Roja And Shyamala: వైసీపీ ఫైర్ బ్రాండ్లకు మైక్ ఇచ్చిన జగన్- పార్టీలో శ్యామలకు ప్రమోషన్
YSRCP Spokesperson: గత ఎన్నికల సమయంలో రోజా, శ్యామల.. ఇద్దరూ టీడీపీ, జనసేనపై విమర్శలతో విరుచుకుపడ్డారు. ఇప్పుడు కూడా వారికి అదే పని అప్పజెప్పారు జగన్.
YS Jagan Appointed Roja and Shyamala as Spokesperson: వైసీపీ అధికార ప్రతినిధుల లిస్ట్ విడుదలైంది. అందులో మాజీ మంత్రి రోజా, యాంకర్ శ్యామల కూడా ఉన్నారు. మహిళా కోటాలో వారిద్దరికీ ప్రయారిటీ ఇచ్చారు జగన్. ఇప్పటికే వారికి ఫైర్ బ్రాండ్లు అనే పేరుంది. గత ఎన్నికల సమయంలో రోజా, శ్యామల.. ఇద్దరూ చంద్రబాబు, పవన్ ని బాగా టార్గెట్ చేశారు. ఇప్పుడు కూడా వారికి అదే పని అప్పజెప్పారు జగన్.
అధికార ప్రతినిధులుగా వైసీపీ నలుగురు పేర్లను ప్రకటించింది. భూమన కరుణాకర్ రెడ్డి, జూపూడి ప్రభాకర్, రోజా, శ్యామల ఇందులో ఉన్నారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత పార్టీలో కీలక పదవుల్ని భర్తీ చేస్తున్న జగన్, తాజాగా అధికార ప్రతినిధుల విషయంలో వ్యూహాత్మకంగా అడుగులు వేశారు. పదవులు లేకపోయినా పార్టీ వాయిస్ ని మాజీ మంత్రులు అంబటి రాంబాబు, పేర్ని నాని, గుడివాడ అమర్నాథ్.. వినిపిస్తున్నారు. వీరికి తోడు ఇప్పుడు అధికార ప్రతినిధుల జాబితా విడుదలైంది.
వైయస్ఆర్ సీపీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధులను నియమించడం జరిగింది. pic.twitter.com/P2jxFmtPKZ
— YSR Congress Party (@YSRCParty) September 13, 2024
ఇటీవల పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్న రవిచంద్రారెడ్డి సాక్షి ఛానెల్ లో పార్టీ పెద్దలను విమర్శించి కలకలం రేపారు. సజ్జల రామకృష్ణారెడ్డిని ఆయన టార్గెట్ చేశారు. ఆ తర్వాత ఇతర యూట్యూబ్ ఛానెళ్లలో కూడా అలానే మాట్లాడారు. దీంతో పార్టీ అలర్ట్ అయింది. రవిచంద్రారెడ్డిని దూరం పెట్టింది. మీడియా ఛానెళ్లలో చర్చలకు వెళ్లేవారి లిస్ట్ ని ప్రకటించింది. ఈ జాబితాలో వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.. పార్టీ తరపున పోటీ చేసిన అభ్యర్థులు.. వీరితోపాటు మరో 14 మంది పేర్లు ఉన్నాయి. వీరు మినహా ఇంకెవరూ వైసీపీ తరపున ప్యానెల్ డిస్కషన్స్ లో పాల్గొనకూడదని ఆదేశాలిచ్చారు. తాజాగా పార్టీ తరపున ప్రెస్ మీట్లు పెట్టేందుకు అధికారికంగా ప్రతినిధులను నియమించారు.
Also Read: ప్రభుత్వం కన్నా జగన్‌నే ఎక్కువ టార్గెట్ చేస్తున్న షర్మిల - కాంగ్రెస్‌వైపు రాకుండా చేసే ప్రయత్నమేనా ?
మాజీ మంత్రి రోజా ఇటీవల పార్టీతో కాస్త గ్యాప్ మెయింటెన్ చేస్తున్నట్టు పుకార్లు ఉన్నాయి. ఆమధ్య ఢిల్లీలో జరిగిన ధర్నాకు కూడా ఆమె హాజరు కాలేదు. ఆ తర్వాత విదేశీ యాత్రలో ఉండగా విడుదలైన ఆమె ఫొటో ఒకటి వైరల్ గా మారింది. తాజాగా విజయవాడ వరదలపై రోజా చేసిన వ్యాఖ్యలు కూడా సంచలనంగా మారాయి. ఇటీవల ఉమ్మడి చిత్తూరు జిల్లా నాయకులంతా జగన్ ని కలిశారు. రోజా కూడా ఆ మీటింగ్ లో ఉన్నారు. ఆ మీటింగ్ తర్వాతే రోజా పేరుతో కూడిన అధికార ప్రతినిధుల జాబితా విడుదలైంది.
శ్యామలకు ప్రమోషన్..
యాంకర్ శ్యామల గత ఎన్నికల సమయంలో వైసీపీ తరపున ప్రచారంలో పాల్గొన్నారు. పవన్ కల్యాణ్ పై ఆమె చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. వైసీపీ ఓటమి తర్వాత కూడా ఆమె పార్టీతోనే ఉన్నారు. ఈ క్రమంలో ఆమెకు జగన్ కీలక పదవి ఇవ్వడం విశేషం. సినీ ఇండస్ట్రీలో ఉన్న శ్యామల వైసీపీ స్పోక్స్ పర్సన్ గా ఉంటే.. అటు మెగా ఫ్యామిలీకి, ఇటు నందమూరి ఫ్యామిలీకి కూడా వ్యతిరేకంగా మాట్లాడాల్సిన సందర్భాలు రావొచ్చు. కానీ ఆమె ప్రతిపక్షంలో ఉన్న వైసీపీతోనే కలసి నడిచేందుకు నిర్ణయించుకున్నారు. మరి పార్టీ వాయిస్ ని ఆమె ఎంత గట్టిగా వినిపిస్తారనేది ముందు ముందు తేలిపోతుంది.
Also Read: ఏలేరుకి వరద చంద్రబాబు వల్లనే, ఆ ప్రచారాలకు చంద్రబాబు తమ్ముడి వరుస - జగన్ ఎద్దేవా