Nara Lokesh: 'లక్షలాది మంది జలసమాధి అయ్యేలా జగన్ కుట్ర' - మంత్రి నారా లోకేశ్ సంచలన ట్వీట్
Andhra News: ప్రకాశం బ్యారేజీ డ్యాం గేట్లను మర పడవలు ఢీకొన్న ఘటనపై మంత్రి నారా లోకేశ్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. లక్షలాది మంది జల సమాధి అయ్యేలా సైకో జగన్ పన్నిన కుట్ర బయటపడిందన్నారు.
Nara Lokesh Tweet On YS Jagan In Prakasam Barrage Boat Issue: వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌పై (Jagan) మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. వరద ముంపునకు ప్రభుత్వమే కారణమంటూ వైసీపీ విష ప్రచారం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. లక్షలాది మంది జల సమాధి అయ్యేలా సైకో జగన్ పన్నిన కుట్ర బట్టబయలైందన్నారు. ఈ మేరకు సంచలన ట్వీట్ చేశారు. వైసీపీ కుట్రలు బయటపడకుండా ఆ పార్టీ నేతలు ఇలా చేస్తున్నారని మండిపడ్డారు. 'అధికారం అండతో సైకో జగన్ తన ఇసుక మాఫియా కోసం అన్నమయ్య డ్యాం కొట్టుకుపోయేలా చేసి 50 మందిని చంపారు. ఏకంగా 5 ఊళ్లను నామరూపాలు లేకుండా చేశారు. ఇదే ప్లాన్‌తో ఇనుప పడవలతో ప్రకాశం బ్యారేజీని ఢీకొని కూల్చేయాలనే కుట్ర చేశారు. విజయవాడతో పాటు పదుల సంఖ్యలో లంక గ్రామాల నామరూపాలు లేకుండా చేసి లక్షల మంది జలసమాధి అయ్యేలా జగన్ పన్నిన కుట్ర బట్టబయలైంది. దీనికి ప్లాన్ చేసింది సైకో జగన్ అయితే.. అమలు చేసింది వైసీపీ ఎమ్మెల్సీ తలశిల రఘురాం, మాజీ ఎంపీ నందిగం సురేశ్.' అని ట్వీట్‌లో పేర్కొన్నారు.
అధికారం అండగా సైకో జగన్ తన ఇసుక మాఫియా కోసం అన్నమయ్య డ్యాం కొట్టుకుపోయేలా చేసి 50 మందిని చంపేసి, 5 ఊర్లు నామరూపాలు లేకుండా చేశారు. ఇదే ప్లాన్ ప్రకారం ఇనుప పడవలతో ప్రకాశం బ్యారేజి ఢీకొని కూల్చేసి, విజయవాడతో పాటు పదుల సంఖ్యలో లంక గ్రామాలు నామ రూపాలు లేకుండా చేసి, లక్షలాది మంది… pic.twitter.com/HQoe7RINA6
— Lokesh Nara (@naralokesh) September 10, 2024
పడవల తొలగింపు ప్రారంభం
మరోవైపు, ప్రకాశం బ్యారేజీ వద్ద పడవల తొలగింపు ప్రక్రియ ప్రారంభమైంది. జల వనరుల శాఖ ఇంజినీర్లు, సిబ్బంది 2 భారీ క్రేన్లతో తొలగింపు చర్యలు చేపట్టారు. 50 టన్నుల బరువు ఎత్తే సామర్థ్యం ఉన్న భారీ క్రేన్ల సాయంతో పనులు నిర్వహిస్తున్నారు. బ్యారేజీలోని 67, 68, 69 గేట్ల వద్ద 4 భారీ పడవలు ఈ నెల 1న ఎగువ నుంచి వచ్చి బ్యారేజీని ఢీకొనగా కౌంటర్ వెయిట్లు దెబ్బతిన్నాయి. బోల్తా పడిన పడవలను అక్కడి నుంచి తొలగించి దిగువకు పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం బ్యారేజీ వద్ద 2,09,937 క్యూసెక్కుల వరద దిగువకు వెళ్తోంది. ఈ ప్రవాహం కొనసాగుతుండగానే.. 68, 69 గేట్లను మూసేసి తొలగింపు ప్రక్రియ చేపడుతున్నారు.
'అది దేశ ద్రోహమే'
ప్రకాశం బ్యారేజీని కూల్చడం ద్వారా లక్షలాది మందిని రిస్కులో పెట్టాలనుకున్నారని.. ఇది దేశ ద్రోహమేనని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత మండిపడ్డారు. బ్యారేజీలోకి బోట్లు కొట్టుకొచ్చిన ఘటనలో భారీ కుట్ర ఉందని.. వైసీపీకి చెందిన వారు బ్యారేజీని డ్యామేజీ చేసే ఉద్దేశంతో వాటిని నదిలో వదిలిపెట్టారని అన్నారు. అన్ని బోట్లు కలిపి ఒకేసారి బ్యారేజీని తాకేలా చూశారన్నారు.