(Source: ECI/ABP News/ABP Majha)
Tirumala Special Tickets: శ్రీవారి భక్తులకు అలర్ట్ - ప్రత్యేక దర్శన టికెట్లు విడుదల
Tirumala News: శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది. ఏప్రిల్ నెలకు సంబంధించి ప్రత్యేక దర్శన కోటా టికెట్లను ఆన్ లైన్ లో విడుదల చేసింది.
TTD Released April Special Darshan Tickets: శ్రీవారి భక్తులకు టీటీడీ (TTD) గుడ్ న్యూస్ చెప్పింది. ఏప్రిల్ నెలకు సంబంధించి రూ.300 ప్రత్యేక దర్శన టికెట్ల కోటాను విడుదల చేసింది. బుధవారం (జనవరి 24) ఉదయం 10 గంటలకు ఈ టికెట్లను ఆన్ లైన్ లో అందుబాటులో ఉంచింది. అలాగే, తిరుమల, తిరుపతిలోని (Tirupati) గదుల కోటాను మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనున్నారు. ఇక శ్రీవారి సేవ కోటాను ఈ నెల 27న (శనివారం) ఉదయం 11 గంటలకు విడుదల చేస్తారు. అలాగే, నవనీత సేవ కోటాను అదే రోజు మధ్యాహ్నం 12 గంటలకు.. పరకామణి సేవ కోటాను మధ్యాహ్నం ఒంటి గంటకు ఆన్ లైన్ లో అందుబాటులో ఉంచనున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. భక్తులు https://tirupatibalaji.ap.gov.in సైట్ ద్వారా టికెట్లు బుక్ చేసుకోవచ్చని చెప్పారు.
వీరికి అలర్ట్
తిరుమలలో ఈ నెల 25న (గురువారం) శ్రీ రామకృష్ణ తీర్థ ముక్కోటి జరగనుంది. ఈ క్రమంలో గురువారం ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ భక్తులను అనుమతించనున్నట్లు అధికారులు తెలిపారు. అలాగే, పుష్య మాస పౌర్ణమి గరుడ సేవ కూడా ఉంటుందని చెప్పారు. రాత్రి 7 గంటలకు శ్రీవారు గరుడ వాహనంపై భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. అయితే, శ్రీ రామకృష్ణ తీర్థ ముక్కోటి కార్యక్రమానికి సంబంధించి భక్తులకు టీటీడీ అధికారులు కీలక సూచనలు చేశారు. ఈ కార్యక్రమానికి పదేళ్ల లోపు పిల్లలు, 50 ఏళ్లు దాటిన వృద్ధులు, ఊబకాయం ఉన్న వారు, శస్త్ర చికిత్సలు చేయించుకున్న భక్తులను అనుమతించబోమని స్పష్టం చేశారు. అలాగే, డయాబెటిస్, బీపీ, ధైరాయిడ్ సమస్యలు, గుండె సంబంధిత సమస్యలు ఉన్న వారు పలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
తిరుమలకు ప్రత్యేక రైళ్లు
తిరుమల శ్రీవారి భక్తులకు దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) గుడ్ న్యూస్ చెప్పింది. రద్దీని దృష్టిలో ఉంచుకుని సికింద్రాబాద్ నుంచి తిరుపతికి 4 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు ప్రకటించింది. ఈ నెల 26, 26, 27, 28 తేదీల్లో స్పెషల్ సర్వీసులు (Special Trains) అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు.
ప్రత్యేక రైళ్లు ఇవే
- సికింద్రాబాద్ - తిరుపతి (రైలు నెం. 07041) రైలు ఈ నెల 25న (గురువారం) సికింద్రాబాద్ నుంచి రాత్రి 8 గంటలకు బయలుదేరుతుంది. శుక్రవారం ఉదయం 9 గంటలకు తిరుపతి చేరుకుంటుంది.
- తిరుపతి - సికింద్రాబాద్ (ట్రైన్ నెం. 07042) రైలు ఈ నెల 26న (శుక్రవారం) రాత్రి 07:50 గంటలకు బయలుదేరి, శనివారం ఉదయం 09:30 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది.
- సికింద్రాబాద్ - తిరుపతి (ట్రైన్ నెం. 02764) రైలు ఈ నెల 27న (శనివారం) సాయంత్రం 06:40 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయలుదేరి, ఆదివారం ఉదయం 06:45 గంటలకు తిరుపతి చేరుకుంటుంది.
- తిరుపతి - సికింద్రాబాద్ (ట్రైన్ నెం. 02763) రైలు ఈ నెల 28న (ఆదివారం) సాయంత్రం 05:15 గంటలకు తిరుపతి నుంచి బయలుదేరి సోమవారం ఉదయం 05:55 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది.
ఈ స్టేషన్లలోనే స్టాప్స్
- రైలు నెంబర్ 07041/07042 సర్వీసులు.. కాచిగూడ, ఉమ్దానగర్, షాద్ నగర్, జడ్చర్ల, మహబూబ్ నగర్, వనపర్తి రోడ్, గద్వాల్, రాయచూర్, మంత్రాలయం రోడ్, గుంతకల్, తాడిపత్రి, ఎర్రగుంట్ల, రాజంపేట, రేణిగుంట స్టేషన్లలోనే ఆగుతుందని అధికారులు తెలిపారు.
- రైలు నెంబర్ 02764/02763 సర్వీసులు.. జనగాం, కాజీపేట, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, విజయవాడ, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట స్టేషన్లలోనే ఆగుతుంది.
Also Read: AP Voters List: ఓటరు జాబితాలో మీ పేరు ఉందా? - లేకుంటే ఇలా చేయండి