AP Politics: సీఎం జగన్ తీసుకొచ్చే ప్రతి స్కీమ్ ఓ స్కామ్ లాంటిది: ఎంపీ కనకమేడల
TDP vs YSRCP: ఏపీ సీఎం వైఎస్ జగన్ తీసుకొచ్చే పెట్టే ప్రతి స్కీమ్, ఒక స్కామేనని టీడీపీ రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్ ఆరోపించారు.
TDP MP Kanakamedala:
ఏపీ ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చామని, మేనిఫెస్టోలో సైతం 95 నుంచి 99 శాతం వరకు హామీలు అమలు చేశామని వైసీపీ నేతలు చెబుతుంటారు. అయితే ఏపీ సీఎం వైఎస్ జగన్ తీసుకొచ్చే పెట్టే ప్రతి స్కీమ్, ఒక స్కామేనని టీడీపీ రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్ ఆరోపించారు. చిన్నపిల్లలకు పెట్టే పప్పుల చిక్కీలో సైతం వైసీపీ సర్కార్ అవినీతికి పాల్పడిందన్నారు.
అవనిగడ్డలో కొలువైన లంకమ్మ అమ్మవారు, మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ మంగళవారం దర్శించుకున్నారు. దేశంలోనే అత్యంత అవినీతి చేసే రాజకీయ నాయకుడు, అత్యంత ధనిక సీఎం జగన్ అని జాతీయ మీడియాలో రావడంతోనే టీడీపీ అధినేత చంద్రబాబుపై బురద జల్లే ప్రయత్నం మొదలైందన్నారు. స్కిల్ డెవలప్ మెంట్ లో అవినీతి జరిగిందనడనికి ఆధారాలు లేకున్నా, చంద్రబాబుపై అక్రమ కేసు బనాయించి అరెస్టు చేశారని ఆరోపించారు. లిక్కర్ ఆదాయంపై లెక్కలన్నీ అవకతవకలేనని, వైసీపీ పాలనలో రాష్ట్ర అదాయంలో 60శాతం డబ్బుకు లెక్కలు లేవని కీలక వ్యాఖ్యలు చేశారు. నవరత్నాలు సహా జగన్ తెచ్చిన అన్ని పథకాలు, స్కీముల్లోనే స్కాములే ఉన్నాయని ఎద్దేవా చేశారు.
జగన్ పాలనపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్
సీఎం జగన్ గత నాలుగున్నరేళ్ల పాలనలో సర్కార్ చేసిన అప్పులతో పాటు ఆదాయం, సంక్షేమ పథకాలు, అభివృద్ధిపై శ్వేతపత్రం డిమాండ్ చేస్తే ఇప్పటివరకూ విడుదల చేయలేదన్నారు. జగన్ పాలనపై ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి నిజాలు వెల్లడించేందుకు బదులుగా అబద్దాలు చెబుతూ కాలం వెల్లదీస్తున్నారని కనకమేడల అన్నారు. చంద్రబాబు, టీడీపీ అధికారంలోకి వస్తేగానీ పాలన పోలీసుల నుంచి ప్రభుత్వ పాలన వస్తుందన్నారు. వైసీపీ నుంచి రాష్ట్ర ప్రజలకు విముక్తి కలిగించేందుకు జనసేన, టీడీపీ కలిసి పని చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఎంపీ కనకమేడల వెంట మాజీ మంత్రి మండలి బుద్ధప్రసాద్ ఉన్నారు.