Kodi Katthi Case: కోడికత్తి కేసు విచారణ: NIA కోర్టుకు హాజరైన సీఎం జగన్ పీఏ, మినహాయింపు కోరిన సీఎం
Kodi Katthi Case: నేడు విజయవాడ ఎన్ఐఏ కోర్టులో కోడికత్తి కేసు విచారణ జరిగింది. ఈ క్రమంలోనే కోర్టు ఆదేశాల మేరకు ఏపీ సీఎం జగన్ పర్సనల్ పీఏ కోర్టుకు హాజరయ్యారు.
Kodi Katthi Case: విశాఖపట్నం విమానాశ్రయంలో సీఎం జగన్ మోహన్ రెడ్డిపై జరిగిన కోడికత్తి దాడి కేసుపై విజయవాడ ఎన్ఐఏ కోర్డులో నేడు విచారణ జరిగింది. ఈ కేసులో సాక్షి, బాధితుడిగా ఉన్న సీఎం జగన్ కచ్చితంగా కోర్టుకు హాజరు కావాలని గత వాయిదా సందర్భంగా మేజిస్ట్రేట్ పేర్కొన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పర్సనల్ పీఏ కోర్టుకు హాజరయ్యారు. అడ్వకేట్ కమిషనర్ ద్వారా సాక్ష్యం నమోదుకు సీఎం జగన్ పిటిషన్ వేశారు. ఇప్పటికే ఎన్ఏఐ కోర్టులో సీఎం జగన్ రెండు పిటిషన్లు దాఖలు చేశారు. అలాగే రాష్ట్రానికి సీఎంగా బాధ్యతల నిర్వహణ ఉందని పిటిషన్‍లో వెల్లడించారు.
పేదలకు సంక్షేమ పథకాలు అందించే కార్యక్రమాల సమీక్షలు ఉన్నాయని వివరించారు. తాను కోర్టుకు హాజరైతే భద్రత కోసం వచ్చే వాహనాలతో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతాయని పిటిషన్ లో పేర్కొన్నారు. అందుకోసమే అడ్వకేట్ కమిషనర్‍ను నియమించి ఆయన సమక్షంలో సాక్ష్యం నమోదుకు అభ్యర్థించాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్ లేదా ఇతర మార్గాల ద్వారా సాక్ష్యం నమోదుకు వీలు కల్పించాలని కోరారు. పిటిషన్ ను పరిశీలించిన న్యాయమూర్తి విచారణ షెడ్యూల్‍ను రద్దు చేశారు. విచారణను ఈనెల 13కు వాయిదా వేశారు. అలాగే దర్యాప్తు లోతుగా జరపాలంటూ జగన్ మరో పిటిషన్ కూడా వేశారు. సీఎం పిటిషన్లపై ఈనెల 13న విచారణ జరుపుతామని ఎన్‍ఐఏ కోర్టు వివరించింది.
కోడికత్తి కేసులో అసలేం జరిగిందంటే ?
2018 అక్టోబర్ 25న 294వ రోజు పాదయాత్ర ముగించుకొని వైఎస్ జగన్ హైదరాబాద్ తిరిగి వచ్చేందుకు విశాఖపట్నం విమానాశ్రయం వచ్చారు. ఈ సందర్భంగా ఆయన వీఐపీ లాంజ్‌లో ఉండగా.. వెయిటర్..సెల్ఫీ తీసుకుంటానని అంటూ వైఎస్ జగన్ వద్దకు వచ్చారు. అతను వస్తూనే.. వైఎస్ జగన్‌పై కోళ్ల పందెలకు ఉపయోగించే కత్తితో దాడి చేశాడు. ఈ సమయంలో అప్రమత్తంగా ఉన్న వైఎస్ జగన్ సహాయకులు దాడిని అడ్డుకోవడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో వైఎస్ జగన్ భుజానికి కత్తి తగలడంతో గాయమైంది. చిన్న గాయం కావడంతో వెంటనే జగన్ విమానం ఎక్కి వెళ్లిపోయారు. హైదరాబాద్ చేరుకున్న తరవాత సిటీ న్యూరో ఆస్పత్రిలో చేరారు. ఆ ఆస్పత్రి వైద్యులు తొమ్మిది కుట్లేసినట్లుగా ప్రకటించారు. మూడు వారాల వరకూ రెస్ట్ తీసుకున్నారు. ఇది పెద్ద సంచలనం అయింది.
2019లోనే చార్జిషీటు దాఖలు చేసిన ఎన్ఐఏ
ఏపీ ప్రభుత్వ ఆధ్వర్యంలో జరుగుతున్న దర్యాప్తు మీద తమకు అనుమానాలు ఉన్నాయని హైకోర్టులో వైసీపీ నేతలు పిటిషన్ వేయడంతో కేసును కోర్టు ఎన్ఐఏకు ఇచ్చింది. విచారణ జరిపిన ఎన్‌ఐఏ 2019లోనే చార్జిషీటు దాఖలుచేసింది. ఈ దాడి కేసులో మొదటి ముద్దాయిగా జనిపల్లి శ్రీనివాస రావును పేర్కొన్నారు. చార్జిషీటుతో పాటు నిందితుడు శ్రీనివాసరావు విశాఖ జైల్‌లో రాసుకున్న 22పేజీల లేఖను కూడా కోర్టుకు అందజేశారు. ఈ కేసును రహస్యంగా విచారించాలని… విచారణకు సంబంధించిన వివరాలు మీడియాకు ఎట్టి పరిస్థితుల్లోనూ వెల్లడించ కూడదని.. మీడియా కూడా విచారణకు సంబంధించిన వివరాలు ప్రచురించ కూడదని అప్పట్లో ఎన్ఐఏ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.