AP News: నది దాటుతూ ఏపీకి చెందిన ముగ్గురు సైనికుల మరణం, విజయవాడకు మృతదేహాలు
Gannavaram Airport: లద్దాఖ్ వద్ద నది దాటే ప్రయత్నంలో మృతి చెందిన ఐదుగురు సైనికుల్లో ఆంధ్రప్రదేశ్ చెందిన వారి ముగ్గురు మృతదేహాలు గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నాయి.
Telugu Latest News: కేంద్ర పాలిత ప్రాంతం అయిన లద్దాఖ్ లో ఓ నది దాటే ప్రయత్నంలో మృతి చెందిన ఐదుగురు సైనికుల్లో ఆంధ్రప్రదేశ్ చెందిన వారి ముగ్గురు మృతదేహాలు గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నాయి. వాస్తవాధీన రేఖ సమీపంలో టి-72 యుద్ధ ట్యాంకులో వెళుతున్నప్పుడు లేహ్ కు 148 కిలో మీటర్ల దూరంలో శనివారం (జూన్ 29) మంచు కరిగి శ్యోక్ నదికి వరదలు వచ్చి ట్యాంకు కొట్టుకుపోయింది.
ఈ దుర్ఘటనలో ప్రకాశం జిల్లా రాచర్ల మండలం కాల్వపల్లె గ్రామానికి చెందిన జూనియర్ కమిషన్డ్ అధికారి (జేసీవో) ముత్తుముల రామకృష్ణారెడ్డి మృతి చెందారు.
ఈ ప్రమాదంలోనే కృష్ణా జిల్లా పెడన మండలం చేవేండ్ర గ్రామానికి చెందిన సైనికుడు సాదరబోయిన నాగరాజు (32) మరణించారు. ధనలక్ష్మి, వెంకన్నల కుమారుడైన నాగరాజుకు ఐదేళ్ల కిందట మంగాదేవితో పెళ్లయింది. వారికి ఏడాది పాప ఉంది. నాగరాజు సోదరుడు శివయ్య కూడా సైనికుడిగా సేవలందిస్తున్నారు.
బాపట్ల జిల్లా రేపల్లే మండలం ఇస్లాంపూర్ కు చెందిన సుభాన్ ఖాన్ కూడా మరణించారు. ఇతను 17 ఏండ్ల క్రితం సైనికుడిగా చేరి అంచెలంచెలుగా హవల్దార్ స్థాయికి ఎదిగారు. ప్రస్తుతం ఈఎంఈ మెకానికల్ విభాగంలో పనిచేస్తున్నారు. ఇస్లాంపూర్ లో సుమారు 100 ఇళ్లు ఉండగా దాదాపు ప్రతి ఇంటి నుంచి ఇద్దరు సైనికులు సెలక్ట్ అయ్యారు. వీరిలో కొందరు రిటైర్డ్ అయ్యారు.
నారా లోకేశ్ దిగ్భ్రాంతి
ఏపీకి చెందిన ముగ్గురు జవాన్లు మృతి పట్ల నారా లోకేష్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. లద్దాఖ్ ప్రమాదంలో సాదరబోయిన నాగరాజు, సుభానా ఖాన్, ఎం. ఆర్కే రెడ్డి మృతి చెందటం బాధాకరం అని అన్నారు. ‘‘వారి ఆత్మకు శాంతిని చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబ సభ్యులకు ప్రభుత్వం అన్నివిధాలా అండగా ఉంటుంది’’ అని అన్నారు.