Chandrababu Bail Petition: చంద్రబాబుకు బెయిల్ ఇవ్వొద్దు, సీఐడీ 186 పేజీల కౌంటర్ - సోమవారం విచారణ
Chandrababu Bail Petition: చంద్రబాబుకు బెయిల్ ఇవ్వొద్దని ఏసీబీ కోర్టులో సీఐడీ 186 పేజీల కౌంటర్ దాఖలు చేయనుంది. సోమవారం దీనిపై జరగనుండగా.. బాబుకు బెయిల్ వస్తుందా? లేదా? అనేది ఉత్కంఠగా మారింది.
Chandrababu Bail Petition: టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌తో స్కిల్ డెవలప్‌మెంట్ కేసు వ్యవహారం హాట్‌టాపిక్‌గా మారింది. గత కొద్దిరోజులుగా ఈ కేసు చుట్టూనే ఏపీ రాజకీయాలు నడుస్తున్నాయి. ఈ కేసులో చంద్రబాబును సీఐడీ అరెస్ట్ చేయడం, రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించడంతో గత కొద్దిరోజులుగా అధికార వైఎస్సార్‌సీపీ, ప్రతిపక్ష టీడీపీ మధ్య మాటల యుద్దం నడుస్తోంది. చివరికి అసెంబ్లీ సమావేశాల్లో ఇరు పార్టీల సభ్యులు మీసం మెలేయడం, తొడలు కొట్టడం, విజిల్స్ వేయడం వరకు వెళ్లడంతో టెన్షన్ వాతావరణం క్రియేట్ అయింది.
అయితే చంద్రబాబు జైలుకెళ్లి 15 రోజులు పూర్తవ్వగా.. కోర్టుల్లో ఆయనకు ఊరట లభించడం లేదు. ఇటీవల స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబుకు బెయిల్ మంజూరు చేయాల్సిందిగా విజయవాడ ఏసీబీ కోర్టులో చంద్రబాబు తరపు లాయర్లు పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను స్వీకరించిన కోర్టు.. దీనిపై కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా సీఐడీకి ఇటీవల నోటీసులు జారీ చేసింది. దీంతో తాజాగా సీఐడీ కోర్టులో కౌంటర్ దాఖలు చేసింది. దాదాపు 186 పేజీల కౌంటర్ దాఖలు చేసింది. స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంకు సెక్షన్ 409 వర్తిస్తుందని, సెక్షన్ 17ఏ బాబుకు ఎందుకు వర్తించదనే విషయాన్ని కౌంటర్‌లో సీఐడీ పొందుపర్చింది.
అలాగే చంద్రబాబుపై కేసుకు సంబంధించిన దర్యాప్తు వివరాలతో పాటు సేకరించిన ఆధారాలను కూడా కౌంటర్‌లో సీఐడీ పొందుపర్చింది. సీఐడీ కౌంటర్ దాఖలు చేయడంతో సోమవారం చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై వానదలు జరిగే అవకాశం కనిపిస్తుంది. చంద్రబాబుపై దాఖలైన కేసులో సెక్షన్ 17ఏ అనేది కీలకంగా మారింది. ఇది బాబుకు వర్తిస్తుందని చంద్రబాబు తరపు న్యాయవాదులు చెబుతున్నారు. దీని ప్రకారం అరెస్ట్ చేసేముందు గవర్నర్ అనుమతి తీసుకోవాలని వాదిస్తున్నారు. కానీ సీఐడీ మాత్రం అది చంద్రబాబుకు వర్తించదని చెబుతోంది. ఏసీబీ, హైకోర్టులో ఈ విషయాన్ని చంద్రబాబు తరపు న్యాయవాదులు బలంగా విదించినా.. ఊరట మాత్రం లభించలేదు.
తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయాల్సిందిగా చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను ఏపీ హైకోర్టు శుక్రవారం కొట్టివేసింది. కేసు దర్యాప్తు ప్రాథమిక దశలో ఉన్నందున తాము జోక్యం చేసుకోలేమని తెలిపింది. దీనిని సవాల్ చేస్తూ ఇవాళ సుప్రీంకోర్టును చంద్రబాబు ఆశ్రయించారు. ఈ మేరకు చంద్రబాబు తరపున ఆయన న్యాయవాదులు సుప్రీంలో క్వాష్ పిటిషన్ దాఖలు చేయగా.. దీనిపై సోమవారం విచారణ జరగనుంది. అలాగే అదే రోజు ఏసీబీ కోర్టులో బెయిల్ పిటిషన్‌పై విచారణ జరగనుంది. దీంతో చంద్రబాబు కేసులకు సంబంధించి సోమవారం ఏం జరుగుతుందనేది ఉత్కంఠ రేపుతోంది.
చంద్రబాబుకు బెయిల్ వస్తుందనే ఆశతో టీడీపీ శ్రేణులు ఉన్నారు. ఇక క్వాష్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో అయినా బాబుకు ఊరట వస్తుందేమోనని టీడీపీ నేతలు ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం చంద్రబాబును రెండు రోజుల పాటు కస్టడీలోకి తీసుకునేందుకు ఏసీబీ కోర్టు అనుమతించింది. దీంతో ఇవాళ చంద్రబాబును సీఐడీ కస్టడీలోకి తీసుకుంది. నేడు రాజమండ్రి సెంట్రల్ జైల్లో బాబును విచారించగా.. 50 ప్రశ్నలను సీఐడీ లేవనెత్తినట్లు తెలుస్తోంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రశ్నించారు. ఇక రేపు కూడా చంద్రబాబును సీఐడీ అధికారులు ప్రశ్నించనున్నారు.