Vijayawada News : నాన్ వెజ్ ప్రియులకు షాకింగ్ న్యూస్, కుళ్లిన మాంసం విక్రయిస్తున్న వ్యాపారులు!
Vijayawada News : నాన్ వెజ్ ప్రియులకు షాకింగ్ న్యూస్ ఇది. విజయవాడ కార్పొరేషన్ పరిధిలో తనిఖీలు చేసిన అధికారులు విస్తుపోయే విషయాలు తెలిశాయి. కొన్ని దుకాణాల్లో కుళ్లిన మాంసాన్ని గుర్తించారు.
Vijayawada News : నాన్ వెజ్ కొనుగోలు సమయంలో అప్రమత్తంగా ఉండాలని బెజవాడ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. బెజవాడలో అధికారుల తనిఖీల్లో కుళ్లిన మాంసాన్ని విక్రయిస్తున్నట్లు గుర్తించారు. మున్సిపల్ కార్పొరేషన్ వెటర్నరీ సర్జన్ డాక్టర్ రవిచంద్ర మాట్లాడుతూ విజయవాడ నగరంలో కుళ్లిపోయిన మాంసాన్ని విక్రయిస్తున్నారన్న సమాచారంతో కొత్తపేట హనుమంతరాయ మార్కెట్ లో ఆదివారం ఉదయం తనిఖీలు చేశామన్నారు.ఈ తనిఖీల్లో కుళ్లిన మాంసాన్ని, మేక తలకాయ భాగాన్ని విక్రయిస్తున్నట్లుగా గుర్తించారు. కుళ్లిన మాంసాన్ని తినడం వల్ల ప్రజలు తీవ్ర అనారోగ్యానికి గురవుతారని, లేనిపోని రోగాలు వచ్చే అవకాశం ఉందని ఆయన తెలిపారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి మాంసం కొనుగోలు చేసే ముందు తనిఖీ చేసుకోవాలన్నారు. కుళ్లిన మాంసాన్ని ఎవరైనా విక్రయిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని డాక్టర్ రవిచంద్ర హెచ్చరించారు. జులై 5వ తేదీన విజయవాడలోని కృష్ణలంక తారకరామ నగర్‌కు ఒక ఇంట్లో అక్రమంగా మాంసం నిల్వ ఉంచారని అధికారులకు ఫిర్యాదు అందింది. వీఎంసీ వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ రవిచంద్ర తనిఖీలు చేసి మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు.
హెచ్చరించినా పట్టించుకోని వ్యాపారులు
బెజవాడ లో కుళ్లిన మాంస విక్రయాలపై అధికారులు ఎప్పటికప్పుడు దాడులు నిర్వహిస్తూనే ఉన్నారు. అయినా విక్రయాలు మాత్రం ఆగటం లేదు. కోళ్ల ఫారాల్లో అనారోగ్యం కారణంగా లేదా ఇతర కారణాలలో చనిపోయిన కోళ్లను తీసుకువచ్చి తక్కువ ధరకు అమ్మకాలు సాగిస్తున్నారు. బిర్యానీ,ఫ్రై ఐటమ్ లో అయితే వేడి వేడిగా లాగించేస్తారు కాబట్టి, వాటి ప్రభావం అప్పుడే తెలియదు. మాంసం తిన్న మరుసటి రోజు అనారోగ్య సమస్యలతో ఆసుపత్రి పాలవ్వాల్సి వస్తుంది. అయితే ఇలాంటి సంఘటనలు అక్కడక్కడ వెలుగులోకి రావటంతో అధికారుల పెద్దగా పట్టించుకోవటం లేదు. ఈ వ్యవహరాలపై అధికారులకు ఫిర్యాదులు అందినప్పటికీ వాటికి సంబంధించిన ఆధారాలు లేకపోవటంతో ఏమి చేయలేని పరిస్థితి నెలకొందని అంటున్నారు.
వారం వారం తనిఖీలు
బెజవాడలో కార్పొరేషన్ ఆధ్వర్యంలో కబేళాను నిర్వహిస్తున్నారు. ఇక్కడ నుంచి మేక, గొర్రె వంటి మాంసాహారాన్ని తనిఖీ చేసి, స్టాంప్ వేసిన తరువాత వ్యాపారులకు అప్పగిస్తారు. అలాంటి మాంసాహారమే ఆరోగ్యకరమని అధికారులు తెలిపారు. బయట ఎక్కడ పడితే అక్కడ జంతువులను వదించి ఇష్టానుసారంగా వ్యాపారాలు సాగిస్తున్నారు కొందరు. కబేళా నుంచి వీకెండ్ లో మాంసం కొనుగోలు చేయాలంటే వ్యాపారులు రాత్రంతా జాగారం చేయాలి. తెల్లవారుజామున తనిఖీ చేసిన మాంసాన్ని అధికారులు వ్యాపారులకు అప్పగిస్తారు. ఆ తరువాత మాంసాన్ని తమ దుకాణాలకు రవాణా చేసి విక్రయించాల్సి ఉంటుంది. మరోవైపు మాంసాన్ని కల్తి చేసి విక్రయించే ముఠాలు వ్యాపారుల దుకాణాల వద్దే స్టాక్ ను అందించటంతో వాటినే విక్రయిస్తున్నారు. ఇక్కడే కల్తీకి లేదా, కుళ్లిన మాంసం విక్రయాలకు ఆస్కారం ఉంటుంది. ఈ వ్యవహారంపై కార్పొరేషన్ అధికారులు వారం వారం తనిఖీలు చేసినా కల్తీ మాంసం విక్రయాలు మాత్రం అదుపులోకి రావటం లేదు.