వైఎస్‌ఆర్‌సీపీకి తలనొప్పిగా మారుతున్న మైలవరం పంచాయితీ!
వైసీపీ మైలవరం రాజకీయం రంజు మీద ఉంది. అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే చేస్తున్న కామెంట్స్ చర్చనీయాశంగా మారాయి. ఇంతలో వసంత తండ్రి, టీడీపీ ఎంపీ కేశినేని నానితో భేటీ కావడంతో మరోసారి రాజకీయం వేడెక్కింది.
Mylavaram YCP MLA comments and his Father met with tdp Mp has heat up AP Politics: వైసీపీ మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ వ్యవహరం చర్చనీయాశంగా మారింది. మైలవరం నియోజకవర్గంలో మంత్రి జోగి రమేష్‌తో వసంతకు ఉన్న విభేదాలు బహిర్గతంకావటంతో వివాదం తెర మీదకు వచ్చింది. ఈ వివాదంపై పార్టీ అధిష్ఠానం ప్రత్యేకంగా శ్రద్ద చూపింది. వసంత కృష్ణ ప్రసాద్, జోగి రమేష్‌తో విడివిడిగా ప్రభుత్వ పరిశీలకుడు సజ్జల సమావేశం అయ్యారు. ఇరువురు నాయకుల మధ్య ఉన్న విభేదాలను పరిష్కరించేందుకు చర్యలు చేపట్టారు. అయినా ఈ వివాదం కొలిక్కిరాలేదు.
వసంత తండ్రి వ్యవహరం....
మైలవరంలో జోగి రమేష్ ( Jogi Ramesh ), వసంత కృష్ణ ప్రసాద్ మధ్య వివాదం కొనసాగుతుండగానే... వైసీపీ ఎమ్మెల్యే ( Mylavaram YCP MLA ) వసంత కృష్ణ ప్రసాద్ తండ్రి మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావు మరో చిచ్చు రేపారు. దీంతో వసంత కృష్ణ ప్రసాద్ మరింత ఇరకాటంలోకి వెళ్ళారు. కమ్మ సామాజిక వర్గాన్ని ఉద్దేశించి వసంత నాగేశ్వరరావు చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగింది. ఆ వ్యాఖ్యలు తన తండ్రి వ్యక్తిగతమని అందులో తనకు ఎటువంటి సంబంధం లేదని వసంత క్లారిటీ ఇచ్చారు. అయినా కూడా వసంతను టార్గెట్‌గా చేసి పార్టీలో వివాదం చెలరేగింది.
కమ్మ సామాజిక వర్గానికి వైసీపీ ప్రభుత్వంలో ప్రాధాన్యత లేదని తండ్రి వసంత నాగేశ్వరరావు చేసిన కామెంట్స్ ఎమ్మెల్యే వసంత మెడకు చుట్టుకుంది. ఈ వ్యవహరంలో కూడా మంత్రి జోగి రమేష్ లేనిపోని విషయాలు ప్రచారం చేశారని ఎమ్మెల్యే వర్గం ఆరోపిస్తోంది. సోషల్ మీడియా వేదికగా జోగి రమేష్ వర్గం తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేసిందని చెబుతున్నారు. వసంత కృష్ణ ప్రసాద్ నియోజకవర్గం నుంచి వెళ్ళిపోతున్నారని, ఎన్నికల నాటికి టీడీపీలో చేరతారని కూడా ప్రచారం చేసిందని టాక్. అందుకే వసంత కృష్ణ ప్రసాద్‌కు పార్టీలో ప్రాధాన్యత తగ్గించారనే ప్రచారం కూడా జరిగింది.
రంగంలోకి పార్టీ నేతలు
మైలవరం నియోజకవర్గంలో ఉన్న పరిస్థితులను స్థానిక గ్రూపు రాజకీయాలను క్లియర్ చేసి, అందరిని ఒకే తాటిపైకి తీసుకువచ్చేందుకు ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు వెలంపల్లి శ్రీనివాసరావు, పార్టీ రాష్ట్ర స్థాయి పరిశీలకులు, మర్రి రాజశేఖర్ వంటి నేతలు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో కూడా వసంత కృష్ణ ప్రసాద్ తన అసహనాన్ని వ్యక్తం చేశారు. పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత... జోగి రమేష్ తన నియోజకవర్గంలో చేతులు పెట్టి గందరగోళ పరచడమేంటని నిలదీశారు. జోగి వైఖరి వలన నియోజకవర్గంలో పార్టీలో విభేదాలు వచ్చాయన్నారు.
ఎమ్మెల్యేను కాదని మరో వ్యక్తి రాజకీయాలు చేయటంపై పార్టీ పెద్దలు కూడా సరైన రీతిలో స్పందించలేనే అభిప్రాయాన్ని వసంత వ్యక్తం చేశారు. పార్టీ నేతలు వసంత కృష్ణ ప్రసాద్‌ను సముదాయించేందుకు విషయాలను పార్టీ అగ్రనాయకత్వం వద్దకు తీసుకువెళ్ళి అవసరమైతే మరోసారి జగన్‌తో భేటీకి ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.