Nara Lokesh - Vangaveeti : లోకేష్‌తో వంగవీటి రాధా కీలక చర్చలు - పోటీ చేసే స్థానంపై క్లారిటీకి వచ్చినట్లేనా ?
వంగవీటి రాధా, లోకేష్ అరగంట సేపు చర్చలు జరిపారు. వంగవీటి పోటీ చేసే స్థానంపై చర్చించినట్లుగా తెలుస్తోంది.
Nara Lokesh - Vangaveeti : యువగళం పాదయాత్రలోనే పార్టీ అంతర్గత వ్యవహారాలను నారా లోకేష్ చక్కబెడుతున్నారు. తను పాదయాత్ర చేస్తున్న నియోజకవర్గాల్లో అభ్యర్థులను కూడా ఫైనల్ చేస్తున్నారు. పార్టీ నేతల మధ్య విబేధాలుంటే పరిష్కరిస్తున్నారు. తాజాగా విజయవాడలో మాస్ లీడర్ అయిన వంగవీటి రాధాకృష్ణ పోటీ చేసే స్థానాన్ని ఖరారు చేయడంపై నారా లోకేష్ దృష్టి సారించారు. ఈ అంశంపై పాదయాత్ర విరామ సమయంలో లోకేశ్ కసరత్తు చేశారు. వంగవీటి రాధాతో ఈ అంశంపై దాదాపుగా అరంగట సేపు చర్చలు జరిపినట్లుగా తెలుస్తోంది. యువగళం పాదయాత్ర విజయవాడకు వచ్చినప్పటి నుండి రాధా కూడా పాదయాత్రలో పాల్గొంటున్నారు. వంగవటి రాధా లాంటి నేతను ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేయించాలని..కానీ ఏ స్థానం నుంచి అన్నది మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు.
వంగవీటి రాధా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోనే రాజకీయాలు చేస్తూంటారు. కానీ అక్కడ టీడీపీ తరపున బొండా ఉమ అభ్యర్థిగా ఉన్నారు. ఇతర రెండు నియోజకవర్గాల్లోనూ బలమైన అభ్యర్థులు ఉన్నారు. వంగవీటి రాధాను మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేయించాలన్న ఆలోచనలో టీడీపీ ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. కానీ వంగవీటి ఆలోచనలపై మాత్రం స్పష్టత లేదు. ఆయనకు విజయవాడ నగరం దాటి వెళ్లే ఆలోచన లేదని అనుచరులు చెబుతున్నారు. కానీ వంగవీటి రంగా వారసుడిగా ఆయన కృష్ణా జిల్లాలో ఎక్కడ పోటీ చేసిన విజయం సాధిస్తారని ఆయన అనుచరులు నమ్మకంతో ఉన్నారు.
ఎన్నికలు దగ్గరపడుతూండటంతో ఈ అంశంపై పూర్తి స్థాయిలో టీడీపీ, వంగవీటి రాధా కసరత్తు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది. వంగవీటి అభిప్రాయం ప్రకారమే.. సీటు కేటాయించాడనికి టీడీపీ నేతలు ప్రయత్నిస్తున్నారని ఈ విషయంలో.. ఏమైనా ఇబ్బందులు ఎదురైతే పరిష్కరిస్తామని చెబుతున్నట్లుగా తెలుస్తోంది. మరో వైపు వంగవీటి రాధాకృష్ణ పెళ్లి వచ్చే నెలలో జరగనుంది. చాలో లో ప్రోఫైల్‌లో అత్యంత సన్నిహితుల మధ్య ఈ వివాహ కార్యక్రమం జరగనుంది. ఈ వివాహానికి లోకేష్ ను వంగవీటి రాధాకృష్ణ ఆహ్వానించారని చెబుతున్నారు.
వంగవీటి రాధా కృష్ణా 2004 విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేసి మొదటిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఆ తర్వాత 2009లో ప్రజారాజ్యం పార్టీ నుంచి విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో మల్లాది విష్ణు చేతిలో అతి తక్కువ తేడాతో ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత వైసీపీలో చేరారు రాధా. 2014 ఎన్నికల్లో విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి రాధా పోటీ చేశారు. కానీ ఓడిపోయారు. ఆ తర్వాత జరిగిన 2019 ఎన్నికల సమయంలో వంగవీటి రాధా టీడీపీ కండువా కప్పుకున్నారు. ఆ ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఈ సారి పోటీ చేయాలని పట్టుదలతో ఉన్నారు.