రాజ్యసభలో రంగా ప్రస్తావన- విజయవాడ ఎయిర్‌పోర్టు ఆయన పేరు పెట్టాలని జీవీఎల్ డిమాండ్
వంగవీటి మోహన్ రంగా పేరును ఆంధ్రప్రదేశ్‌లో ఏదో ఒక జిల్లాకు పెట్టాలని చాలా డిమాండ్లు వచ్చాయని గుర్తు చేశారు జీవీఎల్. అయినా ఎందుకో అక్కడి ప్రభుత్వం ఆ విధంగా నిర్ణయం తీసుకోలేదన్నారు.
పార్లమెంట్‌లో రంగా ప్రస్తావన తీసుకొచ్చారు బీజేపీ సభ్యులు జీవీఎల్ నరసింహారావు. జీరో అవర్‌లో మాట్లాడిన జీవీఎల్... రంగా ప్రస్తావన తీసుకొచ్చారు. ఆయన కీలక రాజకీయ నాయకుడిగా ఎదుగుతున్న టైంలో కొందరు ద్రోహులు హతమార్చారన్నారు. ఆయన ప్రజల కోసం పాటుపడ్డ నాయకుడని.. అందుకే ఆంధ్రప్రదేశ్‌లో ఏదో జిల్లాకు ఆయన పేరు పెట్టాలని డిమాండ్ చేశారు.
వంగవీటి మోహన్ రంగా పేరును ఆంధ్రప్రదేశ్‌లో ఏదో ఒక జిల్లాకు పెట్టాలని చాలా డిమాండ్లు వచ్చాయని గుర్తు చేశారు జీవీఎల్. అయినా ఎందుకో అక్కడి ప్రభుత్వం ఆ విధంగా నిర్ణయం తీసుకోలేదన్నారు. ఇప్పటికైనా కృష్ణా, మచిలీపట్నం జిల్లాల్లో దేనికో ఒకదానికి వంగవీటి రంగా పేరు పెట్టాలని డిమాండ్ చేశారు.
విజయవాడ కేంద్రంగా వంగవీటి రంగా ప్రజలకు సేవ చేశారని... అందుకే విజయవాడలోని విమానాశ్రయానికి ఆయన పేరు పెట్టాలని డిమాండ్ చేశారు.
రాజ్యసభలో జీవీఎల్ ఏమన్నారంటే... వంగవీటి మోహన్ రంగా అంటే తెలియని తెలుగువారు లేరు. పేదలకు, బడుగు బలహీన వర్గాలకు ఆరాధ్య దైవంగా తెలుగు ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు కొలుస్తుంటారు. అత్యంత పెద్దదైన కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి మోహన్ రంగా కేవలం ఒక్కసారే ఎమ్మెల్యేగా పనిచేశారు. రెండున్నరేళ్లే పదవిలో ఉన్నప్పటికీ గొప్ప ప్రజానాయకుడిగా పేరుపొందారు. 1986 డిసెంబర్‌లో వంగవీటి మోహన్ రంగాను కొందరు ద్రోహుల హత్య చేశారు. ఆయనో రాజకీయ శక్తిగా రాష్ట్రంలో ఎదుగుతున్న తరుణంలో ప్రజానాయకుడిగా గుర్తింపు పొంది కాపునాడు సభలను రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్నటైంలో హత్య చేశారు.
అనేక మంది పేదలు, కాపు ప్రజలు వచ్చి ఆయన్ని సమర్ధించిన టైంలో హత్య జరిగింది. ఈ హత్య చాలా మందిని దిగ్భ్రాంతి పరిచింది. ఆయన చనిపోయి 36 సంవత్సరాలు అయినా ప్రజలు ఆయన్ని తలుచుకుంటారు. అందుకే వంగవీటి మోహన్ రంగా పేరుతో ఒక జిల్లా పెట్టాలనే ప్రస్తావన రాష్ట్రంలో విస్తృతంగా వచ్చింది. అయినప్పటికీ దురదృష్టవశాత్తు అది జరగలేదు. రాష్ట్రంలో ఇతర నాయకుల పేర్లతో జిల్లాలు పెట్టారు కానీ... వంగవీటి రంగా పేరు పెట్టడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఎందుకు మనస్కరించలేదు. అలాంటి మహా వ్యక్తిని గుర్తు చేసుకునేలా ప్రభుత్వం పునరాలోచించి కృష్ణా, మచిలీపట్నం జిల్లాల్లో ఒకదానికి వంగవీటి రంగా పేరు పెట్టాలి. అలాగే విజయవాడ అంతర్జాయ ఎయిర్‌పోర్టకు వంగవీటి రంగా పేరు పెట్టాలని సివిల్ ఏవియేషన్ మినిస్టర్‌కు రిక్వస్ట్ చేస్తున్నాను . అని సభకు వివరించారు.