Janasena: పోలీసులపై జనసేన లీడర్ల ఆగ్రహం, వారధిపై నిరసన - పోలీసుల్ని నిలదీసిన నాదెండ్ల మనోహర్
Janasena Formation Day: ‘‘పోలీసులు లా అండ్ ఆర్డర్ చూసుకోవాలి కదా. ఈ ఫ్లెక్సీల గురించి మేం మున్సిపాలిటీ వాళ్లతో తేల్చుకుంటాం కదా. మీకెందుకు’’ అంటూ నాదెండ్ల మనోహర్ పోలీసులు ప్రశ్నించారు.
Vijayawada: విజయవాడలోని కనకదుర్గ వారధిపై కాస్త ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసుల తీరుపై జనసేన నాయకులు నిరసనలు చేశారు. జనసేన ఆవిర్భావ భారీ సభ మంగళగిరిలో జరగనున్నందున ఆ ప్రాంతానికి వచ్చే అన్ని మార్గాల్లో పార్టీ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. కనకదుర్గ వారధిపైన కూడా భారీ ఎత్తున శనివారం రాత్రి ఫ్లెక్సీలు పెట్టారు. అయితే, పోలీసులు ఆ ఫ్లెక్సీలను ఆదివారం ఉదయం తొలగించడంతో జన సైనికులు ఆగ్రహించారు. అధికార పార్టీ నేతల ఒత్తిడితోనే ఫ్లెక్సీలను తొలగిస్తున్నారని మండిపడ్డారు. ఈ విషయం తెలుసుకున్న జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ తో పాటు మరికొందరు జనసేన నాయకులు అక్కడికి చేరుకొని పోలీసుల తీరును నిలదీశారు.
‘‘పోలీసులు లా అండ్ ఆర్డర్ చూసుకోవాలి కదా. ఈ ఫ్లెక్సీల గురించి మేం మున్సిపాలిటీ వాళ్లతో తేల్చుకుంటాం కదా. మీకెందుకు’’ అంటూ నాదెండ్ల మనోహర్ ప్రశ్నించారు. జనసేన నాయకుల నిరసనలతో వారధిపై ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.
14న భారీ ఆవిర్భావ సభ
జనసేన పార్టీ ఆవిర్భావ సభ ఈ నెల 14న మంగళగిరిలో నిర్వహించనున్నారు. సభ నిర్వహణ కోసం పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ 12 కమిటీలను నియమించారు. ఈ మేరకు పార్టీ కార్యాలయం ఆదివారం ఒక ప్రకటన విడుదల చేసింది. జిల్లాల సమన్వయ కమిటీలో పంతం నానాజీ, ముత్తా శశిధర్, నేమూరి శంకర్ గౌడ్, పెదపూడి విజయకుమార్, జి.ఉదయ్ శ్రీనివాస్, సుందరపు విజయ్‌కుమార్, వడ్రాణం మార్కండేయ బాబులను నియమించారు. ఆహ్వాన కమిటీలో టి.శివశంకర్‌తో పాటు మరో ఐదు మంది సభ్యులున్నారు. ఈ సభకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. కొవిడ్ నిబంధనలతో సభకు పోలీసులు అనుమతిచ్చారు. జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ సభ ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.
ప్రత్యేక పాట కూడా విడుదల
జన సైనికుల కోసం ఆవిర్భావ సభపై ప్రత్యేకంగా పాటను కూడా విడుదల చేశారు. ఈ పాటను పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆవిష్కరించారు. ‘జన జన జన జనసేనా’ అంటూ సాగే ఈ పాట ప్రత్యేకంగా మహిళను ఉత్తేజపరించేలా రాశారు. ఈ స్పెషల్ సాంగ్ జన సైనికులు, పవన్ కళ్యాణ్ అభిమానులను ఆకట్టుకుంటోంది. ప్రత్యేక పాట పోస్టర్‌పై ‘భవిష్యత్తు జెండాని మోయటం కంటే బాధ్యత ఏముంటుంది. ఒకతరం కోసం యుద్ధం చేయటం కంటే సాహసం ఏముంటుంది’ అంటూ పార్టీ శ్రేణులకు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సందేశం ఇచ్చారు.
జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ మహా సభ
— JanaSena Party (@JanaSenaParty) March 11, 2022
సభా ప్రాంగణానికి శ్రీ దామోదరం సంజీవయ్య చైతన్య వేదికగా నామకరణం.
ఛలో అమరావతి...
తేదీ: 14-03-2022 ( సోమవారం )
సభా స్థలం: ఇప్పటం గ్రామం, తాడేపల్లి మండలం, గుంటూరు జిల్లా.
#JanaSenaChaloAmaravati pic.twitter.com/9zpAZfixHg