Tirumala News: తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ - టీటీడీ కీలక నిర్ణయాలు, ఇకపై నో టెన్షన్
Andhrapradesh News: తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది. తిరుమలలో దళారులను పూర్తిగా కట్టడి చేయడం సహా కాలినడక మార్గంలో స్వామి దర్శనం కోసం వచ్చే భక్తులకు అధిక ప్రాధాన్యత ఇవ్వనుంది.
![Tirumala News: తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ - టీటీడీ కీలక నిర్ణయాలు, ఇకపై నో టెన్షన్ TTD key decisions for devotees safety and crack down brokers Tirumala News: తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ - టీటీడీ కీలక నిర్ణయాలు, ఇకపై నో టెన్షన్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/04/50e5ea457966faea793c788d54c68ece1720074937605876_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
TTD Key Decisions For Devotees Safety: తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ (TTD) గుడ్ న్యూస్ చెప్పింది. భక్తుల భద్రతకు అధిక ప్రాధాన్యం ఇవ్వడం సహా దర్శన టికెట్లు, వసతి, ఆర్జిత సేవా టికెట్లు, లడ్డూల విషయంలో భక్తులను మోసగిస్తోన్న దళారులపై ఉక్కుపాదం మోపాలని నిర్ణయించింది. ఈ మేరకు బుధవారం టీటీడీ ఈవో జే.శ్యామలరావు తిరుపతి జిల్లా, పోలీస్, టీటీడీ నిఘా, భద్రతా విభాగం అధికారులతో సమావేశం నిర్వహించారు. దళారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే, తిరుమలలో ఐటీ అనుబంధంగా ఉన్న కేసులను సత్వరం పరిష్కరించేందుకు సైబర్ క్రైమ్ టీం ఏర్పాటు చేయాల్సిందిగా సంబంధిత అధికారులకు సూచించారు. అంతకు ముందు అధికారులు ఆయనకు వీటికి సంబంధించిన వివరాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. దర్శన టికెట్ల దళారులకు సంబంధించి ఆన్ లైన్, డిప్ సిస్టం ద్వారా, రిజిస్ట్రేషన్ చేసుకున్న కేసులు, చోరీ కేసులు, మద్యపానం, ఇతర అంశాలకు సంబంధించిన కేసులు ఏ దశలో ఉన్నాయో తెలియజేశారు. ఆయా కేసుల్లో ఉన్న దళారులకు మరో వారం రోజుల్లో చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
భక్తుల భద్రతపై..
తిరుమల కొండపై దళారుల దందాను అరికట్టడం సహా.. నడక మార్గంలో స్వామి దర్శనం కోసం వచ్చే వారికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ఈవో అధికారులను ఆదేశించారు. ఏడుకొండల స్వామి దర్శనానికి ప్రతిరోజూ నిత్యం వేలాది మంది భక్తులు తరలివస్తుండగా వారిలో ఎక్కువ శాతం అలిపిరి, శ్రీవారి మెట్టు నడకమార్గంలోనే వచ్చి శ్రీవారిని దర్శించి మొక్కులు చెల్లించుకుంటారు. వీరి భద్రతపై ప్రభుత్వ అటవీ, టీటీడీ అటవీ, ఇంజినీరింగ్, భద్రతా విభాగాలతో ఈవో బుధవారం పద్మావతి విశ్రాంతి భవనం సమావేశ మందిరంలో చర్చించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన జాయింట్ కమిటీ ప్రతిపాదనలు, వైల్డ్ లైఫ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా టీం చేసిన ప్రతిపాదనలను ఈవోకు అధికారులు పీపీటీ ద్వారా వివరించారు. నడక మార్గాల్లో చిరుతలు, ఇతర జంతువుల సంచారం తెలుసుకునేందుకు మరిన్ని ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు.
అలిపిరి నడక మార్గం సహా లక్ష్మీ నరసింహ ఆలయం నుంచి ఏడో మైలు వరకూ సంచరించే జంతువుల కదలికలపై ఫోకస్ చేయాలని చెప్పారు. జంతువుల సంచారంపై ఎప్పటికప్పుడు కంట్రోల్ రూంకు తెలిసేలా సిగ్నలింగ్ వ్యవస్థను మెరుగుపరచాలన్నారు. మరోవైపు, కాలినడకన భక్తులను నిర్దేశించిన సమయాల్లోనే తిరుమల కొండకు చేరుకునేలా సమయాల్లో మార్పులు చేయాల్సిన అవసరాన్ని అధికారులు ఈవో దృష్టికి తెచ్చారు. దీనిపై చర్చించి నిర్ణయం తీసుకోవాలని జేఈవో, ఇతర అధికారులను ఈవో ఆదేశించారు. అటు, నడక మార్గంలో చేపట్టిన నిర్మాణ పనులపైనా జాయింట్ కమిటీ ఇచ్చిన ప్రతిపాదనలపై ఆరా తీశారు. తక్కువ ఖర్చుతో పనులు పూర్తయ్యేలా ప్రత్యామ్నాయ మార్గాలు చూడాలని నిర్దేశించారు.
శ్రీవారి దర్శనానికి 16 గంటలు
మరోవైపు, శ్రీవారి సర్వ దర్శనానికి 16 గంటల సమయం పడుతోంది. స్వామి దర్శనం కోసం 31 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. బుధవారం 69,632 మంది భక్తులు వెంకటేశుని దర్శించుకున్నారు. బుధవారం స్వామి వారి హుండీ ఆదాయం రూ.3.32 కోట్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)