Chandrababu Traffic: ఢిల్లీకి చంద్రబాబు, ట్రాఫిక్ ఆపడంపై అభ్యంతరం, పోలీసులకు సూచనలు
AP Latest News: కరకట్టలోని చంద్రబాబు నివాసం నుంచి కాన్వాయ్ వెళ్తున్న క్రమంలో సాధారణ ట్రాఫిక్ ను పోలీసులు నిలిపివేయడం పట్ల చంద్రబాబు అభ్యంతరం వ్యక్తం చేశారు.
Chandrababu Leaves to Delhi: టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ఉండవల్లి కరకట్టలోని ఆయన నివాసం నుంచి చంద్రబాబు కాన్వాయ్ వెళ్తున్న క్రమంలో సాధారణ ప్రజల వాహనాలను పోలీసులు నిలిపివేయడం పట్ల చంద్రబాబు అభ్యంతరం తెలిపారు. ట్రాఫిక్ ఆపొద్దని భద్రతా సిబ్బందికి చంద్రబాబు సూచించారు. వీఐపీ సెక్యూరిటీ పేరుతో కాన్వాయ్ వెళ్లే దారిలో గంటల తరబడి వాహనాలు నిలిపేసే విధానాలకు స్వస్తి పలకాలని కోరారు. తక్షణమే సంబంధిత అధికారులకు ఈ మేరకు సమాచారం ఇవ్వాలని తన సీఎస్ఓను చంద్రబాబు ఆదేశించారు.
ఉండవల్లి నివాసం నుంచి ఎయిర్ పోర్టుకు వెళ్లే లోపులోనే గుంటూరు ఎస్పీ, విజయవాడ సీపీలకు చంద్రబాబు భద్రతా సిబ్బంది సమాచారం ఇచ్చారు. కాన్వాయ్ సమీప ప్రాంతానికి వచ్చినప్పుడు అతి తక్కువ సమయం మాత్రమే పౌరుల వాహనాలు నియంత్రించి వాహనదారులు ఇబ్బంది పడకుండా చూడాలన్న చంద్రబాబు సూచనను ఉన్నతాధికారులకు సీఎస్ఓ తెలిపారు. భవిష్యత్తులో కూడా సామాన్య ప్రజలకు, వాహన దారులకు ఇబ్బంది లేకుండా చూసుకోవాలని చంద్రబాబు సూచించారు.
భద్రతా చర్యలు పాటిస్తూనే సాధారణ ప్రజలకు ఇబ్బందులు లేకుండా తన రాకపోకలు ఉండేలా చూడాలని చంద్రబాబు నాయుడు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. బారికేడ్లు, పరదాలు, రోడ్లు మూసివేత, షాపుల బంద్ వంటి పోకడలకు ఇక స్వస్థి చెప్పాలన్న ఆలోచనలో చంద్రబాబు నాయుడు ఉన్నారని పార్టీ వర్గాలు తెలిపాయి.
రేపు ఎన్డీఏ పక్ష సమావేశానికి హాజరు
జూన్ 7 శుక్రవారం ఎన్డీయే పక్షాల భేటీలో చంద్రబాబు పాల్గొననున్నారు. టీడీపీలో గెలిచిన ఎంపీలతో పాటుగా ఎన్డీఏ పక్షాల భేటీలో చంద్రబాబు పాల్గొననున్నారు.