RK Returns: మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి యూటర్న్- నేడో, రేపో వైసీపీలోకీ రీ ఎంట్రీ!
Alla Rama Krishna Reddy: మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తిరిగి వైసీపీ గూటికి చేరనున్నారు.ఈమేరకు ఆర్కేతో విజయసాయిరెడ్డి మంతనాలు జరిపారు. నేడో రేపో ఆయన సీఎం జగన్ ను కలిసే అవకాశం ఉంది
RK Retruns: ఏపీ ముఖ్యమంత్రి అనుంగ శిష్యుడు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి(Alla Ramakrishna ReddY) మళ్లీ సొంతగూటికి చేరుకోనున్నట్లు సమాచారం. ఇవాళో, రేపో ఆయన సీఎం జగన్(Jagan) తో భేటీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈమేరకు హైదరాబాద్ లో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్(Vijayasai Reddy)డి ఆళ్లరామకృష్ణారెడ్డితో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. అయ్యిందేదో అయిపోయింది కలిసి పని చేద్దామని విజయసాయిరెడ్డి సూచించినట్లు తెలిసింది. మంగళగిరి టిక్కెట్ సైతం మళ్లీ ఇస్తామని విజయసాయిరెడ్డి ఆఫర్ చేసినట్లు సమాచారం. తొలుత కొంత బెట్టు చేసినప్పటికీ...విజయసాయిరెడ్డి సర్దిచెప్పినట్లు తెలిసింది. పార్టీలో గౌరవం, అధికారంలోకి వస్తే మంత్రిపదవి ఇప్పించేలా జగన్ తో తాను మాట్లాడతానని...పాత విషయాలన్నీ మర్చిపోయి మళ్లీ వైసీపీలో పనిచేయాలని ఆయన గట్టిగా చెప్పినట్లు తెలిసింది.
విజయసాయి రెడ్డి మంతనాలతో కాస్త మెత్తబడిన ఆళ్లరామకృష్ణారెడ్డి...సీఎం జగన్ తో భేటీ అయ్యేందుకు సరేనన్నారని తెలిసింది. నేడో, రేపో ఆయన సీఎం జగన్ ను తాడేపల్లిలో కలవనున్నారు. ఇటీవలే జగన్ తో విభేదించి పార్టీ నుంచి వీడిపోయిన రామకృష్ణారెడ్డి షర్మిల సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే పార్టీలో జయిన్ అయిన తొలి రోజే ఆర్కేకు ఝలక్ తగిలిందట. ఆయన పార్టీలో చేరిన మొదటి రోజు సాయంత్రం కీలక సమావేశం జరిగింది. ఆ భేటీకి కనీసం ఆర్కేను పిలువలేదు. లోపలికి పిలుస్తారని చాలా సమయం గేటు వద్దే వేచి చూసిన ఆయన కోపంతో వెనుదిరిగారట. పార్టీలో చేరినప్పటి నుంచి కనీసం ప్రాధాన్యత లేదని కూడా సన్నిహితుల వద్ద చెప్పుకున్నారట.
కాంగ్రెస్ పార్టీపై ఆర్కే కాస్త కినుకుతో ఉన్నారని గ్రహించిన విజయసాయి రెడ్డి మంతనాలు జరిపినట్టు చెప్పుకుంటున్నారు. దీంతో వైసీపీలోకి రి ఎంట్రీకి ఆర్కే కూడా ఓకే చెప్పినట్టు సమాచారం. ఇవాళ అయోధ్య రామిరెడ్డితో కలిసి సీఎం జగన్‌తో సమావేశం కానున్నారని తెలుస్తోంది. ఆయనకు మంగళగిరి గెలుపు బాధ్యతలు అప్పగించబోతున్నారని కూడా మరో వాదన ఉంది.
ఒకప్పుడు జగన్ అంటే ప్రాణం ఇచ్చే ఆళ్ల.. వైసీపీకీ రాజీనామా చేసిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టి ఆయన్ను తీవ్రంగా విమర్శించారు. పార్టీలో పెద్దఎత్తున అవినీతి జరుగుతోందని....వేల కోట్ల రూపాయలు ఎటు వెళ్తున్నాయని ప్రశ్నించారు. అలాగే మంగళగిరిలోని తన కార్యాలయంలో జగన్ ఫ్లెక్సీలు, ఫొటోలు సైతం తీసి బయటపడేయించారు. త్వరలోనే అన్ని వివరాలు చెబుతానంటూ వైసీపీ అధిష్టానాన్ని హెచ్చరించారు. రాజశేఖర్ రెడ్డి కుటుంబం వెంటే నడుస్తానని తెలిపిన ఆర్కే..షర్మిల సమక్షంలోకాంగ్రెస్ లో చేరారు.అయితే అక్కడ ఆయనకు తగినంత ప్రాధాన్యం లభించడం లేదని తెలిసింది. అందుకే మళ్లీ సొంత గూటికే వస్తున్నారని సమాచారం