సీపీఎస్ ఉద్యోగుల చలో విజయవాడ వాయిదా- మళ్లీ ఎప్పుడంటే?
సీపీఎస్ రద్దు కోరుతూ కొన్ని ఉద్యోగ సంఘాలు పిలుపు ఇచ్చిన చలో విజయవాడ కార్యక్రమం వాయిదా పడింది. ప్రభుత్వ ఆంక్షలు కారణంగా వాయిదా వేసుకున్నట్టు ఉద్యోగులు ప్రకటించారు.
సెప్టెంబర్ 1న జరగాల్సిన చలో విజయవాడ కార్యక్రమాన్ని ఉద్యోగులు వాయిదా వేసుకున్నారు. దీన్ని సెప్టెంబర్ 11న నిర్వహించబోతున్నట్టు వెల్లడించారు. పాదయాత్రలో జగన్ హామీ ఇచ్చినట్టుగానే సీపీఎస్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు ఉద్యోగులు.
ప్రభుత్వం మాత్రం సీపీఎస్ రద్దు కుదరదని... అప్పట్లో తెలియకుండానే ఈ హామీ ఇచ్చామని... ఇది రద్దు చేస్తే చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందంటోంది. దీనికి బదులు ఉద్యోగులకు ఫలప్రదమైన జీపీఎస్ ఇస్తామంటూ చర్చలు జరుపుతోంది.
ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై ఉద్యోగులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ప్రభుత్వం చర్యను తప్పుపడుతున్నారు. ఎప్పటికప్పుడు ప్రభుత్వం మోసం చేస్తూ వస్తుందని ఆక్షేపిస్తున్నారు. వీటన్నింటికి వ్యతిరేకంగా చలో విజయవాడ పిలుపునిచ్చింది ఏపీసీపీఎస్‌ఈఏ.
పదిహేను రోజుల క్రితం సమావేశమైన ఏపీసీపీఎస్‌ఈఏ ఉద్యోగులు చలో విజయవాడ సెప్టెంబర్ 1న నిర్వహిస్తున్నట్టు ప్రకటించారు. అదే రోజు సీఎం ఇంటిని ముట్టడిస్తామని ఈ లోపు ఇచ్చిన హామీని ప్రభుత్వం నెరవేర్చాలని డిమాండ్ చేశారు. మిలినియం మార్చ్ పిలుపుతో కొన్ని ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం చర్చలు జరిపింది. వాటిలో ఎలాంటి ప్రయోజనం కనిపించలేదు. ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టమైన ప్రకటన రాకపోయేసరికి చలో విజయవాడ జరుగుతుందని సీపీఎస్ ఉద్యోగులు ప్రకటించారు.
#APCPSEA# pic.twitter.com/HTA0ucFuzq
— Sateesh Kapuganti (@SateeshKapugan3) August 29, 2022
ఉద్యోగులు వెనక్కి తగ్గకపోవడంతో ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ఇందులో యాక్టివ్‌గా ఉన్న వారిపై పోలీసులు, అధికారులు ప్రత్యేక నిఘా పెట్టారు. అలాంటి వారిని నిర్బంధించారు. బైండోవర్ కేసులు పెట్టి ఊరు దాటి వెళ్లొద్దని నోటీసులు ఇచ్చారు. మరికొందరిపై కేసులు కూడా పెట్టారని ఆరోపణలు కూడా ఉన్నాయి. సెప్టెంబర్ 1న సీపీఎస్ ఉద్యోగులు తలపెట్టే చలో విజయవాడను భగ్నం చేయడానికి అనుసరించాల్సిన వ్యూహాన్ని ప్రభుత్వం అమలు చేసింది. ప్రైవేటు హోటల్, బస్సులపై ప్రత్యేక నిఘా పెట్టింది. విజయవాడ వచ్చే వారిపై కూడా కన్నేసి ఉంచింది.
ఈ ఆంక్షలతో సీపీఎస్ ఉద్యోగులు వెనక్కి తగ్గారు. ప్రస్తుత పరిస్థితుల్లో చలో విజయవాడ వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. సెప్టెంబర్1 నిర్వహించే ఆందోళన కార్యక్రమానికి అనుమతి ఇవ్వాలని పోలీసులకు రిక్వస్ట్ పెట్టామని... అయినా ఇంత వరకు పోలీసులు ఎలాంటి నిర్ణయాన్ని ప్రకటించలేదన్నారు ఉద్యోగ సంఘాలు. కానీ ఇంతలోనే ఉద్యోగులను హింసించే పనికి ప్రభుత్వం తెరలేపిందని... ఉద్యోగుల్లో ఓ భయాందోళన వాతావరణం సృష్టించిందని ఆరోపించాయి ఉద్యోగ సంఘాలు. అందుకే ప్రస్తుత పరిస్థితుల్లో చలో విజయవాడ కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. చలో విజయవాడ కార్యక్రమాన్ని సెప్టెంబర్ 11న నిర్వహించబోతున్నట్టు వెల్లడించారు.