Vasireddy Padma : ఎదురుపడితే లాగి లెంపకాయ కొట్టాలనిపిస్తుంది - పవన్ కల్యాణ్‌పై వాసిరెడ్డి పద్మ తీవ్ర విమర్శలు !
పవన్ కల్యాణ్‌పై వాసిరెడ్డి పద్మ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. విషపుత్రుడన్నారు. ఎదురుపడితే లాగి పెట్టి కొట్టాలనిపిస్తోందన్నారు.
Vasireddy Padma : జనసేన అధినేత పవన్‌కల్యాణ్ పై మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కనిపిస్తే.. ఎదురుపడితే లాగి లెంపకాయ కొట్టాలనిపిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సభ్యత ఉంది కనుకే నోటీసులు ఇస్తున్నామని.. వాలంటీర్లపై చేసిన వ్యాఖ్యలకు మరోసారి నోటీసులు ఇస్తామన్నారు. పది రోజుల్లో సమాధానం ఇవ్వాలని రెండు వారాల కిందట నోటీసులు జారీ చేశారు. పవన్ కల్యాణ్ స్పందించలేదు. అయితే తదుపరి ఏం చర్యలు తీసుకోవాలన్నదానిపై మహిళా కమిషన్ ఏ నిర్ణయం తీసుకోలేదు. ఇప్పుడు మరోసారి నోటీసులు జారీ చేస్తామని వాసిరెడ్డి పద్మ తెలిపారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో పవన్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ దత్తపుత్రుడే కాదు విష పుత్రుడు అంటూ మండిపడ్డారు. మహిళల అదృశ్యంపై రాజ్యసభలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి ప్రకటన చేశారు. దానిపై పవన్ కామెంట్స్ చేశారు. మహిళల అదృశ్యంలో దేశంలో ఏపీ 11వ స్థానంలో ఉందన్న విషయాన్ని పవన్ కళ్యాణ్ ఎందుకు ప్రస్తావించటం లేదని ప్రశ్నించారు. ఏపీలో మహిళల అదృశ్యంపైనే పవన్ ఎందుకు ఎక్కువ ఆందోళన చెందుతున్నారని ప్రశ్నించారు. ఏపీనే పవన్ కళ్యాణ్ ఎందుకు టార్గెట్ చేస్తున్నారు?, వలంటీర్ వ్యవస్థ వల్లనే ఏపీలో మహిళల అదృశ్యం అంటున్నారని అది కరెక్ట్ కాదన్నారు.
ప్రేమ వ్యవహారాల వలనే చాలా మంది అమ్మాయిలు అదృశ్యం అవుతున్నారు. ఈ ప్రేమలకు సినిమాలు ఒక కారణం అన్నారు. తప్పిపోయిన వారిలో 70 శాతం వెనక్కి వస్తున్నారనే విషయాన్ని ఎందుకు గుర్తించరని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ మహిళలను గౌరవించడం నేర్చుకోవాలని సలహా ఇచ్చారు. వలంటీర్ల వల్లే మహిళలు అదృశ్యం అవుతున్నారు అన్న పవన్ కళ్యాణ్ ఆధారాలు బయటపెట్టాలన్నారు. రికవరీ అత్యధికంగా ఉన్న రాష్ట్రాల్లో ఏపీ దేశంలోనే రెండో స్థానంలో ఉందన్నారు. భరణం ఇచ్చి వదిలించుకుంటాం అంటే ఏ ఒక్క మహిళ అయినా అంగీకరిస్తుందా అని ప్రశ్నించారు.
వలంటీర్ల క్యారెక్టర్‌పై మాట్లాడుతున్నారు గనుక మేం కూడా ప్రశ్నిస్తున్నామని వాసిరెడ్డి పద్మ చెప్పుకొచ్చారు. మహిళల అభివృద్ధి, సంక్షేమం పట్ల ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందన్నారు. వారంతా ఇంట్లో నుంచి బయటకు రాకుండా పథకాలు పొందుతున్నారని చెప్పారు. మహిళలు ఇంట్లో కూర్చుని అంత గౌరవంగా, హక్కుగా మహిళలు పథకాలు పొందుతున్నారని... ఈ మొత్తం ప్రక్రియలో వలంటీర్లు కీలక పాత్ర పోషిస్తుంటే వారిని అవమానిస్తారా అని ఆవేశంగా స్పందించారు.
ఒక క్రిమినల్ కహానీ అల్లి ప్రభుత్వాన్ని పలచన చేయాలన్నది పవన్ కళ్యాణ్ కుట్ర అని ఆరోపించారు. మూడు పెళ్లిళ్లు చేసుకుంటే తప్పేంటి అని చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్. సినిమా హీరోలు ఏం చెప్పినా చెల్లుతుందా?, మాకు చాలా విషయాలు ప్రశ్నించాలని ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఆరవ స్థానంలో ఉంటే పవన్ కళ్యాణ్ ఎందుకు నోరు విప్పటం లేదన్నారు. మహిళా కమిషన్‌కు రాజకీయ దురుద్దేశాన్ని ఆపాదిస్తున్నారు. మహిళల అభివృద్ధి కోసం ప్రభుత్వం ఈ స్థాయిలో చర్యలు తీసుకుంటూ ఉంటే పొగడకుండా ఎలా ఉంటామని ప్రశ్నించారు.