీడీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది.
విజయవాడలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న గ్యాంగ్ రేప్ బాధితురాలికి పరామర్శలు వెల్లువెత్తాయి. ఓవైపు అధికార పార్టీలీడర్లు, మరోవైపు ప్రతిపక్షాలు ఆమెకు ధైర్యం చెప్తున్నారు. కానీ ఇదే అక్కడి వాతావరణాన్ని టెన్షన్ పెట్టింది.
చంద్రబాబు వర్సెస్ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్
ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు బాధితురాల్ని పరామర్శించేందుకు వెళ్లగా, అక్కడ ఏపీ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ ఆయనకు ఎదురుపడ్డారు. సామాన్య మహిళకు ఏపీ ప్రభుత్వంలో రక్షణ లేకుండా పోయిందని, మీరు ఏం చేస్తున్నారంటూ వాసిరెడ్డి పద్మను చంద్రబాబు సూటిగా ప్రశ్నించారు. విజయవాడ సంఘటన ఏపీకే అవమానం అని వ్యాఖ్యానించారు. అమ్మాయి తండ్రి ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడం వల్లే ఈ దారుణం జరిగిందని చంద్రబాబు ఆరోపించారు. కోటి రూపాయాలు బాధితురాలి కుటుంబానికి పరిహారంగా చెల్లించేలా చూడాలని డిమాండ్ చేశారు. వాసిరెడ్డి పద్మను టీడీపీ కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేయడంతో జీజీహెచ్‌లో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి.
విజయవాడ పాత ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న గ్యాంగ్ రేప్ బాధితురాలిని ఆంధ్రప్రదేశ్ మహిళాకమిషనర్ ఛైర్‌పర్శన్ వాసిరెడ్డి పద్మ పరామర్శించారు. బాధితురాలితో మాట్లాడి ధైర్యం చెప్పారు. కచ్చితంగా నిందితులకు శిక్ష పడేలా చేస్తామన్నారు. ఫ్యామిలీ మెంబర్స్‌తో మాట్లాడిన ఆమె... అండగా ఉంటామన్నారు.
వాసి రెడ్డి పద్మ వచ్చిన సందర్భంగా విజయవాడ ప్రభుత్వాసుపత్రి వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చంద్రబాబు వస్తున్నారని సమాచారం తెలిసిన తర్వాతే అధికార పార్టీ లీడర్లు మేల్కొన్నారని ఆరోపిస్తోంది టీడీపీ. ఇప్పటి వరకు నిందితులకు అండగా నిలిచిన అధికార పార్టీ లీడర్లు ఇప్పుడు బాధితురాలని పరామర్శించడం ఏంటని ప్రశ్నిస్తోంది టీడీపీ. వాసిరెడ్డి పద్మ పర్యటన అడ్డుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించారు టీడీపీ శ్రేణులు. ఆమె రాకను తప్పుపట్టారు.
కరోనా వచ్చిందని నిన్నంత డ్రామాలు ఆడిన వాసి రెడ్డి పద్మ ఇప్పుడు ఎలా ఆసుపత్రికి వచ్చారని ప్రశ్నిస్తోంది టీడీపీ. ఒక్కరోజులోనే కరోనా తగ్గిపోయిందా అంటూ నిలదీస్తోంది. చంద్రబాబు వస్తున్నారనే భయంతోనే బాధితురాలిని పరామర్శించారని దుయ్యబట్టారు. బాధితురాలిని వాసిరెడ్డి పద్మ పరామర్శించే సందర్భంలో గోబ్యాక్ వాసిరెడ్డి పద్మ అంటూ నినాదాలు చేశారు టీడీపీ శ్రేణులు. ఆమెకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన చేశారు.
టీడీపీ శ్రేణులకు వ్యతిరేకంగా వైసీపీ క్యాడర్ కూడా ఆందోళన చేపట్టింది. ఇరు వర్గాల పోటాపోటీ నినాదాలతో పరిస్థితి కాసేపు టెన్షన్ టెన్షన్‌గా మారింది. ఇరువర్గాలను శాంతిపజేయడానికి పోలీసులు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. ఈ క్రమంలో ప్రభుత్వాసుపత్రి అద్దాలు ధ్వంసమయ్యాయి. ఆ టైంలో టీడీపీ అధినేత చంద్రబాబు అటుగా వస్తున్నారని తెలుసుకున్న పోలీసులు పరిస్థితిని త్వరగా చక్కదిద్దారు. వాసి రెడ్డి పద్మను అక్కడి నుంచి జాగ్రత్తగా పంపించేశారు. టీడీపీ, వైసీపీ శ్రేణులను శాంతింపజేశారు.