Vasantha Krishna Prasad : లోకేష్, చంద్రబాబును తిడితేనే టిక్కెట్ ఇస్తామన్నారు - మైలవరం వైసీపీ ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు
Mylavaram MLA : మైలవరం ఎమ్మెల్యే టిక్కెట్ అంశంపై వసంత కృష్ణ ప్రసాద్ కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు, లోకేష్ ను తిట్టడం లేదు కాబట్టి టిక్కెట్ ఇవ్వడం లేదన్నారని ఆయన తెలిపారు
Vasantha Krishna Prasad : మైలవరం వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ .. వైసీపీ హైకమాండ్ తీరుపై తీవ్ర విమర్శలు చేసారు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న తనను లోకేష్ , చంద్రబాబుని తిట్టవు నిన్నెలా నమ్మాలని జగన్ అన్నారని విమర్శించారు. తిట్టనివాళ్లకి ఎమ్మెల్యే , పార్లమెంటు సీట్లు ఇవ్వనని చెప్పారన్నారు. మనసు గాయపడినప్పుడు నిలువెత్తు బంగారం ఇస్తామన్నా ఉండలేమని.. వైసీపీకి రాజీనామా చేస్తున్న అంశంపై పరోక్షంగా స్పందించారు. పెద్దిరెడ్డి కాల్ చేసి తొందరపడ్డదన్నారని.. రాజకీయాలకి స్వస్తిపలికి వ్యాపారాలు చేసుకుందాం అనుకున్నానన్నారు. అయితే శ్రేయోభిలాషులు రాజకీయాల్లోనే ఉండమన్నారని చెప్పుకొచ్చారు. 2014లో ఓడిపోయిన, 2019లో నన్ను గెలిపించని జోగిరమేష్‌ను నేను గెలిపించాలట అని పార్టీ హైకమాండ్ సూచనలపై మండిపడ్డారు. పనులు చేసిన వారికి బిల్లులు ఇవ్వమంటే ఇవ్వడంలేదన్నారు. ఎన్ని సార్లు చెప్పిన అరణ్య రోదనే అయిందన్నారు.
రాజధాని మార్పు నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించానని చెప్పిన కృష్ణ ప్రసాద్
మైలవరం నియోజకవర్గంలోని పలువురు నాయకులు, ముఖ్యనేతలతో వసంత సోమవారం ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తనకు పార్టీలో జరిగిన అవమానాన్ని వెల్లడించారు. ఎన్నికల ముందు జగన్ ను రాజధానిపై వైఖరి ఏంటని అడిగితే అసెంబ్లీలోనే చెప్పాంగా.. ఇక్కడే ఉంటుందని అన్నారు. కృష్ణా, గుంటూరులో 33 నియోజకవర్గాల్లో దాదాపు అన్ని వైసీపీ గెలిస్తే.. రాజధాని మార్పుపై ఇక్కడ ప్రజలకు సమాధానం ఎలా చెప్పాలి. రాజధాని నిర్ణయం తీవ్ర నష్టం తెస్తుందని అప్పుడే చెప్పానని వసంత కృష్ణ ప్రసాద్ అన్నారు.
జగన్ చెప్పిందే ఫైనల్ అని చెప్పి పక్కన పెట్టారన్న వసంత
సీఎం జగన్ నివాసంలో సజ్జల, బొత్సలతో రాజధానుల సమావేశంలో మా అభిప్రాయం చెప్పమన్నారు. రాజధాని నిర్ణయం తీవ్ర నష్టం తెస్తుందని అప్పుడే చెప్పాను. రాజధాని మార్చాలనుకుంటే అసెంబ్లీ వైజాగ్ పంపి, సచివాలయం ఇక్కడ ఉంచితే సమస్య ఉండదని చెప్పాను.. కానీ పట్టించుకోలేదు. కొడాలి నాని మాట్లాడుతూ.. సీఎం నిర్ణయం ఫైనల్.. ఆయన నిర్ణయానికి ఎదురు చెప్పకూడదన్నారు. అంబటి లేచి ఆయన నివాసంలో ఆయన నిర్ణయాన్ని ప్రశ్నించే పరిస్థితి ఉండకూడదని చెప్పారు. నాతోపాటు మల్లాది విష్ణు కూడా రాజధాని మార్చవద్దని చెప్పారు. మా అభిప్రాయాన్ని చెప్పకుండా అంబటి రాంబాబు మా గొంతు నొక్కుతున్నారని చెబితే సజ్జల, బొత్స, అంబటి మమ్మల్ని వారించారని వసంత కృష్ణ ప్రసాద్ అన్నారు.
పార్టీ మార్పు ఖాయమేనా ?
వసంత కృష్ణ ప్రసాద్ తాజా వ్యాఖ్యలతో ఆయన పార్టీ మారడం ఖాయంగా కనిపిస్తోంది. సమావేశంలో ఆయన టీడీపీ జెండాలు పెట్టుకోలేదు. కానీ ఎన్టీఆర్ బొమ్మ పెట్టారు. ఫ్లెక్సీపై ఎన్టీఆర్ తో పాటు వైఎస్ఆర్ జెండా పెట్టుకున్నారు. జై ఎన్టీఆర్, జై వైఎస్ఆర్ అని ఆయన ప్రసంగం ముగించారు. వైసీపీలో ఉన్న కొడాలి నాని ఎన్టీఆర్ బొమ్మను పెట్టుకుంటారు. టీడీపీలో చేరిన వసంత కృష్ణ ప్రసాద్ అదే చేసే అవకాశాలు ఉన్నాయి.