Purandeswari: ప్రతి కార్యకర్త సహకారం వల్లే పార్టీ బలోపేతం సాధ్యం - బీజేపీ నేతల సమావేశంలో పురంధేశ్వరి
విజయవాడలో జరిగిన ఈ సమావేశానికి పదాధికారులతో పాటు రాష్ట్రస్థాయి , జిల్లాస్థాయి నేతలు హాజరు అయ్యారు.
బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి అధ్యక్షతన రాష్ట్ర స్థాయి పదాధికారుల సమావేశం నేడు (జూలై 16) జరిగింది. విజయవాడలో జరిగిన ఈ సమావేశానికి పదాధికారులతో పాటు రాష్ట్రస్థాయి , జిల్లాస్థాయి నేతలు హాజరు అయ్యారు. ప్రస్తుతం నెలకొన్న తాజా రాజకీయాలు బీజేపీ భవిష్యత్తు ప్రణాళికపై సమావేశంలో ప్రధానంగా చర్చ జరిగింది. ఎన్నికల ఏడాది కావడంతో కమిటీలను వాటి నియామకాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. వైసీపీ ప్రభుత్వం వైఫల్యాలు లక్ష్యంగా వెళ్లాలని ఇప్పటికే బీజేపీ అదిష్టానం నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే.
ఈ సందర్భంగా పురంధేశ్వరి మాట్లాడుతూ.. ప్రతి కార్యకర్త తనకు సహకారం అందించినప్పుడే పార్టీ బలోపేతం సాధ్యం అవుతుందని అన్నారు. క్షేత్ర స్థాయిలో పార్టీని ప్రజలకు చేరువ చేసేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని నిర్దేశించారు. ఏపీలో ప్రజా వ్యతిరేక ప్రభుత్వం నడుస్తోందని అన్నారు. మద్యం డిస్టిలరీస్ అన్నీ అధికార పార్టీ పెద్దల సన్నిహితులకే ఇచ్చారని విమర్శించారు. మద్యం అమ్మకాల్లో పెద్ద ఎత్తున కుంభకోణం జరుగుతోందని ఆరోపించారు.
2014 తర్వాత పార్టీని బలోపేతం చేయడానికి ఒంటరిగా ఎన్నికలకు వెళ్లాలని చాలా మంది సూచించారని గుర్తు చేశారు. అయితే పార్టీని బలోపేతం చేసుకునే దిశగా ముందు కసరత్తు చేయాలని అధినాయకత్వం సూచించిందని అన్నారు. పార్టీని బలోపేతం చేయడంతో పాటు.. రాజకీయంగా అమలు చేయాలని అనుకుంటున్న వ్యూహాలపైన కూడా ఆలోచించాలని అన్నారు. ఎన్నికలకు ఇంకా కొద్ది నెలల సమయం మాత్రమే ఉందని అన్నారు. అన్ని స్థాయిల్లోని కమిటీలను బలోపేతం చేసుకోవాల్సిన ఉంటుందని బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి చెప్పారు. పార్టీని బలోపేతం చేయడం తన ఒక్కరి వల్లే సాధ్యం కాదని, అందరి సహకారం కావాలని కోరారు.