Anant Ambani Wedding: అనంత్ అంబానీ పెళ్లికి హాజరైన ఏపీకి చెందిన ఇద్దరు అరెస్ట్, చర్యలు తప్పవన్న పోలీసులు
2 AP Men attends Anant Ambani wedding without invitation | ముంబయి: రిలయన్స్ ఇండస్ట్రీ అధినేత, భారత కుబేరుడు ముకేశ్ అంబానీ ఇంట్లో పెళ్లి వేడుకలు అంటే మాటలా. దేశంలోని నలుమూలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల నుంచి ప్రముఖులు ముకేశ్ అంబానీ, నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీ, రాధికా మర్చంట్‌ల వివాహ వేడుకలకు హాజరయ్యారు. రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, క్రికెటర్లు, నటీనటులు, ఇతర రంగాల ప్రముఖులు మూడు రోజులపాటు ఘనంగా జరుగుతున్న అనంత్, రాధికల వివాహ వేడుకల్లో పాల్గొన్నారు. ముంబైలోని జియో వరల్డ్ సెంటర్ ఈ వేడుకకు వేదికగా నిలిచింది. ఈ వేడుకల్లో ఊహించని ఘటన చోటుచేసుకుంది.
అనంత్ అంబానీ, రాధిక మర్చంట్‌ల వివాహ వేడుకలకు ఆహ్వానం లేకుండా హాజరైన ఇద్దరు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిద్దరూ ఏపీకి చెందిన వారు కావడంతో హాట్ టాపిక్ అవుతోంది. వారిలో ఒకరు యూట్యూబర్ వెంకటేశ్ అల్లూరి కాగా, మరో వ్యక్తి వ్యాపారవేత్త అని పరిచయం చేసుకుంటున్న షఫీ షేక్‌గా ముంబై పోలీసులు గుర్తించారు. ప్రపంచంలోనే టాప్ కుబేరులలో ఒకరైన ముకేశ్ అంబానీ ఇంట్లో వేడుకలకు ఆహ్వానం అందకుండా వెళితే చర్యలు తప్పకుండా ఉంటాయి. వెంకటేశ్‌కు, షఫీ షేక్‌లకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. కౌన్సెలింగ్ ఇచ్చిన అనంతరం వారిని విడిచి పెట్టినట్లు సమాచారం. ముంబై పోలీసులు త్వరలోనే వీరిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.