Sajjala On CBN Arrest: అవినీతి జరగలేదని నిరూపించుకో, హుందాగా వివరణ ఇవ్వండి- చంద్రబాబుకు సజ్జల సూచన
Sajjala: అవినీతి జరగలేదని చంద్రబాబు నాయుడు నిరూపించుకోవాలని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.
Sajjala: స్కిల్ డెవలప్‌మెంట్‌లో అవినీతి జరగలేదని చంద్రబాబు నాయుడు నిరూపించుకోవాలని, వస్తున్న ఆరోపణలపై బాధ్యతాయుతమైన రాజకీయ నాయకుడిగా హుందాగా వివరణ ఇవ్వాలని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. వాస్తవాలను ప్రభుత్వం తరఫున ప్రజల్లోకి తీసుకెళ్తున్నామని చెప్పుకొచ్చారు. చంద్రబాబు అరెస్టుపై తాడేపల్లిలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడిన సజ్జల.. స్కామ్ లో బాబు ప్రమేయం ఉన్నట్లు ఆధారాలు ఉన్నాయని చెప్పారు. ఎఫ్ఐఆర్ లో పేరు లేకపోయినా అరెస్టు చేస్తున్నారని అనడం సరైంది కాదన్నారు. ప్రాథమిక రిపోర్టులో లేనంత మాత్రాన అరెస్టు చేయకుండా ఉండరని చెప్పారు. 2017, 2018 లో రూ.371 కోట్లలో రూ.240 కోట్లు దారి మళ్లించినట్లు ఆరోపణలు వచ్చాయని వెల్లడించారు. షెల్ కంపెనీల ద్వారా ఇదంతా జరిగిందని అన్నారు.
అరెస్టు పై ముందే చంద్రబాబు మాట్లాడటం దేనికి నిదర్శనమని సజ్జల ప్రశ్నించారు. ఆరోపణలు ఉన్న వ్యక్తిని అరెస్టు చేసి దర్యాప్తు చేయడం సర్వసాధారణమని చెప్పుకొచ్చారు. వాస్తవాలను ప్రభుత్వం తరఫున ప్రజల్లోకి తీసుకెళ్తున్నామని, అసలు విషయం చెప్పకుండా టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. 9.12.21న ఈ కేసులో ఎఫ్ఐఆర్ నమోదైందని గుర్తు చేశారు. సీఐడీకి చెందిన సిట్ దర్యాప్తు చేస్తోందని తెలిపారు. స్కామ్ లో బాబు ప్రమేయం ఉన్నట్లు ఆధారాలున్నాయన్న సజ్జల.. స్కామ్ లో దర్యాప్తు జరుగుతోందని, ఎలాంటి రాజకీయ ప్రమేయం లేదని స్పష్టం చేశారు.
స్కామ్ గురించి సీఐడీ ఎంటర్ కాకముందే జాతీయ దర్యాప్తు సంస్థలు అప్రమత్తం చేశాయని గుర్తు చేశారు. విచారణలో ఎలాంటి కక్ష సాధింపు లేదన్నారు. కక్ష సాధింపు చర్యలు బాబుకు అలవాటేనని, అదే జగన్ కు ఆపాదించాలని ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. టీడీపీ శ్రేణులు అశాంతి రేపే అవకాశం ఉంది కాబట్టే పలు ప్రాంతాల్లో బస్సులను డిపోలకే పరిమితం చేసినట్లు చెప్పారు. బాధ్యతాయుతమైన రాజకీయనాయుకలైతే.. హుందాగా జవాబు ఇవ్వాలని, వివరణ ఇవ్వాలని సూచించారు.