Indrakeeladri : దుర్గగుడి అంతరాలయ దర్శనం టికెట్ రూ.500లకు పెంపు, వివాదాస్పదమవుతున్న నిర్ణయం!
Indrakeeladri : ఇంద్రకీలాద్రి దుర్గమ్మను దగ్గరగా దర్శించుకోవాలనే కాసులు చెల్లించుకోవాల్సిందే అంటున్నారు అధికారులు. రూ. 500 టికెట్ కొంటేనే అంతరాలయ దర్శనం అంటున్నారు.
Indrakeeladri : చాలా కాలం తర్వాత బెజవాడ దుర్గమ్మను దగ్గరగా చూసే మహద్భాగ్యం భక్తులకు కలిగింది. కోవిడ్ కారణంగా అంతరాలయ దర్శనాలను రద్దు చేసిన అధికారులు, కోవిడ్ తగ్గడంతో అంతరాలయ దర్శనాలు పునః ప్రారంభించారు. అయితే అంతరాలయ దర్శనం కోసం 500 రూపాయల టికెట్ కొనుగోలు చేయాల్సిందేంటూ అధికారులు తీసుకున్న నిర్ణయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
అంతరాలయ దర్శనం కోసం
ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గమ్మను దగ్గరగా దర్శించుకునే అవకాశాన్ని అధికారులు కల్పించారు. దసరా మహోత్సవాల్లో అనధికార వీఐపీలను నియంత్రించేందుకు దేవదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, అధికార బృందం ప్రత్యేకంగా వీఐపీల కోసం 500 రూపాయల టికెట్‌ను ప్రవేశపెట్టారు. ఉత్సవాల్లో ఈ టికెట్ కొనుగోలు చేసిన భక్తులు బంగారువాకిలి నుంచే దర్శనం చేసుకున్నారు. అయితే 500 రూపాయల టికెట్‌ను కొనసాగిస్తున్నట్లు ఇటీవల మంత్రి సత్యనారాయణ ప్రకటించడంతో అధికారులు ఈ టికెట్లను విక్రయిస్తున్నారు. రూ.500 టిక్కెట్ ను కొన్న భక్తులను అంతరాలయం లోపలికి అనుమతించడంతో పాటు అర్చకులు పూజ కూడా చేస్తారని ఈవో డి.భ్రమరాంబ తెలిపారు. చాలాకాలం తర్వాత దుర్గమ్మను దగ్గరగా దర్శించుకున్న భక్తులు తన్మయత్వం చెందుతున్నారన్నారు. సోమవారం నుంచి ఈ టికెట్లు కొనుగోలు చేసిన భక్తులకు ఒకొక్కరికి 2 లడ్డూలను ఉచితంగా అందజేస్తామని ఈవో చెప్పారు.
భక్తులు ఏమంటున్నారంటే
టికెట్ ధరల పెంపుపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆధ్యాత్మిక కేంద్రంలో వ్యాపారాత్మక ధోరణి సరైన చర్య కాదని మండిపడుతున్నారు. రూ.500 టికెట్ కొనుగోలు చేసినప్పటికీ అధిక సమయం క్యూలో వేచిఉండాల్సి వస్తోందని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతే కాదు వృద్ధులకు కనీస సదుపాయాలు కల్పించటం లేదని విమర్శలు కూడా వస్తున్నాయని చెబుతున్నారు. టికెట్ ను అధిక ధరకు కొనుగోలు చేసినప్పటికీ గంటల తరబడి క్యూ లైన్ లో నిల్చోవాల్సి వస్తుందని దీని వల్ల వయసు మళ్లిన వారు అవస్థ పడుతున్నారని అంటున్నారు.
రాజకీయ వివాదం
ఈ వ్యవహరం పై రాజకీయ పార్టీలు అభ్యంతరం చెబుతున్నాయి. ఇష్టానుసారంగా టికెట్ ధరలను పెంచటం సరైంది కాదంటున్నాయి. అమ్మవారిపై భక్తి కలిగిన వారు విరాళాలను సమర్పించుకునే వీలున్నప్పుడు, 500 టికెట్ కొంటేనే అంతరాలయ దర్శనం కల్పించటం వ్యాపార దృక్పథం కింద పరిగణించాల్సి వస్తుందని అంటున్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు భక్తుల మనోభావాలపై ప్రభావం చూపించే విదంగా ఉన్నాయని అంటున్నారు. ఇప్పటికే కాణిపాకంలో స్వామి వారి సేవ టికెట్ ధరను రూ.700 నుండి రూ.5 వేలకు పెంచినట్లుగా, తప్పుడు ప్రచారం రావటంతో అధికారులు అప్రమత్తం అయ్యి వెంటనే దిద్దుబాటు చర్యలు తీసుకున్నారు. ఇప్పుడు ఇంద్రకీలాద్రి పై 500 రూపాయల టిక్కెట్ ధరను అమలు చేయటంపై భక్తుల ఆగ్రహంపై అధికారులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.
25వ తేదీన ఆలయం మూసివేత
విజయవాడలోని ఇంద్రకీలాద్రి దుర్గమ్మ ఆలయాన్ని ఈనెల 25న మూసివేస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. సూర్యగ్రహణం కారణంగా ఈనెల 25న ఆలయాన్ని మూసివేస్తున్నట్లు ప్రకటించారు. సూర్యగ్రహణం సందర్భంగా ఈ నెల 25న ఉదయం 10 గంటలకు అమ్మవారికి మహానివేదన, పూజా కార్యక్రమాలు నిర్వహించిన తర్వాత ఆలయ ద్వారాలను మూసివేస్తారని తెలిపారు. తిరిగి మరుసటి రోజు అమ్మవారి ఆలయ ద్వారాలను తెరవనున్నట్లు వెల్లడించారు. భక్తులు ఈ విషయాన్ని గమనించి ఆలయ అధికారులకు సహకరించాలని కోరారు.