1, 2, 3, 4, 5, కౌంట్ పెరుగుతుందా? ఇక్కడితో ముగుస్తుందా? తిరుమల భక్తుల్లో తొలగని భయం!
తిరుమలకు కాలినడక వెళ్లే భక్తుల్లో అనేక సందేహాలు ఉన్నాయి. తరచూ చిరుతలను బంధిస్తున్నారు. భక్తుల చేతికి కర్రలు ఇచ్చారు. ఇదేనా ఇంకా ఏమైనా చర్యలు తీసుకుంటున్నారానే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఐదు చిరుత పులులను బంధించారు. ఇదే ఆఖరుది ఇకపై భయం లేదు... అని టీటీడీ వర్గాలు చెబుతున్నాయి. కానీ వారం పది రోజుల వ్యవధిలోనే చిరుతల సంచారం కలకలం రేపుతోంది. ఇంతకీ ఇప్పటికైనా ఈ బెడద వదిలిందా లేకుంటే ఇంకా ఉందా అనే సందేహం భక్తుల్లో ఉంది.
తిరుమలకు కాలినడక వెళ్లే భక్తుల్లో అనేక సందేహాలు ఉన్నాయి. వారం పది రోజులకోసారి చిరుతలను బంధిస్తున్నారు. భక్తుల చేతికి కర్రలు ఇచ్చారు. ఇదేనా ఇంకా ఏమైనా పటిష్ట చర్యలు తీసుకుంటున్నారా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. చిరుతను బంధించినప్పుడల్లా టీటీడీ ఈవో కానీ, ఛైర్మన్ కానీ మీడియాతో మాట్లాడుతూ భక్తుల రక్షణే తమ తొలి ప్రాధాన్యమని చెబుతున్నారు. ఆపరేషన్ చిరుత కొనసాగుతుందని చెబుతున్నారు. ఇలా ఎన్ని రోజులు సాగుతుంది. ఇంకా ఎన్ని చిరుతలు ఉండొచ్చు అనే అంచనాలు మాత్రం అధికారుల వద్ద లేదనే విమర్శలు ఉన్నాయి.
ఇప్పటికే ఓ బాలుడిని లాక్కెళ్లే ప్రయత్నం చేసింది. ఓ బాలిక ప్రాణాలను కూడా చిరుత తీసింది. అయితే ఇప్పుడు దొరికిన ఐదు చిరుతల్లో ఆ మ్యాన్ ఈటర్ ఏదన్నది మాత్రం అధికారులు చెప్పడం లేదు. వారం పదిరోజుల్లో నివేదికలు వస్తాయని చెబుతున్నారే కానీ అసలు బాలికను చంపింది ఏ చిరుత అనేది క్లారిలటీ ఇవ్వలేకపోతున్నారు.
పటిష్ట చర్యలు తీసుకోవడంలో టీటీడీ విఫలమవుతుందని భక్తులతోపాటు ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పిస్తోంది. కర్రలను పంపిణీ చేసినంత మాత్రాన భక్తుల ప్రాణాలకు భరోసా ఇస్తారా అని ప్రశ్నిస్తున్నారు. కర్రతో చిరుతలను తరిమికొట్టొచ్చా అని నిలదీస్తున్నారు. అయితే మనిషి చేతిలో కర్ర ఉంటే జంతువులు భయపడతాయని దాడి చేయడానికి వెనుకంజ వేస్తాయని అంటున్నారు టీటీడీ అధికారులు.
ఐదు చిరుతలు పట్టుకున్నారిలా!
24 జూన్ 2023 మొదటి చిరుతను టీటీడీ అధికారులు, అటవీశాఖ సిబ్బంది కలిసి బంధించారు. ఇకపై అంతా ప్రశాంతమే అనుకున్నారంతా కానీ ఆగస్టుల అసలు కథ మొదలైంది. చిరుతలో వైల్డ్ యాంగిల్‌ను ప్రపంచం చూసింది.
చిన్నారి తినేసిన చిరుత వచ్చే మార్గాలను అన్వేషించారు అధికారులు. అది తిరిగే మార్గాల్లో ప్రత్యేక ట్రాప్‌లు ఏర్పాటు చేశారు కెమెరాలు ఫిట్ చేశారు. ఇలా అష్టదిగ్బంధం చేసిన తర్వాత మరో చిరుత బోనులో పడింది. ఆగష్టు 14 రెండో చిరుత అధికారుల ట్రాప్‌కు చిక్కింది. అక్కడకు మూడు రోజుల తర్వాత మూడో చిరుతను ఆగష్టు 17న పట్టుకున్నారు.
ఇక చిరుతలు లేవేమో అనుకున్నారు కానీ భక్తుల్లో ఎక్కడో చోట భయం కలిగింది. కొందరు సీనియర్ అధికారులు మాత్రం ఇంకా చిరుతలు ఉండనే ఉన్నాయంటూ చెప్పుకొచ్చారు. వారి అనుమానమే నిజమైంది. మరోసారి చిరుత జాడను పసిగట్టారు అధికారులు.
దీంతో మరోసారి ట్రాప్ ఏర్పాటు చేశారు. అనుకున్నట్టుగానే ఎర కోసం వచ్చిన చిరుత ఆగష్టు 28న బోనులో చిక్కింది. అంతా ఊపిరి పీల్చుకున్న టైంలో వారం రోజుల తర్వాత ఇవాళ సెప్టెంబర్ 6వ మరో చిరుత చిక్కింది. ఇది ఇక్కడితో ఆగుతుందా ఇంకా ఉన్నాయా అన్న అనుమానం భక్తుల్లో పోవడం లేదు.