TTD News: గరుడ సేవకు పకడ్బందీ ఏర్పాట్లు - టీటీడీ ఈవో ధర్మారెడ్డి
TTD News: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా సెప్టెంబరు 22న జరిగే గరుడ సేవకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు.
TTD News: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా సెప్టెంబరు 22న జరిగే గరుడ సేవకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. భక్తులందరూ గరుడసేవలో పాల్గొని సంతృప్తికరంగా వాహనసేవను దర్శించుకునేలా ఏర్పాట్లు చేపడుతున్నట్లు చెప్పారు. గురువారం తిరుమలలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను గురువారం అధికారులతో కలిసి ఈవో పరిశీలించారు. ఈ సందర్భంగా ఈవో మీడియాతో మాట్లాడుతూ బ్రహ్మోత్సవాల మొదటిరోజైన సెప్టెంబరు 18న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం తరఫున శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారని తెలిపారు. ఈ మేరకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. భద్రతా ఏర్పాట్లు పర్యవేక్షించినట్లు తెలిపారు.
ప్రతి ఒక్కరికీ గరుడసేవ దర్శనం
గరుడసేవ రోజు దాదాపు 2 లక్షల మంది భక్తులు గ్యాలరీల్లో వేచి ఉంటారని ఈఓ ధర్మారెడ్డి చెప్పారు. గరుడ సేవ దర్శనం కోసం ఇన్నర్ రింగ్ రోడ్డు, ఔటర్ రింగ్ రోడ్లలో వేచి ఉండే భక్తులను సుపథం, సౌత్ వెస్ట్ కార్నర్, గోవింద నిలయం నార్త్ వెస్ట్ గేట్, నార్త్ ఈస్ట్ గేట్ల ద్వారా గ్యాలరీల్లోకి అనుమతిస్తామని వెల్లడించారు. గరుడ వాహనాన్ని రాత్రి 7 గంటలకు ప్రారంభించి భక్తులందరూ దర్శించుకునేలా అర్ధరాత్రి 2 గంటల వరకైనా నెమ్మదిగా ముందుకు తీసుకెళతామని తెలియజేశారు. బయట వేచి ఉండే భక్తులు తమ వంతు వచ్చే వరకు సంయమనంతో వేచి ఉండి భద్రతా విభాగం నిబంధనలు పాటించాలని, అందరికీ గరుడసేవ దర్శనం కల్పిస్తామని తెలిపారు. బ్రహ్మోత్సవాల్లో సాధారణ భక్తులకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు.
భక్తులకు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు
బ్రహ్మోత్సవాల్లో భక్తులకు దర్శనం, బస, భద్రత, పారిశుద్ధ్యం తదితర ఏర్పాట్లకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేపట్టినట్టు చెప్పారు. భద్రతాచర్యలపై ఇది వరకే సీవీఎస్వో, తిరుపతి ఎస్పీ సమీక్ష నిర్వహించారని, ఇంజినీరింగ్ అధికారులు వీరికి అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారని వివరించారు. అంతకుముందు శ్రీవారి ఆలయం నుంచి వాహన మండపం, మాడ వీధులు, బేడి ఆంజనేయస్వామివారి ఆలయం, సుపథం, వైకుంఠం క్యూకాంప్లెక్స్-2 తదితర ప్రాంతాలను ఈవో పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.
ఈవో వెంట జేఈవో వీరబ్రహ్మం, సీవీఎస్వో నరసింహ కిషోర్, ఎస్వీబీసీ సీఈవో షణ్ముఖ్ కుమార్, ఏఎస్పీ మునిరామయ్య, చీఫ్ ఇంజినీర్ శ్రీ నాగేశ్వరరావు, ఎస్ఈ-2 జగదీశ్వర్ రెడ్డి, ఈఈ జగన్‌మోహన్‌రెడ్డి, డీఈ ఎలక్ట్రికల్ రవిశంకర్‌రెడ్డి, ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ శ్రీదేవి, ఇన్‌చార్జి సీఎంవో డాక్టర్ నర్మద, ఉద్యానవన డెప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసులు, డెప్యూటీ సీఎఫ్ శ్రీనివాసులు, వీజివోలు బాలిరెడ్డి, గిరిధర్‌రావు ఉన్నారు.
సెప్టెంబరు 15న శ్రీ కపిలేశ్వరాలయంలో లక్షకుంకుమార్చన సేవ
తిరుపతి కపిలేశ్వరస్వామివారి ఆలయంలో సెప్టెంబరు 15న శుక్రవారం కామాక్షి అమ్మవారికి లక్ష కుంకుమార్చన సేవ జరుగనుంది. శ్రావణమాసంలో చివరి శుక్రవారం రోజున ఆలయంలో లక్ష కుంకుమార్చన సేవ నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా ఉదయం 6 గంటలకు గణపతి పూజ, పుణ్యాహవచనం, ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఆలయంలోని మండపంలో శ్రీ కామాక్షి అమ్మవారిని కొలువుదీర్చి లక్షకుంకుమార్చన నిర్వహిస్తారు. సాయంత్రం 6 నుంచి రాత్రి 8 గంటల వరకు చంద్రశేఖర స్వామి, మనోన్మణి అమ్మవారి వీధి ఉత్సవం జరుగనుంది.