Indrakeeladri: కనకదుర్గ బ్రహ్మోత్సవాలు తేదీలు ఇవే - ప్రకటించిన ఈవో, ఈసారి భారీ ఏర్పాట్లు
ఈ ఏడాది 10 రోజుల పాటు ఉత్సవాలు జరుగుతాయని ఈవో అన్నారు. పది రోజుల పాటు పది అలంకారాల్లో అమ్మవారి దర్శనం ఉంటుందని చెప్పారు.
సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 5 వరకూ దసరా ఉత్సవాలు నిర్వహించనున్నట్లుగా విజయవాడ దుర్గగుడి ఈవో డి.భ్రమరాంబ వెల్లడించారు. ఈ ఏడాది 10 రోజుల పాటు ఉత్సవాలు జరుగుతాయని అన్నారు. పది రోజుల పాటు పది అలంకారాల్లో అమ్మవారి దర్శనం ఉంటుందని చెప్పారు. మూలా నక్షత్రం రోజున సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అమ్మవారిని దర్శించుకుంటారని డి.భ్రమరాంబ చెప్పారు. కనకదుర్గ గుడి ఈవో భ్రమరాంబ గురువారం విలేకరుల సమావేశం నిర్వహించారు.
‘‘ఈ ఏడాది నెల రోజుల ముందే కో ఆర్డినేషన్ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాం. దసరా మహోత్సవాలకు టెండర్లు పూర్తయ్యాయి. ఘాట్ రోడ్డులో క్యూలైన్ల ఏర్పాటు పనులు మొదలయ్యాయి. ఈ ఏడాది 80 లక్షల రూపాయలతో ప్రత్యేకంగా విద్యుద్ధీకరణ చేపట్టాం. ఈ ఏడాది కూడా అంతరాలయ దర్శనాలు లేవు. కరోనా తగ్గుముఖం పట్టడంతో సుమారు 10 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నాం. భక్తులకు 100 రూపాయలు, 300 రూపాయలు, ఉచిత దర్శనాలు వీఐపీ బ్రేక్ దర్శనం ప్రతిపాదనలపై వచ్చే సమన్వయ కమిటీలో తుది నిర్ణయం తీసుకుంటాం.
‘‘6+1 ప్రసాదం కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నాం. తిరుపతి మాదిరి నాణ్యత కలిగిన లడ్డూ ప్రసాదం అందిస్తాం. భక్తుల కోసం ఛండీహోమం, శ్రీచక్రనవావార్చన, కుంకుమార్చనలు ఏర్పాటు చేస్తాం. కుంకుమార్చనలో పాల్గొనే వారి కోసం 20 వేల టిక్కెట్లు ఆన్ లైన్ లో ఉంచాం. భక్తులకు సాంబారు, పెరుగన్నం, బెల్లంపొంగలి అందిస్తాం. గతంలో మాదిరిగానే నగరోత్సవం నిర్వహిస్తాం. భవానీ భక్తులు దర్శనాలకు మాత్రమే రావాలి.
మాల వితరణకు అవకాశం లేదు - ఈవో
‘‘భవానీల మాల వితరణకు అవకాశం లేదు. ఆలయం, ఆలయ ప్రాంగణంలో వాటర్ ప్యాకెట్స్ బదులు ఆర్వో వాటర్ పాయింట్స్ ఏర్పాటు చేస్తున్నాం. గతేడాది రూ.9.50 కోట్లు ఆదాయంగా వచ్చింది. బ్రహ్మోత్సవాలకు రూ.3 కోట్లు ఖర్చు అయ్యింది. ఈ ఏడాది 15 కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నాం. గతంలో కన్నా ఈసారి మెరుగైన సౌకర్యాలు పెంచుతున్నాం కాబట్టి, ఈసారి బ్రహ్మోత్సవాల ఖర్చులు దాదాపు 5 కోట్ల వరకూ అవుతుందని భావిస్తున్నాం’’ అని దుర్గ గుడి ఈవో భ్రమరాంబ వెల్లడించారు.
రోజుకి 30 వేల మంది వస్తారని అంచనా
అమ్మవారి దర్శనానికి రాష్ట్రం నుంచే కాకుండా తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా హాజరయ్యే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. రోజూ 30 వేల మందికి పైగా దర్శనానికి వస్తారని అంచనా. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఈసారి ఎటువంటి ఆటంకాలు, ఏర్పాట్లు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. పోలీస్, రెవెన్యూ , మున్సిపల్, వైద్య ఆరోగ్య, ఇరిగేషన్, ఆర్అండ్ బీ, పీడబ్ల్యూడీ, అగ్నిమాపక, మత్స్య సమాచార పౌర సంబంధాలు తదితర శాఖ అధికారుల సమన్వయం చేసుకుని ఉత్సవాలను విజయవంతం జరుపుతామని ఆలయ అధికారులు స్పష్టం చేశారు.
గతేడాది అపశ్రుతి
గతేడాది దసరా ఉత్సవాల్లో అపశ్రుతి జరిగిన సంగతి తెలిసిందే. మూలా నక్షత్రం రోజున అమ్మవారిని దర్శించుకునేందుకు సీఎం జగన్ వచ్చిన సమయంలో కొండ చరియలు పడ్డాయి. మరికాసేపట్లో సీఎం జగన్ వస్తారనగా ఈ ఘటన జరిగింది. దీంతో ఇప్పటికే ఘాట్ రోడ్ ను మూసివేసి కొండరాళ్లు దొర్లిపడకుండా అధికారులు వలల్లాంటి వాటిని కప్పి ఉంచారు.