దేవినేని ఉమ లేకుండా మైలవరం టీడీపీ నేతల సమావేశం- నియోజకవర్గంలో ఏదో జరుగుతోంది?
మైలవరం టీడీపీ నేతల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి టీడీపీ నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు హజరయ్యారు. అత్యంత కీలకంగా నిర్వహించిన సమావేశానికి దేవినేని ఉమామహేశ్వరరావు రాలేదు.
ఎన్టీఆర్ జిల్లా టీడీపీలో అసమ్మతి వెలుగుచూస్తోంది. అసంతృప్త నేతలంతా నియోజకవర్గాల వారీగా తిరుబావుటా ఎగరేస్తున్నారు. పార్టీ కోసం నిత్యం పోరాటం చేసి, దశాబ్దాలుగా సేవలను అందించిన నేతలు ఒక్కసారిగా అసహాన్ని వ్యక్తం చేస్తున్నారు. దేవినేని ఉమామహేశ్వరరావు వంటి కీలక నేతలు ప్రాతినిధ్యం వహిస్తున్న మైలవరం నియోజకవర్గంలో ఇది మరింత ఎక్కువగా ఉంది. ఎన్నికలకు పార్టీ సిద్ధమవుతున్న వేళ పార్టీలో అసమ్మతి నేతలంతో బల నిరూపణ చేయటం చర్చనీయాశంగా మారింది.
ఉమా లేకుండానే నియోజకవర్గ నేతల సమావేశం
మైలవరం టీడీపీ నేతల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి టీడీపీ నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు హజరయ్యారు. పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్న నాయకులు సైతం ఈ సమావేశానికి ప్రత్యేకంగా హజరయ్యారు. అత్యంత కీలకంగా నిర్వహించిన సమావేశానికి మాజీ మంత్రి, నియోజకవర్గ ఇంచార్జ్‌గా ఉన్న దేవినేని ఉమామహేశ్వరరావు రాలేదు. ఆయన లేకుండానే నియోజకవర్గ స్థాయిలో ఆత్మీయ సమావేశం పేరుతో పార్టీ నేతలు భేటీ అయ్యారు.
మైలవరం నియోజకవర్గ సమావేశానికి హజరైన పార్టీ నాయకులు సైతం దేవినేని ఉమా పేరు ఎత్తకుండా చంద్రబాబు పైనే ప్రశంశలు కురిపించారు. వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసి, జగన్ పాలనపై అరోపణలు చేశారు. దీంతో పార్టీలో అత్యంత కీలకం అయిన దేవినేని ఉమా పరిస్థితి ఏంటన్న దానిపై ఇప్పుడు చర్చ మొదలైంది. కేవలం పార్టీపై ఉన్న అభిమానంతోనే ఈ సమావేశాన్ని నిర్వహించామని నాయకులు కవర్ చేస్తున్నారు. చంద్రబాబును తిరిగి అధికారంలోకి తీసుకురావటమే కీలకంగా సమాశేంలో తీర్మానం చేశామని చెబుతున్నారు.
బొమ్మసాని సుబ్బరావు ఎంట్రీ
నియోజకవర్గంలో టీడీపీకి దేవినేని ఉమా చాలా కీలకమయిన నేత. అయితే ఆయన తరువాత బొమ్మసాని సుబ్బరావు పార్టీ కోసం నిరంతరం పని చేసే వ్యక్తిగా స్థానికంగా గుర్తింపు పొందారు. దేవినేని ఉమా గెలుపులో కూడా బొమ్మసానిది పెద్ద పాత్రని చెబుతారు. ఇప్పుడు పరిస్థితులు మారి, బొమ్మసాని నాయకత్వంలోనే ఈ ఆత్మీయ సమావేశం జరగటం చర్చకు దారి తీసింది. బొమ్మసాని గతంలో డమ్మీ అభ్యర్థిగా కూడా నామినేషన్లు వేశారు. దేవినేని ఉమా గెలుపులో అత్యంత ప్రతిష్టాత్మకమైన వ్యక్తిగా కూడా గుర్తింపు ఉంది. పార్టీ కోసం నిరంతరం పని చేయటంతోపాటుగా, పార్టీ క్యాడర్‌కు కూడా బొమ్మసాని సుబ్బారావు అందుబాటులో ఉంటారని అభిప్రాయ ఉంది. ఇప్పుడు సుబ్బారావే ఈ సమావేశం నిర్వహించటం వెనుక అంతర్యం ఏంటన్నది పార్టీలో చర్చ మొదలైంది.
దేవినేని వైఖరిపై విమర్శలు
దేవినేని ఉమా వైఖరిపై నియోజకవర్గ నేతల్లో భిన్నాభిప్రాయలు వ్యక్తం అవుతున్నాయి. నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచినప్పటికి క్యాడర్‌ను కానీ, నాయకులను కానీ ఉమా లెక్కచేయటం లేదనే అభిప్రాయం ఎప్పటి నుంచో ఉంది. అయితే ఇప్పుడు ఈ సమావేశాన్ని నిర్వహించటంలో కీలకంగా వ్యవహరించిన బొమ్మసాని కూడా దేవినేనికి అత్యంత సన్నిహితుడు. దీంతో నియోజకవర్గ స్థాయిలో దేవినేని ఉమాపై వ్యతిరేకత పెరిగిన కారణంగానే ఈ సమావేశం ఏర్పాటు చేశారనే ప్రచారం జరుగుతుంది. ఇప్పుడు స్థానిక వైసీపీ ఎమ్మెల్యే వసంత క్రిష్ణ ప్రసాద్ కూడా టీడీపీ నేతలపై వేధింపులకు పాల్పడటం, టీడీపీ ఉన్న కీలకమైన వ్యక్తులను తన వైపుకు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. టీడీపీకి సానుభూతిపరులుగా ఉన్న వారిని కాపాడుకునేందుకు దేవినేని ఉమ కనీసం ప్రయత్నించటం లేదన్నది స్థానికంగా వినిపిస్తున్న మాట. స్థానిక క్యాడర్‌ను కలసి వారికి భరోసా కూడా కల్పించలేని పరిస్దితుల్లో... ఆ బాధ్యతలను తీసుకోవాలని బొమ్మసాని ప్రయత్నిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. మరి ఈ పరిస్థితులను దేవినేని ఉమ ఎలా అదిగమిస్తారు, పార్టీ అధిష్ఠానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది చర్చనీయాశంగా మారింది.