TTD Kalyanamasthu: టీటీడీ కళ్యాణమస్తు అంటే ఏమిటి, ఇది ఎప్పుడు ప్రారంభమైందో తెలుసా - మధ్యలో 11 ఏళ్ల గ్యాప్
TTD Kalyanamasthu: కళ్యాణమస్తు కార్యక్రమం ఈ మధ్యకాలంలో తీసుకున్న నిర్ణయం కాదు. సామూహిక ఉచిత వివాహాలు జరిపించేందుకు టీటీడీ సిద్దంగా ఉందని వైవీ సుబ్బారెడ్డి ఇటీవల స్పష్టం చేశారు.
TTD Kalyanamasthu: నిరుపేద కుటుంబాలకు చెందిన వారు టీటీడీ నిర్వహించే కళ్యాణమస్తు కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇటీవల ప్రకటన రావడంతో తమ వివాహం త్వరలోనే జరుగుతుందని, ఎన్నో కలలు కన్న పేదవారికి నిరాశే మిగిలింది. టీటీడీ కళ్యాణమస్తుకు తాత్కాలికంగా బ్రేకులు పడింది. ఏపీ ప్రభుత్వం నుంచి అనుమతులు రాని కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా టీటీడీ ఆధ్వర్యంలో అన్ని జిల్లాలో నిర్వహించాల్సిన కళ్యాణమస్తు కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేసింది టీటీడీ. శ్రీ వేంకటేశ్వర స్వామి వారి అనుగ్రహంతో వివాహం చేసుకునే అదృష్టాన్ని టీటీడీ కళ్యాణమస్తు ద్వారా పేదవారికి అందిస్తోంది. కళ్యాణమస్తు ద్వారా ఎన్నో జంటలకు వివాహాలు జరిపించింది తిరుమల తిరుపతి దేవస్థానం.
నేటి సామూహిక వివాహాలకు బ్రేక్..
నేడు (ఆగస్టు 7వ తేదీ) ఉచిత సామూహిక వివాహాలు పెద్ద ఎత్తున నిర్వహిస్తామని టీటీడీ ఇటీవల ప్రకటించింది. కానీ ఆదివారం ఉదయం చాంద్రమాన శుభకృత్ నామ సంవత్సరం శ్రావణ శుక్ల దశమి ఉదయం 8.07 గంటల నుంచి 8.17 గంటల మధ్య అనూరాధ నక్షత్రం సింహ లగ్నంలో జరిపించాల్సిన వివాహాలకు ఆటంకం తలెత్తింది. శుభ ముహూర్తాన్ని పండితులు నిర్ణయించినా.. ప్రభుత్వం అనుంచి టీటీడీకి అవసరమైన అనుమతులు లభించని కారణంగా సామూహిక వివాహాలు (కళ్యాణమస్తు) తాత్కాలికంగా రద్దయింది. అయితే కళ్యాణమస్తు ఎప్పుడు నిర్వహిస్తారనే దానిపై ప్రస్తుతానికి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు టీటీడీ.
కళ్యాణమస్తు ఎప్పుడు మొదలైందంటే..
కళ్యాణమస్తు కార్యక్రమం ఈ మధ్యకాలంలో తీసుకున్న నిర్ణయం కాదు. దివంగత ముఖ్యమంత్రి డా.వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో భూమన కరుణాకర్ రెడ్డి టీటీడీ పాలకమండలి ఛైర్మన్ గా ఉన్న సమయంలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. 2006లో ఈ పథకానికి రూపకల్పన చేసిన టీటీడీ.. 2007 ఫిబ్రవరి 21న ఈ కార్యక్రమం ప్రారంభించింది. అప్పట్లో ఒక్కో జంటకు రూ. 7 వేల రూపాయలు వరకు ఖర్చు చేశారు. అప్పట్లో ప్రారంభించిన కళ్యాణమస్తు కార్యక్రమం ద్వారా 34,017 జంటలను ఒక్కటి చేసిన టీటీడీ సుమారు 24 కోట్ల రూపాయలు ఖర్చు అయినట్లు అంచనా వేసింది.
బంగారపు తాళిబొట్టు, వెండి మెట్టెలు, వధూవరులకు నూతన వస్త్రాలు, తలంబ్రాలు, పెళ్ళి సామాగ్రి, మంగళ వాయిద్యాలు, ధార్మిక స్తోత్ర పుస్తకాలు, పురోహితుడు, 60 మంది బంధుమిత్రులకు పెళ్ళి భోజనాలు ఉచితంగా టీటీడీ కల్పించేది. వివాహాలు జరిపించలేని పేద, మధ్య తరగతి కుటుంబాల వారికి, తల్లిదండ్రులు లేని అనాథలకు కూడా ఈ కార్యక్రమం ఎంతో మేలు చేసింది. అప్పట్లో ఏడాదికి ఓమారు మాత్రమే టీటీడీ ఈ కార్యక్రమంను నిర్వహించేది. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల మారిన ప్రభుత్వాలు, పాలక మండళ్ల కారణంగా కల్యాణ మస్తు కార్యక్రమం నానాటికి మరుగున పడింది. టీటీడీ చివరగా 2011 మే 20న చివరి విడత కళ్యాణమస్తు నిర్వహించింది.