ఉగ్రవాదులు ఆకస్మిక దాడి చేస్తే ఎలా ప్రతిఘటించాలి, దుర్గగుడిలో ఆక్టోపస్ మాక్ డ్రిల్
ఉగ్రవాదులు ఆకస్మిక దాడి చేస్తే ఎలా ప్రతిఘటించాలో భక్తులకు వివరరించేందుకు విజయవాడ దుర్గగుడిలో ఆక్టోపస్ మాక్ డ్రిల్ చేసింది.
బెజవాడ దుర్గమ్మ ఆలయంలో అక్టోపస్ బలగాలు హడావిడి చేశాయి. ఊహించని విధంగా ఉగ్రవాదులు ఆకస్మిక దాడులు చేస్తే ఎలా ఎదుర్కోవాలి.. భక్తులను ఆలయ ఆస్తులను ఎలా కాపాడాలనే అంశం పై నిర్వహించిన మాక్ డ్రిల్ చేశారు. అయితే స్థానికులు ముందు ఆందోళనకు గురయినప్పటికి ఆ తరువాత విషయం తెలుసుకొని హమయ్యా అనుకుంటూ వెళ్ళిపోయారు.
అక్టోపస్ అలర్ట్
నిత్యం భక్తులతో రద్దీగా ఉండే ఇంద్రకీలాద్రి పై అనుకోని సంఘటనలు జరిగితే ఎలా రెస్పాండ్ అవ్వాలి...అందులోనూ ఉగ్రవాదులు ముప్పేట దాడి చేస్తే ఎలా వారిని అడ్డుకోవాలి. అర్ధరాత్రి లేదా భక్తులు రద్దీగా ఉండే సమయంలో జరిగే హఠాత్ పరిణామాలను ఎలా తిప్పికొట్టాలి అనే విషయాలపై అవగాహన కల్పించేందుకు అక్టోపస్ బలగాలు దుర్గమ్మ ఆలయం ప్రాంగణంలో మాక్ డ్రిల్ ను నిర్వహించారు. దేవస్థానం ఇంజినీరింగ్ అధికారులు, ఆక్టోపస్ బలగాలతో పాటుగా, స్థానిక పోలీసులు సైతం ఈ మాక్ డ్రిల్ లో పాల్గొన్నారు. అర్ధరాత్రి సమయంలో ఉగ్రవాదులు మూకుమ్మడిగా దాడికి పాల్పడిన సమయంలో వారు చేసే భయంకర పరిస్థితులకు ఎవరైనా భయపడి పరుగులు తీయటం, లేదంటే ప్రాణాలను కాపాడుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. అయితే రద్దీగా ఉండే ప్రాంతంలో ముష్కరులు ఎక్కువగా ప్రాణ నష్టానికి ప్రాధాన్యత ఇవ్వటంతో పాటుగా, చారిత్మక అంశాలను ధ్వంసం చేసేందుకు చర్యలు చేపడతారు. వీటితో పాటుగా బాంబు దాడులు చేయటం, కాల్పులకు దిగటం వంటి పరిణామాలు కూడా ఉంటాయి. అయితే అలాంటి సమయంలో దేవస్థానం సిబ్బంది లేదా సంఘటనా స్దలంలో ఉన్న వారు ఎలా స్పందించాలి. ఉగ్రవాద కార్యకలాపాలు అరికట్టేందుకు ముందస్తు వ్యూహం ఎలా ఉండాలి అనే విషయాలు పై ఆక్టోపస్ అధికారులు అవగాహన కల్పించారు. ఇందులో భాగంగా దాడికి సంబంధించిన సీన్ ను కూడా దేవస్థానం ప్రాంగణంలో క్రియేట్ చేశారు. ఉగ్రవాదులు పొగబాంబులు వేసి మల్లిఖార్జున మహామండపంలోని వెళ్లి అక్కడ దాక్కున్నారు. ఈ విషయంపై సమాచారం అందుకున్న అక్టోపస్ దళాలు, ఘాట్ రోడ్ మీదుగా మహామండపంలోకి ఎంటర్ అయ్యి ఉగ్రవాదులను హతమార్చటం వంటి సీన్స్ ను కళ్ళకు కట్టినట్లుగా చూపించారు. అయితే ఇదే సమయంలో ఉగ్రవాదులను గుర్తించిన దేవస్దానం సిబ్బంది ఏం చేయాలి అనే విషయాలను కూడా ఆక్టోపస్ దళాలు వివరించారు. దాడి జరిగితే ఆ సమాచారాన్ని పోలీసులకు తెలియచేయటంతో పాటుగా, సమయస్పూర్తితో విద్రోహ చర్యలను తిప్పికొట్టేందుకు అవసరం అయిన సన్నాహాలు కూడా చేసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు.
దేవస్థానంలో భద్రతపై
అయితే ఇదే సమయంలో దేవస్దానంలో భద్రతా చర్యలు పకడ్బందీగా ఉండేలా చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులు సూచించారు. సున్నితమయిన ప్రాంతం కావటంతో రక్షణ చర్యలు పటిష్టంగా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని అంటున్నారు. గతంలోనే దేవస్దానం అధికారులకు రక్షణ నిమిత్తం ఏర్పాటు చేయాల్సిన పరికరాలను గురించి నివేదిక అందించినప్పటికి ఇప్పటి వరకు రక్షణ పరికరాలు అందుబాటులోకి తీసుకురాలేదని పోలీసులు చెబుతున్నారు. నిత్యం లక్షల సంఖ్యలో భక్తులు అమ్మవారి దర్శనానికి వస్తుంటారు. వారితో పాటుగా ఉగ్రవాదులు ఎంటర్ అయితే వారిని గుర్తించేందుకు వీలుగా ఫేస్ రికగ్నిషన్ పక్కాగా ఉండే సీసీ కెమేరాలను ఏర్పాటు చేయాలని సూచించినప్పటికి వాటిని కొనుగోలు చేయలేదని అంటున్నారు. భద్రత అంశాలను రివైజ్ చేయటంతో పాటుగా రక్షణ వ్యవస్దను అప్రమత్తం చేసేందుకు అక్టోపస్ నిర్వహించిన మాక్ డ్రిల్ ఉపయోగపడుతుందని దేవస్దానం అధికారులు అంటున్నారు.