YSR Statue At SKU: వైఎస్సార్ విగ్రహావిష్కరణ- విద్యార్థుల ఆందోళనతో ఎస్కేయూలో తీవ్ర ఉద్రిక్తత, పలువురి అరెస్ట్
Tension at Sri Krishnadevaraya University: చదువు చెప్పాల్సిన చోట రాజకీయ నేతల విగ్రహాలు పెట్టి రాజకీయాలు చేస్తున్నారంటు శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ (SKU)లో పలు స్టూడెంట్ సంఘాలు ఆందోళన చేపట్టాయి.
YSR Statue at Sri Krishnadevaraya University: అనంతపురం: చదువు చెప్పాల్సిన చోట రాజకీయ నేతల విగ్రహాలు పెట్టి రాజకీయాలు చేస్తున్నారంటు శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ (Sri Krishnadevaraya University)లో పలు స్టూడెంట్ సంఘాలు ఆందోళన చేపట్టాయి. శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీలో ఉమ్మడి ఏపీ మాజీ సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహ ఆవిష్కరణ చేశారు. అయితే వర్సిటీలో వైఎస్సార్ విగ్రహం ఎలా చేస్తారంటూ విద్యార్థి సంఘం నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తూ అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో యూనివర్సిటీలో కాసేపు తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీసులకు విద్యార్థి సంఘం నేతలకు తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. యూనివర్సిటీ ఒక రాజకీయ పార్టీకి సొంతం కాదని చదువు చెప్పే విద్యాలయంలో అందరూ సమానమేనని విద్యార్థి సంఘం నేతలు నినాదాలు చేశారు. ఏర్పాటు చేసిన మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని వెంటనే తొలగించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘం నేతలు పోలీసుల మధ్య తీవ్ర తోపులాట జరిగింది. కొందరు విద్యార్థి సంఘం నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
వైఎస్సార్ విగ్రహాన్ని ఆవిష్కరించిన వైసీపీ ఎంపీ, ఎమ్మెల్యేలు
శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీలో దివంగత నేత వైఎస్సార్ విగ్రహాన్ని ఎంపీ గోరంట్ల మాధవ్, రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఆవిష్కరించారు. అయితే వైఎస్సార్ విగ్రహ ఏర్పాటుని వ్యతిరేకిస్తూ విద్యార్థి సంఘాల ఆందోళనకు దిగాయి. విగ్రహా ఆవిష్కరణని అడ్డుకొనే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో జరిగిన తోపులాటలో కొందరు విద్యార్థి సంఘాల నాయకులు చిక్కాలు చిరిగిపోయాయి. కార్యక్రమాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్న విద్యార్థి సంఘాల నాయకులను పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. వారిని SKU పోలీస్ స్టేషన్ కు తరలించారు. యూనివర్సిటీలో రాజకీయ నేతల విగ్రహాలు వద్దంటూ విద్యార్థి సంఘాల నేతలు, విద్యార్థులు ఆందోళనలు చేస్తున్నప్పటికీ వర్సిటీ మేనేజ్ మెంట్ పట్టించుకోలేదని ఆరోపించారు.
ఎస్కేయూ వీసీ రామకృష్ణ రెడ్డి ఏమన్నారంటే..
వైఎస్సార్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో తలెత్తిన వివాదంపై ఎస్కేయూ వీసీ రామకృష్ణ స్పందించారు. తనకు పదవీ కాలాన్ని పెంచుకొనే ఆలోచన లేదన్నారు. వైస్ ఛాన్సలర్ గా తన పదవీకాలం ఈ 24 తో అయిపోతుందన్నారు. మంచి రోజు అని విగ్రహ ఆవిష్కరణ ఇవాళ ఫిక్స్ చేశామన్నారు. తమకు కూడా దేశభక్తి ఉందని, పూలే విగ్రహం ఉంది కాబట్టి సావిత్రి భాయి విగ్రహం అవసరం లేదని భావించినట్లు తెలిపారు. వర్సిటీలో ఏర్పాటు చేసిన వైఎస్సార్ విగ్రహానికి ఒక్క రూపాయి కూడా యూనివర్సిటీ నుంచి కేటాయించలేదని, దాతల ద్వారానే సేకరించామని వీసీ రామకృష్ణ స్పష్టం చేశారు.
పేదవారికి ఫీజులు అందించిన గొప్ప నేత వైఎస్సార్: ఎంపీ గోరంట్ల
పేదవారికి చదవు దూరం కాకూడదని భావించి దివంగత నేత వైఎస్సార్ ఉమ్మడి ఏపీ సీఎంగా ఫీజు రీయింబర్స్ మెంట్ పథకాన్ని తీసుకొచ్చారని ఎంపీ గోరంట్ల మాధవ్ అన్నారు. పేద విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ కల్పించి ఉన్నత చదువులు చెప్పించిన వైఎస్సార్ విగ్రహాన్ని యూనివర్సిటీలో పెట్టడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. బడుగు బలహీన వర్గాలకు అండగా ఉన్న నేత విగ్రహాలను యూనివర్సిటీలో పెట్టడం తప్పు కాదని, మరో అంబేద్కర్ గా తాము వైయస్ రాజశేఖర్ రెడ్డిని కొలుస్తాం అన్నారు.