Krishna News: కృష్ణా జిల్లాలో పెరుగుతున్న పొలిటికల్ హీట్ - పోటాపోటీగా టీడీపీ, వైసీపీ నినాదాలు!
Krishna News: ఏపీలో రాజకీయ నినాదం మారు మోగుతుంది. ఓ వైపు వైసీపీ మరోవైపు టీడీపీ ఆందోళనలు చేస్తోంది. పోటాపోటీగా నినాదాలు చేస్తూ... కృష్ణా జిల్లా వ్యాప్తంగా హోరెత్తిస్తున్నారు. అసలేం జరుగుతోందంటే..?
Krishna News: ఉమ్మడి కృష్ణా జిల్లా యనమలకుదురులో తీవ్ర ఉద్రిక్తతత నెలకొంది. ఒకే సమయంలో వైసీపీ, టీడీపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. ముందుగా వైసీపీ పాలనను ప్రశ్నిస్తూ.. కృష్ణా బ్రిడ్జిపై తెలుగు దేశం నేతలు ఇదేమీ ఖర్మ పేరుతో ఆందోళన నిర్వహించారు. వారు ధర్నా చేస్తున్నారనే విషయం తెలుసుకుని వైసీపీ కార్యకర్తలు భారీగా వచ్చారు. పోటాపోటీగా ఆందోళనలకు దిగారు. గొడవలు వద్దని పోలీసులు వారించినా.. ఎవరూ వెనక్కి తగ్గలేదు. తాము అనుమతి తీసుకొని ఆందోళనలు చేస్తుంటే.. స్థానిక వైసీపీ నేతలు తమ నిరసన కార్యక్రమాన్ని అడ్డుకోవడం దారుణం అని టీడీపీ నేతలు మండిపడితున్నారు. తమపై దాడి చేయడానికి వచ్చిన వైసీపీ నేతలకు పోలీసులు మద్దతు ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. తాము అనుమతి తీసుకున్న తర్వాత ఇలా అడ్డంకులు కల్గించడం ఏంటని టీడీపీ నేతలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు.
పోలీసులు నచ్చజెప్పినా ఎవరూ వినిపించుకోలేదు. దీంతో పోటా పోటీగా నినాదాలతో పరిస్థితిని హోరెత్తించారు. యనమలకుదురులో నదిపై పనులు నిలిచిపోయాయి. దీంతో ఆ పనులు వెంటనే ప్రారంభించాలని ప్రజలకు రవాణా సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేస్తూ... టీడీపీ నేతలు, కార్యకర్తలు ఆందోళన బాట పట్టారు. ఏపీలో ఉన్న ప్రభుత్వం ఏ పనులు చేయడం లేదని.. టీడీపీ నేతలు కూడా ఆందోళనలు చేపట్టారు. కానీ వైసీపీ మాత్రం మరోలా చెప్తోంది. కాంట్రాక్టర్ కోర్టుకు వెళ్లడంతో కేసు కోర్టులో ఉందని తెలిసి కూడా డ్రామా ఆడడం మొదలు పెట్టిందని ఆరోపిస్తోంది. టీడీపీనే బ్రిడ్జి నిర్మాణాన్ని అడ్డుకుని.. మళ్లీ నిరసనల పేరుతో డ్రామాలు చేస్తుండటంతోనే తాము పోటీ నిరసనకు దిగామని చెబుతున్నారు.
మూడ్రోజుల క్రితం...
వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించేందుకు టీడీపీ వినూత్న కార్యక్రమాన్ని రూపొందించింది. అధికార వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక విధానాలు, వైఫల్యాలతో ప్రజలు ఎలా నష్టపోయారో చెప్పేందుకు సరికొత్త కార్యక్రమంతో సిద్ధమైంది. ఆ కార్యక్రమం పేరు 'రాష్ట్రానికి ఇదేమి కర్మ'. ప్రతిపక్ష టీడీపీ 'ఇదేమి కర్మ' పేరుతో ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమైంది. ఈ కార్యక్రమంతో వైసీపీ ప్రభుత్వ అరాచకాలను ఎండగట్టాలని భావిస్తోంది. ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలతో జనం ఎంతగా నష్టపోయారో వివరించనుంది. దీని ద్వారా వైసీపీ నేతలకు చెక్ పెట్టే దిశగా అడుగులు వేస్తోంది.
ప్రతి ఇంటికి వెళ్లి ప్రజాసమస్యలను రాత పూర్వకంగా తీసుకుని.. వాటిని భారీ వాహనంలో ముఖ్యమంత్రి నివాసానికి పంపేలా టీడీపీ కార్యచరణ రూపోందిస్తోంది. చంద్రబాబు అధ్యక్షతన జరిగిన తెలుగుదేశం పార్టీ విసృత్తస్థాయి భేటీలో ఈ కార్యక్రమ తీరుతెన్నులు వివరించారు. కర్నూలు జిల్లా పర్యటన విజయవంతం కావడంతో వచ్చే 2 నెలలో 50కిపైగా నియోజకవర్గాలను చుట్టి రావాలని.. చంద్రబాబు యోచిస్తున్నారు. ఇదే సమయంలో ప్రతి నియోజకవర్గ ఇంఛార్జ్ ప్రజల్లో ఉండేలా ఇదేమీ కర్మ కార్యక్రమం రూపొందించారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎదుర్కొనేలా, నేతలను సిద్ధం చేసేందుకు ఈ కార్యక్రమం ఉపకరిస్తుందని తెలుగుదేశం భావిస్తోంది.
గెలవకపోతే వచ్చే ఎన్నికలే చివరివని తేల్చేసిన చంద్రబాబు !
చంద్రబాబునాయుడు వచ్చే ఎన్నికల్లో తనను గెలిపించి సీఎంగా పంపించకపోతే ఇక రాజకీయాల్లో ఉండనని ప్రకటించారు. ఆయన అసెంబ్లీలో సవాల్ చేసిన అంశం గురించి ప్రస్తావిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఎలాంటి సందర్భంలో చేసినా.. చంద్రబాబు అన్న మాటలు మాత్రం ప్రజల్లోకి వెళ్లిపోయాయి. దీనికి వైసీపీ కూడా ఓ కారణం. ఈ సారి ఎన్నికల్లో గెలిస్తే ఇక చంద్రబాబు యాక్టివ్‌గా ఉండలేరని... మనమే 30 ఏళ్ల పాటు సీఎంగా ఉంటామని జగన్ పార్టీ క్యాడర్‌కు చెబుతున్నారు. అంటే వారు కూడా చంద్రబాబు గెలవకపోతే.. ఇవే చివరి ఎన్నికలన్న సందేశం ఇస్తున్నారు. చంద్రబాబు కూడా అదే చెబుతున్నారు. ఓ రకంగా ప్రజల నుంచి సానుభూతి పొందే ప్రయత్నం చేస్తున్నారని విపక్షాలు అంటున్నాయి. ఏదైనా రాజకీయ వ్యూహమే. ఎలా చూసినా.. చంద్రబాబు తనకు చివరి చాన్స్ ఇవ్వాలని.. రాష్ట్రాన్ని బాగు చేస్తానని అంటున్నారు.