Vijayawada News : విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో దారుణం, సర్జికల్ బ్లేడ్ చేతిలో పెట్టి కుట్టేసిన వైద్యులు!
Vijayawada News : పాము కరిచిందని ఆసుపత్రికి వస్తే చేయి కోల్పోయే పరిస్థితి తెచ్చారు వైద్యులు. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ఆ దారుణ ఘటన చోటుచేసుకుంది.
Vijayawada News : విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. పాము కరిచిందని ఓ బాధితురాలు చికిత్స కోసం ఆసుపత్రికి వస్తే.. ఓ వైద్యుడు సర్జికల్ బ్లేడ్ చేతిలో పెట్టికుట్టేశాడు. దీంతో బాధితురాలి చేయి ఇన్ ఫెక్షన్ గురై ఇప్పుడు చేయి తొలగించాల్సిన పరిస్థితి వచ్చింది. ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేటకు చెందిన నందిపాము తులసి అనే మహిళ తన ఇంటి వద్ద పనిచేసుకుంటుంటే ఓ పాము ఆమె చేతిపై కరిచింది. వెంటనే ఆమెను బంధువులు విస్సన్నపేటలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అక్కడ విషం విరుగుడు కోసం ఇంజెక్షన్లు ఇచ్చారు. అనంతరం నూజివీడు ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్లాలని అక్కడి వైద్యులు సూచించారు. అయితే అప్పటికే చేయి నల్లగా మారిపోవడంతో మెరుగైన చికిత్స కోసం ఆమెను విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు.
వైద్యుల నిర్లక్ష్యం
విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో బాధితురాలు తులసిని డాక్టర్లు పరీక్షించారు. ఆమె ప్రాణానికి ఎలాంటి ప్రమాదం లేదని విషానికి విరుగుడు ఇచ్చామని తెలిపారు. రెండు రోజులు ఆస్పత్రిలోనే ఉండాలని సూచించారు. అయితే తులసి చేయి వాపు రోజు రోజుకు పెరిగింది. నొప్పితో ఆమె చాలా బాధపడేది. ఈ సమయంలో వైద్యులు తులసిని పరీక్షించి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని ఐసీయూలో చేర్చారు. అరచేతికి వెనుక వైపు వాచిపోయి ఉన్న భాగాన్ని తొలగించి మోచేతి వరకూ కట్టుకట్టారు. అనంతరం ఆమెను సాధారణ వార్డుకు తరలించారు. అయితే రెండు రోజుల తర్వాత డ్రెస్సింగ్ కోసం కట్టు విప్పితే అందులో సర్జికల్ బ్లేడ్ కనిపించింది. దీనిపై బాధితురాలి బంధువులు వైద్యులను ప్రశ్నిస్తే, వైద్యాధికారులకు ఈ విషయం తెలియజేస్తామని కట్టుకట్టి అక్కడి నుంచి వెళ్లిపోయారు. చేతికి కట్టిన కట్టు గుచ్చుకుంటున్నట్లు పలుమార్లు తులసి చెప్పినా వైద్యులు పట్టించుకోలేదని ఆమె భర్త సురేష్, బంధువులు ఆరోపించారు. ఇప్పుడు చేతికి ఇన్‌ఫెక్షన్ కావడంతో ఆమె చేతిని తొలగించాలని వైద్య సిబ్బంది చెప్పినట్లు వివరించారు. వైద్యుల నిర్లక్ష్యం కారణం తులసి చేయి కోల్పోవలసి వచ్చిందని బంధువులు ఆరోపించారు.
బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలి
బాధితురాలు తులసికి ఇద్దరు చిన్నపిల్లలు కావడంతో కూలి పనులకు వెళ్లి పిల్లల్ని పెంచాల్సిన పరిస్థితి. ఇలాంటి సమయంలో డాక్టర్లు చేయి తీసేయాలని అనటంతో ఆ కుటుంబం అయోమయ స్థితిలో పడింది. దీనిపై ఉన్నతాధికారులు, ప్రభుత్వం స్పందించి వారిని ఆదుకోవాలని బంధువులు కోరుతున్నారు. అదేవిధంగా ప్రజలకు మెరుగైన వైద్యం అందే విధంగా చూడాలని బాధిత కుటుంబానికి న్యాయం జరగాలని కోరుతున్నారు. ఆసుపత్రి వైద్యాధికారులు ఈ ఘటనపై వివరణ ఇచ్చారు. డ్రెస్సింగ్ చేసేందుకు బ్యాండేజ్‌ను విప్పే సమయంలో వినియోగించే బ్లేడ్‌ను అక్కడ పెట్టినప్పుడు చూసి లోపల ఉంచేశారని బాధితురాలి బంధువులు పొరపాటుపడ్డారని కవర్ చేశారు. పాము కాటు విషప్రభావం ఉన్న చోట సర్జరీ చేశామని, చేతిని తొలగించాల్సిన అవసరం లేదన్నారు. అయితే చేతికి పూర్తిగా ఇన్ ఫెక్షన్ కావడంతో బాధితురాలు ఆందోళన చెందుతుంది. తన కుటుంబానికి తానే ఆధారమని ఆవేదన చెందుతుంది. ప్రభుత్వం ఈ ఘటనపై స్పందించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరింది.