Jaleel Khan News: ఒత్తిడి తట్టుకోలేకపోతున్నా, వైసీపీ ఎంపీని అందుకే కలిశా - జలీల్ ఖాన్ క్లారిటీ
Vijayawada Politics: జలీల్ ఖాన్ వైసీపీ ఎంపీని కలవడం చర్చనీయాంశం అయింది. కార్యకర్తల నుంచి ఒత్తిడి తట్టుకోలేకే వైసీపీ ఎంపీ అయోధ్య రామిరెడ్డిని కలిశానని జలీల్ ఖాన్ అన్నారు.
Jaleel Khan: విజయవాడకు చెందిన టీడీపీ సీనియర్ నేత జలీల్ ఖాన్.. వైఎస్ఆర్ సీపీ రాజ్యసభ సభ్యుడు ఆళ్ల అయోధ్య రామిరెడ్డిని కలిసిన సంగతి తెలిసిందే. విజయవాడలో ఉన్న అయోధ్య రామిరెడ్డి కార్యాలయంలో ఆయన వద్దకు వెళ్లి జలీల్ ఖాన్ కలిశారు. దీనికి సంబంధించిన ఓ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో.. అది ఎన్నో అనుమానాలను కలిగించింది. జలీల్ ఖాన్ టీడీపీ నుంచి వైసీపీలోకి వెళ్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే, గతంలో కాంగ్రెస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున విజయవాడ వెస్ట్ నియోజకవర్గం నుంచి జలీల్ ఖాన్ గెలిచారు. 2014లో విజయం సాధించిన తరువాత.. అప్పటి అధికార పార్టీలోకి వచ్చారు. అలా వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చారు.
తాజాగా ఆయన వైసీపీ ఎంపీని కలవడం చర్చనీయాంశం అయింది. కార్యకర్తల నుంచి ఒత్తిడి తట్టుకోలేకే వైసీపీ ఎంపీ అయోధ్య రామిరెడ్డిని కలిశానని జలీల్ ఖాన్ అన్నారు. తన టికెట్ విషయంలో ఎన్నోసార్లు చంద్రబాబు, పవన్ ను కలిశానని అన్నారు. కానీ వారు ఎటూ తేల్చడం లేదని అన్నారు. దీంతో కార్యకర్తలు తనపై ఒత్తిడి తెచ్చారని.. అందుకే వైసీపీ ఎంపీని కలిశానని అన్నారు. తాను కచ్చితంగా వచ్చే ఎన్నికల్లో పోటీ చేసి తీరతానని అన్నారు. అయితే, ఏ పార్టీ నుంచి అనేది ఇప్పుడే చెప్పలేనని జలీల్ ఖాన్ అన్నారు.
విజయవాడలో ఎంపీ కేశినేని నాని, ఆయన కుమార్తె కేశినేని శ్వేత, తిరువూరు మాజీ ఎమ్మెల్యే నల్లగండ్ల స్వామిదాస్.. ఇలా టీడీపీని వీడిన సంగతి తెలిసిందే. ఈ ముగ్గురూ అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలుకుతున్నారు. నూజివీడు ఇన్‌ఛార్జ్ ముద్దరబోయిన వెంకటేశ్వరరావు కూడా టీడీపీకి రాజీనామా చేశారు. ఆయన ఏ పార్టీలో చేరతారనేది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.