TTD News: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ, నిన్న హుండీ ఆదాయం ఎంతంటే?
TTD News: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. మంగళవారం రోజున 77 వేల 436 మంది స్వామి వారిని దర్శించుకోగా.. రూ.3.77 కోట్ల రూపాయల హుండీ ఆదాయం నెలకొంది.
TTD News: తిరుమల పుణ్యక్షేత్రంలో భక్తులు రద్దీ కొనసాగుతుంది. వేసవి సెలవులు కావడంతో ఏడు కొండలు భక్తులతో కిటకిట లాడుతుంది. మంగళవారం రోజున 77,436 మంది స్వామి వారిని దర్శించుకున్నారు. ఇక స్వామి వారికి 38,980 మంది తలనీలాలు సమర్పించగా, 3.77 కోట్ల రూపాయలు భక్తులు హుండీ ద్వారా కానుకలుగా సమర్పించారు. ఇక సర్వదర్శనం భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్సులోని అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయి బయట శ్రీకృష్ణ తేజా అతిధి గృహం వరకూ సర్వదర్శనం భక్తులు క్యూలైన్లలో వేచి ఉన్నారు. దీంతో టైం స్లాట్ టోకెన్లు లేని సర్వదర్శనం భక్తులకు 24 గంటల సమయం పడుతుంది. ఇక ప్రత్యేక ప్రవేశ దర్శనానికి దాదాపు మూడు గంటల సమయం పడుతుంది.
పంచాగ శ్రవణం హుండీ జనాకర్షణ..
శ్రీవారి ఆలయంలో వైఖానస ఆగమ శాస్త్రం ప్రకారం శ్రీ వేంకటేశ్వరుడికి కైంకర్యాలు నిర్వహిస్తున్నారు అర్చకులు. ఇందులో భాగంగా బుధవారం నాడు ప్రత్యూషకాల ఆరాధనతో ఆలయ ద్వారమును తెరిచిన అర్చకులు.. బంగారు వాకిలి వద్ద శ్రీ వేంకటేశ్వర సుప్రభాత స్త్రోతంతో స్వామి వారిని మేలు కొలిపారు. అనంతరం తోమాల, అర్చన సేవలు నిర్వహించిన పిదప ప్రాతఃకాల ఆరాధనలో భాగంగా స్నపన మండపంలో శ్రీకొలువు శ్రీనివాస మూర్తి వారి సమక్షంలో దర్భార్ నిర్వహించారు. శ్రీవారికి పంచాంగ శ్రవణం, హుండీ జనాకర్షణ విన్నవించి, బెల్లంతో కలిపిన నువ్వుల పిండిని స్వామి వారికి నైవేద్యంగా సమర్పించారు. నవనీత హారతి సమర్పించి అనంతరం శ్రీనివాసమూర్తిని తిరిగి సన్నిధిలో వేంచేపు చేశారు. ప్రాతఃకాల ఆరాధనలో భాగంగా మొదటి ఘంటా నివేదనలో అన్నప్రసాదం, లడ్డూ, వడలు, చక్కెర పొంగలి, మిరియాలు పొంగలి, పగిలిన కుండలో వెన్నతో కలిపిన అన్నం(మాత్ర), దద్దోజనం, బెల్లంతో తయారు చేసిన పాయసాన్ని స్వామి వారికి నైవేద్యంగా సమర్పించారు.
Also Read: ఇన్ని రకాల చందనాలున్నాయా
"సహస్ర కళషాభిషేకం" ను టీటీడీ రద్దు
సన్నిధిలో శ్రీ వైష్ణవ సాంప్రదాయం ప్రకారం సాత్తుమొర నిర్వహించిన అనంతరం సర్కారు హారతి అందించి వి.ఐ.పి భక్తులకు స్వామి వారి దర్శన భాగ్యం కల్పించింది టీటీడీ. అనంతరం స్వామి వారికి రెండోవ గంట నివేదన, బలి జరిపిన అనంతరం ప్రతి "బుధవారం" రోజు నిర్వహించే "సహస్ర కళషాభిషేకం" ను టీటీడీ రద్దు చేసింది. ఉత్సవ విగ్రహాల పరిరక్షణ నేపధ్యంలో ఏడాదికి ఓమారు మాత్రమే నిర్వహించాలని ఆగమ సలహాదారుల మండలి సలహాల మేరకూ నిర్ణయం తీసుకుంది. అనంతరం సర్వదర్శనం భక్తులను స్వామి వారి దర్శనానికి అనుమతించారు. శ్రీవారి ఉత్సవమూర్తులు అయిన శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారిని విమాన ప్రదక్షణగా సంపంగి ప్రాకారంలోనికి వేంచేపు చేసి మధ్యాహ్నం 12 గంటలకు నిత్య కళ్యాణోత్సవాన్ని నేత్ర పర్వంగా నిర్వహిస్తారు.
ఆ తర్వాత ఆలయంలోని అద్దాల మండపంలో డోలోత్సవం సేవను నిర్వహించి, ఉత్సవ మూర్తులను ఆలయం వెలుపల ఉన్న వైభోత్సవ మండపానికి ఊరేగింపుగా తీసుకెళ్ళి ఆర్జిత బ్రహ్మోత్సవం, ఆర్జిత వసంతోత్సవం సేవలు నిర్వహిస్తారు అర్చకులు. సాయంకాలం సహస్రదీపాల కొలువులో ఊంజల్ సేవ నిర్వహించిన పిదప నిత్యోత్సవం నిర్వహిస్తారు అర్చకులు. సర్వదర్శనం నిలుపుదల చేసిన అనంతరం శ్రీవారికి రాత్రి కైంకర్యాలు ప్రారంభిస్తారు. ఈ కైంకర్యాల్లో భాగంగా రాత్రి తోమాల, అర్చన, రాత్రి గంట, తిరువీసం, ఘంటాబలి నిర్వహిస్తారు. తిరిగి సర్వదర్శనం భక్తులను స్వామి వారి దర్శనానికి అనుమతించి, సర్వదర్శనం పూర్తి అయిన తరువాత ఆగమోక్తంగా శ్రీవారికి చివరి సేవగా ఏకాంత సేవను నిర్వహిస్తారు అర్చకులు.
Also Read: అంత్యక్రియలు నిర్వహించిన తర్వాత శ్మశానం నుంచి వచ్చేస్తూ వెనక్కి తిరిగిచూస్తే!