Tirumala News: తిరుమల భక్తులకు గమనిక! నెల రోజుల పాటు పుష్కరిణి మూసివేత, తేదీలివే
Tirumala Latest News: ఆగస్టు 1 నుండి 31వ తేదీ వరకు తిరుమలలోని శ్రీవారి పుష్కరిణి మూసివేయనున్నారు. మరమ్మతుల కారణంగా నీటిని కూడా పూర్తిగా తొలగిస్తున్నామని తెలిపారు.

TTD News: తిరుమల శ్రీవారి ఆలయంలో కొలువైన పుష్కరిణి నెల రోజుల పాటు భక్తులకు అనుమతి ఉండదు. శ్రీవారి ఆలయం వద్ద గల పుష్కరిణిలో నీటిని పూర్తిగా తొలగించి పైపులైన్ల మరమ్మతులు, సివిల్ పనులు చేపట్టేందుకు గాను ఆగస్టు 1 నుండి 31వ తేదీ వరకు పుష్కరిణిని మూసివేస్తారు. ఈ కారణంగా నెల రోజుల పాటు పుష్కరిణి హారతి ఉండదని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.
సాధారణంగా స్వామి పుష్కరిణిలో నీరు నిల్వ ఉండే అవకాశం లేదు. పుష్కరిణిలోని నీటిని శుద్ధి చేసి తిరిగి వినియోగించేందుకు అత్యుత్తమ రీసైక్లింగ్ వ్యవస్థ అందుబాటులో ఉంది. నిరంతరాయంగా కొంత శాతం చొప్పున నీటిని శుద్ధి చేసి తిరిగి వినియోగిస్తారు. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా ఒక నెల రోజుల పాటు పుష్కరిణిలో నీటిని తొలగించి చిన్న చిన్న మరమ్మతులను పూర్తి చేస్తారు.
పుష్కరిణి మరమ్మతుల కోసం మొదటి పది రోజుల పాటు నీటిని తొలగిస్తారు. ఆ తరువాత పది రోజులు మరమ్మతులు ఏవైనా ఉంటే పూర్తి చేస్తారు. చివరి పది రోజులు పుష్కరిణిలో నీటిని నింపి పూర్తిగా సిద్ధం చేస్తారు. పుష్కరిణిలోని నీటి పిహెచ్ విలువ 7 ఉండేలా చూస్తారు. టీటీడీ వాటర్ వర్క్స్ విభాగం ఆధ్వర్యంలో ఈ పనులు చేపడతారని టీటీడీ ఓ ప్రకటన విడుదల చేసింది.
ఆగస్టు నెలలో తిరుమలలో జరిగే విశేష ఉత్సవాలు ఇవే
ఆగస్టు 4 - శ్రీ చక్రత్తాళ్వార్ వర్షతిరునక్షత్రం, శ్రీ ప్రతివాది భయంకర అణ్ణంగరాచార్య వర్ష తిరునక్షత్రం
ఆగస్టు 7 - ఆండాళ్ తిరువాడిపురం శాత్తుమొర. శ్రీవారు పురిశైవారి తోటకు వేంచేపు
ఆగస్టు 9 - గరుడ పంచమి, తిరుమల శ్రీవారి గరుడ సేవ
ఆగస్టు 10 - కల్కి జయంతి
ఆగస్టు 13 - తరిగొండ వెంగమాంబ వర్ధంతి
ఆగస్టు 14 - తిరుమల శ్రీవారి పవిత్రోత్సవాలకు అంకురార్పణ
ఆగస్టు 15 - భారత స్వాతంత్య్ర దినోత్సవం. స్మార్త ఏకాదశి
ఆగస్టు 15 నుంచి 17 వరకు - శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలు
ఆగస్టు 16 - వరలక్ష్మీ వ్రతం, నారాయణగిరిలో ఛత్రస్థాపనోత్సవం
ఆగస్టు 19 - శ్రావణపౌర్ణమి, పౌర్ణమి గరుడ సేవ, రాఖీ పండుగ, హయగ్రీవ జయంతి, విఖనస మహాముని జయంతి
ఆగస్టు 20 - తిరుమల శ్రీవారు శ్రీ విఖనసాచార్య స్వామి సన్నిధికి వేంచేపు, గాయత్రీ జపం
ఆగస్టు 27 - శ్రీకృష్ణాష్టమి, తిరుమల శ్రీవారి ఆస్థానం
ఆగస్టు 28 - శ్రీవారి శిక్యోత్సవం





















