Amaravati 2.0: అమరావతి 2.0 వేడుకకు జగన్, షర్మిలను ఆహ్వానించిన చంద్రబాబు- ఇద్దరూ రావడం అనుమానమే!
Amaravati 2.0: అమరావతి పనుల పునఃప్రారంభోత్సవానికి వైఎస్ జగన్, షర్మిలను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆహ్వానించారు. అంగరంగ వైభవంగా సాగే వేడుక కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది.

అమరావతిలో పెద్ద పండుగకు అంతా రెడీ అయింది. ప్రధాని మోదీ వచ్చేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా జరపడానికి ఏపీ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. అందులో భాగంగా వైఎస్ జగన్, వైఎస్ షర్మిలకు ఏపీ ప్రభుత్వం ఆహ్వానం పంపడం ఏపీ రాజకీయాల్లో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది
జగన్, షర్మిలకు ప్రత్యేకంగా ఆహ్వానం పంపించిన చంద్రబాబు.
రాజకీయ ప్రత్యర్థులుగా కాకుండా బద్దశత్రువులుగా మారిపోయిన చంద్రబాబు వైఎస్ జగన్ మధ్య ఏం జరిగినా అది రాజకీయ సంచలనంగా మారుతూ వస్తోంది. అమరావతిలో జరుగుతున్న పునర్నిర్మాణ పనులకు జగన్ ఆహ్వానం ఉంటుందని ఎవరూ భావించలేదు. కారణం అధికారికంగా ఆయనకు ప్రతిపక్ష హోదా కూడా లేదు. పైపెచ్చు అమరావతికి బద్ద విరోధిగా జగన్‌పై ఒక ముద్ర పడిపోయింది.
మూడు రాజధానుల పేరుతో అమరావతికి క్యాపిటల్ హోదా దక్కకుండా చేయాలని జగన్ ప్రయత్నించారని అమరావతి రైతుల్లో బలమైన ముద్ర ఉంది. మూడు రాజధానుల బిల్లు తదనంతర అమరావతి ఉద్యమం సమయంలో రైతులపై పెట్టిన కేసులు పడిన లాఠీ దెబ్బలు జగన్ పట్ల ఒక విధమైన కోపాన్ని అమరావతి రైతుల్లో నింపేశాయి. అది 2024 ఎన్నికల్లో ప్రస్ఫుటంగా కనపడింది కూడా.
కాబట్టి ఆరేళ్ల గ్యాప్ తర్వాత మళ్ళీ మొదలవుతున్న అమరావతి పునర్నిర్మాణ పనుల శంకుస్థాపనకు జగన్‌కు ఆహ్వానం ఉండదనే అందరూ భావించారు. చంద్రబాబు మాత్రం ప్రతి రాజకీయ నాయకుడిని ఈ కార్యక్రమంలో భాగం చేయాలని ఆహ్వానాలు పంపుతూ వస్తున్నారు. దానిలో భాగంగానే వైఎస్ జగన్‌కు ఆహ్వానం వెళ్ళినట్టు తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిలకి ఆహ్వానం వెళ్ళింది. అయితే ఆమె రాష్ట్రానికి మోడీ రాకను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అమరావతిలో నిరసన తెలియజేయడానికి వెళ్లి అరెస్టు కూడా అయ్యారు. అయినప్పటికీ ఆమెకు ఆహ్వానం పంపింది ఏపీ ప్రభుత్వం. వైఎస్ జగన్ ప్రస్తుతం రాష్ట్రంలో అందుబాటులోనే ఉన్నారు. షర్మిల మాత్రం బెంగళూరు వెళ్ళిపోయారు. వీరిద్దరూ అమరావతి పనుల ప్రారంభోత్సవానికి హాజరయ్యే అవకాశం కనిపించడం లేదు.
అందర్నీ కలుపుకుని వెళ్లే ప్రయత్నం చేస్తున్న చంద్రబాబు
2014-19 మధ్యకాలంలో సీఎంగా ఉన్న చంద్రబాబు హయాంలోనే అమరావతి పనులకు ప్రారంభోత్సవం జరిగింది. అయితే సమయంలో చంద్రబాబు ఏకపక్షంగా వ్యవహరించారనే ప్రచారం విపక్షాలు గట్టిగా చేశాయి. కానీ ఈసారి ఎటువంటి పొరపాటు జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు. అమరావతి రైతులతో సమావేశం జరపడం, వారందరినీ సభకు ఆహ్వానించారు. ప్రతి రాజకీయ పార్టీ కీలక నేతలకు ఆహ్వానాలు పంపారు. మంత్రులకు విభాగాల వారీగా బాధ్యతలు అప్పజెప్పారు. రెండుసార్లు ఢిల్లీ వెళ్లి ప్రధాని మోదీని ఆహ్వానించారు. ఇలా ఎక్కడా ఎటువంటి లోటుపాట్లు జరగకుండా
జాగ్రత్తలు తీసుకుంటున్నారు చంద్రబాబు.
వస్తున్న ప్రజలకు ఎక్కడా ఇబ్బంది కలగకుండా కూర్చొన్న చోటికి భోజనాలు వచ్చేలా ఏర్పాటు చేశారు. ఇలాంటి సమయంలో ఇబ్బందిగా మారే ట్రాఫిక్ సమస్యకి కూడా ముందుగానే నిర్దిష్టమైన ప్రణాళిక ఏర్పాటు చేసుకుంటూ వచ్చారు. కాశ్మీర్ ఘటన దృష్ట్యా ప్రధాని కార్యక్రమానికి భద్రతను మరింత పెంచినా సామాన్యులకది అర్థం అయ్యేలాగా ముందు నుంచే ప్రచారం చేస్తూ వస్తున్నారు.
శుక్రవారం విజయవాడ మొత్తం ట్రాఫిక్ బంద్ కానుంది. కానీ ఆ విషయాన్ని సక్సెస్ ఫుల్‌గా ప్రజల దృష్టిలో పెట్టారు. కీలకమైన పనులన్నీ ముగియడంతో అమరావతి 2.0 పనుల ప్రారంభోత్సవానికి ఏపీ మొత్తం రెడీ అయిందని ప్రభుత్వం చెబుతోంది.





















