Students Met CM Jagan : ఉక్రెయిన్ నుంచి వచ్చిన విద్యార్థుల కోసం కేంద్రానికి లేఖ రాస్తాం : సీఎం జగన్
Students Met CM Jagan : ఉక్రెయిన్ నుంచి వచ్చిన వైద్య విద్యార్థులు సీఎం జగన్ ను ఇవాళ కలిశారు. ఉక్రెయిన్ నుంచి తీసుకురావడంలో రాష్ట్ర ప్రభుత్వం కృషి చేసిందని విద్యార్థులు సీఎంకు ధన్యవాదాలు తెలిపారు.
Students Met CM Jagan : ఉక్రెయిన్(Ukraine) నుంచి వచ్చిన వైద్య విద్యార్థులు సోమవారం ముఖ్యమంత్రి జగన్(CM Jagan) ను కలిశారు. శాసనసభలోని ముఖ్యమంత్రి కార్యాలయంలో సీఎం జగన్‌ను కలిసి ధన్యవాదాలు తెలిపారు. యుద్ధ పరిస్థితుల వల్ల ఉక్రెయిన్ నుంచి వచ్చిన రాష్ట్రానికి చెందిన విద్యార్థులకు అండగా ఉంటామని సీఎం జగన్ హామీ ఇచ్చారు. భవిష్యత్తులో ఎలాంటి అవసరమున్నా వారికి వెంటనే సహాయం చేయాలని అధికారులను ఆదేశించారు. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం నేపథ్యంలో ఇబ్బందులు పడుతున్న విద్యార్థులను సరక్షితంగా వెనక్కి తీసుకురావాలని అధికారులను ఆదేశించామని సీఎం అన్నారు. ఆ ఆదేశాలతో విద్యార్థులను సురక్షితంగా రాష్ట్రానికి తీసుకొచ్చారన్నారు. ఆ బాధ్యతను అధికారులు సక్రమంగా నిర్వర్తించారన్నారు. విద్యార్థులను సురక్షితంగా తీసుకురావడంలో సమర్ధవంతంగా వ్యవహరించిన అధికారులను సీఎం అభినందించారు.
విద్యార్థుల కోర్సుల కొనసాగించేందుకు కేంద్రానికి లేఖ
ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యకు తగిన పరిష్కారం లభించేలా మార్గాలను అన్వేషించాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి లేఖరాయాలని నిర్ణయం తీసుకున్నారు. విద్యార్థుల చదువులపై సీఎం ఆరా తీశారు. విద్యార్థులు వారు కోర్సులను ఎంతవరకు పూర్తిచేశారో తెలుసుకున్నారు. తదుపరి వారి కోర్సులు కొనసాగించేందుకు ప్రత్యామ్నాయాలను అడిగి తెలుసుకున్నారు. ఈ విషయంలో ప్రభుత్వ పరంగా అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు.
వీవీఐపీల్లా చూసుకున్నారు : విద్యార్థులు
ఉక్రెయిన్ నుంచి తీసుకురావడంలో రాష్ట్ర ప్రభుత్వం విశేష కృషి చేసిందని విద్యార్థులు సీఎం జగన్ కు ధన్యవాదాలు తెలిపారు. దేశం మొత్తంమీద ఒక్క ఆంధ్రప్రదేశ్ మాత్రమే అన్ని రకాలుగా చర్యలు తీసుకుందన్నారు. ఉక్రెయిన్ సమీప దేశాలకు చేరుకున్న దగ్గర నుంచి ఆహారం, వసతి విషయాల్లో బాగా చూసుకున్నారని విద్యార్థులు తెలిపారు. దీంతో పాటు దేశంలో అడుగుపెట్టిన దగ్గర నుంచి కూడా స్వస్థలాలకు చేరేంత వరకూ ఫ్లైట్ టిక్కెట్లు దగ్గర నుంచి ప్రయాణ, వసతి అన్ని సదుపాయాలను ఏర్పాటు చేశారన్నారు. ఎయిర్ పోర్టుల్లో వీవీఐపీల తరహాలో స్వాగతం పలికారని, ఆ తరహాలో అన్ని సదుపాయాలను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. చేసిన పనిని చెప్పుకోకుండా వెనుక నుంచి యంత్రాంగాన్ని సీఎం నడిపిన తీరు అందరికీ స్ఫూర్తిదాయకమన్నారు విద్యార్థులు. ఈ తరహా చర్యలు తీసుకున్నప్పుడు సహజంగానే విపరీత ప్రచారం చేసుకుంటారని, సామాజిక మాధ్యమాల వేదికగా తమను తాము ప్రశంసించుకుంటారని అలాంటి పోకడలకు ఏపీ ప్రభుత్వం, అధికారులు దూరంగా ఉండడం ఆశ్చర్యాన్ని కలిగించిందన్నారు. డాక్టర్ వైయస్సార్ స్ఫూర్తితో వైద్య విద్యను ఒక ఛాలెంజ్‌గా తీసుకున్నానని కడపకు చెందిన విద్యార్థిని తెలిపారు.