TTD: శ్రీవారి సర్వదర్శనం 35 రోజుల టికెట్లు.. 30 నిమిషాల్లోనే ఖాళీ
శ్రీవారి సర్వదర్శనం అక్టోబర్ నెల కోటా టికెట్లను టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేసింది. సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 31 వరకు టికెట్లను అందుబాటులో ఉంచింది.
శ్రీవారి సర్వదర్శనం 35 రోజుల టికెట్లు.. 30 నిమిషాల్లోనే ఖాళీ అయ్యాయి. అక్టోబర్ నెల కోటా టికెట్లను టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేసింది. ఉదయం 9 గంటలకు సర్వదర్శనం టికెట్లను విడుదల చేయగా.. 30 నిమిషాల్లో ఖాళీ అయ్యాయి. రోజుకు 8వేల చొప్పున మొత్తం 35 రోజుల టికెట్లను 30 నిమిషాల్లోనే భక్తులు బుక్ చేసుకున్నారు.
గతంలో ఆన్ లైన్లో టికెట్లు బుక్ చేసేప్పుడు సాంకేతిక సమస్యలు వచ్చేవి. అయితే మళ్లీ అలాంటి సమస్యలు రాకూడదని.. జియో సహకారంతో సర్వర్లను వినియోగించి టికెట్లను విడుదల అయ్యాయి. టీటీడీ వెబ్‌సైట్‌కు ఒక్కసారిగా భక్తుల తాకిడి పెరిగినా సర్వర్లపై ఒత్తిడి పడకుండా వర్చువల్ క్యూ పద్ధతిలో టికెట్లను కేటాయించారు. టికెట్లు పొందిన భక్తులు రెండు డోసుల వ్యాక్సినేషన్ లేదా దర్శనానికి 72 గంటల ముందు పరీక్ష చేసుకున్న కొవిడ్ నెగటివ్ సర్టిఫికెట్లతో తిరుమలకు రావాలని టీటీడీ సూచించింది.
కరోనా కట్టడి, భక్తుల ఆరోగ్యం దృష్ట్యా ఆన్‌లైన్ విధానంలో సర్వ దర్శనం టికెట్లు జారీ చేస్తున్నట్టు తితిదే తెలిపింది. ఆన్‌లైన్ టికెట్ల విడుదలతో ఆఫ్‌లైన్ టోకెన్ల జారీ నిలిపివేశారు. జియో సంస్థ సహకారంతో తితిదే వెబ్‌సైట్ ద్వారా టికెట్ల విడుదల చేస్తున్నారు.
ఏడుకొండలపై కొలువైన శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనభాగ్యాన్ని అందరికి కలిగించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం సర్వదర్శన టికెట్లను జారీ చేస్తుంది. భక్తులకు కరోనా వైరస్ సోకకుండా నిబంధనలు పాటిస్తూ శ్రీవారి భక్తులకు ఉచిత దర్శనభాగ్యాన్ని కల్పిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. అయితే ఆఫ్ లైన్ లో కాకుండా ఆన్ లైన్ ఈ టికెట్లను అందిస్తున్నారు.
కరోనా తొలి దశ సమయంలో పరిమిత సంఖ్యలో భక్తులను కొండపైకి అనుమతించిన టీటీడీ.. ఆ తర్వాత సెకండ్ వేవ్ ప్రభావంతో సర్వదర్శనాల్ని పూర్తిగా నిలిపివేసింది. ప్రత్యేక దర్శనం రూ.300 రూపాయల టిక్కెట్‌పై కొందరికే తిరుమల ప్రవేశం కల్పిస్తూ వస్తోంది. అయితే కరోనా తీవ్రత తగ్గి సాధారణ పరిస్థితులు ఏర్పడటంతో టీటీడీ సర్వదర్శనం టోకెన్లను జారీ చేసింది.
టీటీడీ అధికారిక వెబ్‌సైట్‌లో టికెట్ బుకింగ్‌కు ప్రయత్నించిన చాలామందికి నిరాశే ఎదురవుతోంది. టీటీడీ ఆన్‌లైన్ టికెట్ల వెబ్‌సైట్ జియోమార్ట్ వెబ్‌సైట్‌కు రీడైరెక్ట్ అవుతోందని పలువురు భక్తులు అంటున్నారు. జియో.. సర్వీస్ ప్రొవైడర్‌గా వ్యవహరిస్తోందని.. ప్రస్తుతానికి tirupatibalaji.ap.gov.in లేదా tirupatibalaji.jiomart.com లో టికెట్లు బుక్ చేసుకోవచ్చని టీటీడీ తెలిపింది.
మరోవైపు తిరుమల శ్రీవారి దర్శనం టికెట్ల కోసం భక్తులు ఆన్లైన్ సెంటర్ దగ్గర భారీగా చేరుకున్నారు. టీటీడీ అధికారులు సర్వ దర్శనం టికెట్ కూడా ఆన్లైన్ లో విడుదల చేస్తుండడంతో దర్శన టికెట్ల కోసం భక్తులు ఎగబడుతున్నారు. తిరుపతి నగరంలోని ఆన్లైన్ సెంటర్ల దగ్గర ఎక్కడ చూసినా ఉదయం నుంచి భక్తులు పడిగాపులు కాస్తున్నారు. తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని నెట్ సెంటర్ల వద్ద రేపటి ఉచిత సర్వ దర్శనం టోకెన్లు కోసం క్యూలైన్లలో బారులు తీరారు.