AP Floods Donation: వరద బాధితుల కోసం విద్యుత్ ఉద్యోగులు భారీ విరాళం, సీఎం చంద్రబాబుకు చెక్కు అందజేత
Andhra Pradesh News | ఏపీలో వరద బాధితులను ఆదుకునేందుకు విద్యుత్ శాఖ ఉద్యోగులు ముందుకొచ్చారు. ఒకరోజు జీతం రూ. 10,61,81,614 విరాళం చెక్కును సీఎం చంద్రబాబుకు అందజేశారు.
AP Electricity Employees Donation | అమరావతి: వరద బాధితులను ఆదుకునేందుకు విద్యుత్ శాఖ ఉద్యోగులు ముందుకొచ్చారు. వరద భాదితులను ఆదుకునేందుకు భారీ విరాళాన్ని ప్రకటించారు. విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ నేతృత్వంలో విద్యుత్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ లో ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. విద్యుత్ శాఖ ఉద్యోగుల ఒకరోజు జీతాన్ని రూ. 10,61,81,614 లను ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళంగా ఇచ్చారు.
విజయవాడలో వరద బాధితులను ఆదుకుందామని పిలుపు
అనంతరం ఏపీ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ మాట్లాడుతూ... వరదలతో నష్టపోయిన వారిని ఆదుకోవడానికి విద్యుత్ ఉద్యోగులు ముందుకు రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. విద్యుత్ శాఖ ఉద్యోగులు ఒకరోజు జీతాన్ని రూ. 10,61,81,614 సీఎం చంద్రబాబుకు అందజేశారు. విజయవాడ నగరంలో వరదల వల్ల నష్టపోయిన బాధితులను ఆదుకోవడంలో గత 10 రోజులుగా సీఎం చంద్రబాబు ఎంతో ముందుచూపుతో వ్యవహరిస్తున్నారు. స్వయంగా రంగంలోకి బాధితులకు అండగా నిలవడంతో పాటు పెద్దఎత్తున ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకున్నారని మంత్రి గొట్టిపాటి ప్రశంసించారు.
రాత్రి, పగలూ అనే తేడా లేకుండా చంద్రబాబు సేవలు
70 ఏళ్లకు పైబడినా కూడా సీఎం చంద్రబాబు క్షేత్రస్థాయిలో రంగంలోకి దిగి రాత్రింబవళ్లు అనే తేడా లేకుండా ప్రజలకు సేవ చేయడాన్ని ఆయన కొనియాడారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు అందిస్తున్న సేవలకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చిందన్నారు. విద్యుత్ ఉద్యోగులు వరద ప్రభావిత ప్రాంతాల్లో పని చేస్తూ తమ వంతుగా కష్టకాలంలో విలువైన సేవలు అందిస్తున్నారని మంత్రి గొట్టిపాటి రవికుమార్ చెప్పారు. విద్యుత్ ఉద్యోగులు సమిష్టి కృషి కారణంగా తక్కువ సమయంలోనే 3- 4 లక్షల విద్యుత్ కనెక్షన్ల పునరుద్ధరణ చేశామన్నారు.
విద్యుత్ శాఖ ప్రజల జీవితాల్లో వెలుగులు నింపడడంతో పాటు ఆపదలో ఉన్న వారిని ఆదుకునేందుకు కూడా ముందుంటారని విద్యుత్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కే. విజయానంద్ అన్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితులు తలెత్తినప్పుడు ప్రాణాలు సైతం లెక్క చేయకుండా విద్యుత్ ఉద్యోగులు పని చేస్తారని అన్నారు. ప్రస్తుతం సైతం రాష్ట్రంలో వరద బాధితులను ఆదుకునేందుకు ముందుకు వచ్చి, వీలులేని చోట సైతం విద్యుత్ కనెక్షన్లు పునరుద్ధరించారని తెలిపారు. సీఎం చంద్రబాబును కలిసి విద్యుత్ ఉద్యోగుల విరాళం చెక్కును అందజేసిన వారిలో ఏపీ ట్రాన్స్కో జేఎండీ కీర్తి చేకూరి, ఏపీ జెన్కో ఎండీ కేవీఎన్ చక్రధర్ బాబు, సీపీడీసీఎల్ సీఎండీ పట్టంన్ శెట్టి రవి సుభాష్, విద్యుత్ ఇంజనీర్ల అసోషియేషన్ ప్రతినిధులు, విద్యుత్ ఉద్యోగుల ఐకాస ప్రతినిధులు పాల్గొన్నారు.
ఇదివరకే పోలీస్ శాఖ వరద బాధితులను ఆదుకునేందుకు భారీ విరాళం అందించింది. ఏపీ పోలీస్ అధికారుల సంఘం రూ.11.20 కోట్ల మేర విరాళం చెక్కును ఇటీవల సీఎం చంద్రబాబును కలిసి అందజేశారు. సీఎం చంద్రబాబు పిలుపు మేరకు ఇలా ఒక్కోశాఖ వరద బాధితులను ఆదుకునేందుకు సీఎం సహాయనిధికి విరాళాలు ఇస్తున్నారు. వీరితో పాటు టాలీవుడ్ సినీ, రాజకీయ, వ్యాపార, ఇతర రంగాల ప్రముఖులు తోచినంత సాయం చేస్తున్నారు.
Also Read: Nara Lokesh: 'లక్షలాది మంది జలసమాధి అయ్యేలా జగన్ కుట్ర' - మంత్రి నారా లోకేశ్ సంచలన ట్వీట్