Pawan Varahi Yatra: జమిలికి జై కొట్టిన జనసేన - త్వరలోనే వారాహి యాత్ర 4వ దశ
వన్ నేషన్ - వన్ ఎలక్షన్ పై గతంలోనే కేంద్రంలోని పెద్దలు పవన్ తో చర్చించారని అంటున్నారు నాదెండ్ల మనోహర్. దీనిపై మరింత లోతుగా చర్చ జరగాలని ఆయన చెప్పారు. ఈ నెలలో మళ్లీ వారాహి యాత్ర ఉంటుందని చెప్పారు.
Pawan Kalyan Varahi Yatra 4th Phase:
ప్రస్తుతం దేశవ్యాప్తంగా జమిలి ఎన్నికలపై తీవ్ర చర్చ జరుగుతోంది. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరిగేది అందుకేనని, రాజ్యాంగ సవరణకు కమిటీతో ముందడుగు పడిందని అంటున్నారు. అదే సమయంలో బీజేపీ వైరి వర్గాలు మాత్రం జమిలి ఓ పొలిటికల్ గేమ్ అని కొట్టిపారేస్తున్నాయి. ఐదు రాష్ట్రాల అసెంబ్లీలకు జరగబోతున్న ఎన్నికల్లో ఓటమిని ముందుగానే ఊహించిన బీజేపీ, జమిలి వ్యూహం తెరపైకి తెచ్చిందని అంటున్నారు బీఆర్ఎస్ నేతలు. ఇండియా కూటమిలో కూడా ఇదే చర్చ జరిగింది. ఇటు బీజేపీ మిత్రపక్షాలు మాత్రం కేంద్రం నిర్ణయాన్ని ముందుగానే స్వాగతిస్తున్నట్టు ప్రకటిస్తున్నాయి. జనసేన ఈ విషయంలో ఓ అడుగు ముందుకేసింది. వన్ నేషన్ - వన్ ఎలక్షన్ అనే నినాదంతో కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాలకు మద్దతిస్తున్నట్టు ప్రకటించింది.
పవన్ తో ముందుగానే చర్చలు..
వన్ నేషన్ – వన్ ఎలక్షన్ పై గతంలోనే కేంద్రంలోని పెద్దలు పవన్ కల్యాణ్ తో చర్చించారని అంటున్నారు నాదెండ్ల మనోహర్. దీనిపై మరింత లోతుగా చర్చ జరగాలని ఆయన చెప్పారు. జమిలి ఎన్నికలతో ప్రజా ధనం ఆదా అవుతుందన్నారు. పార్లమెంటులో కూడా చర్చ జరిగితే దీనిపై సరైన నిర్ణయం తీసుకోడానికి అవకాశం ఉంటుందన్నారు. దేశం మొత్తం ఒకేసారి ఎన్నికలు జరిగితే అన్ని రాష్ట్రాలకు మంచి జరుగుతుందన్నారు నాదెండ్ల. జమిలి ఎన్నికల విధానాన్ని జనసేన సమర్ధిస్తుందని తెలిపారు. కేంద్రం తీసుకున్నది మంచి నిర్ణయం అని, మార్పులు జరుగుతాయని తాము భావిస్తున్నామని చెప్పారు నాదెండ్ల మనోహర్.
జమిలి ఎన్నికల విధానాన్ని జనసేన స్వాగతిస్తుంది!
— JanaSena Party (@JanaSenaParty) September 1, 2023
• ప్రజాధనం వృథా కాకుండా చేసే చర్యలు... మార్పు కోసం మంచివే
• త్వరలోనే వారాహి విజయ యాత్ర నాలుగో దశ
• శ్రీ పవన్ కళ్యాణ్ గారి పుట్టిన రోజున సామాజిక సేవా కార్యక్రమాల నిర్వహణకు ప్రణాళిక
• శ్రీ పవన్ కళ్యాణ్ గారికి నచ్చేలా… pic.twitter.com/EAtJXkQTu6
పొత్తులపై క్లారిటీ ఇచ్చాం కదా..
ఏపీలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా జననసేన పార్టీ సిద్ధంగా ఉందని చెప్పారు నాదెండ్ల మనోహర్. ఎన్నికల తర్వాత ఏపీలో కొత్త ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్ష కూడా అదేనన్నారు. వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కావాలనేది ప్రజల భావన అని, దాన్ని తాము నెరవేరుస్తామని చెప్పారు. పొత్తులకు సంబంధించి జనసేన విధానం స్పష్టంగా ఉందని, ఇప్పటికే పవన్ కల్యాణ్ పొత్తుల గురించి చెప్పారని గుర్తు చేశారు. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులను బట్టి తమ విధానాలు ఉంటాయని అన్నారు. రాష్ట్రానికి మేలు జరిగేలా జనసేన నిర్ణయం ఉంటుందన్నారు నాదెండ్ల.
మళ్లీ వారాహి..
విడతల వారీగా వారాహి యాత్రను చేపడుతున్న పవన్ కల్యాణ్.. వైజాగ్ యాత్ర తర్వాత కాస్త గ్యాప్ ఇచ్చారు. ఈ నెలలో మళ్లీ వారాహి యాత్ర ఉంటుందని చెప్పారు నాదెండ్ల మనోహర్. త్వరలో వారాహి యాత్రపై నాయకులతో చర్చించి కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. అయితే యాత్ర ఎక్కడినుంచి ఉంటుందనేది ఆయన స్పష్టం చేయలేదు. సెప్టెంబర్ లోనే వారాహి నెక్స్ట్ షెడ్యూల్ ఉంటుందని మాత్రం తెలుస్తోంది.
జనసేనాని పుట్టినరోజు సందర్భంగా..
సెప్టెంబర్ -2 జనసేనాని పవన్ కల్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా వివిధ కార్యక్రమాలు చేపడుతున్నట్టు తెలిపారు నాదెండ్ల మనోహర్. 175 నియోజకవర్గాల్లో జనసేన నాయకులు పవన్ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొంటారని అన్నారు. నాయకులంతా భవన నిర్మాణ కార్మికులతో కలసి సహపంక్తి భోజనాలు చేస్తారని వివరించారు. రెల్లి కార్మికుల మధ్య పవన్ కల్యాణ్ పుట్టినరోజు వేడుకలు జరుగుతాయన్నారు. యువతలో స్ఫూర్తి రగిలించేలా పవన్ పుట్టినరోజు వేడుకలు జరుపుతామన్నారు నాదెండ్ల.