TTD Electric Bus: తిరుమలలో ఎలక్ట్రిక్ బస్సు దొంగతనం - పక్కా ప్లాన్‌తో స్కెచ్
తిరుమలలో చోరీ అయిన ఎలక్ట్రిక్ బస్సు దొరికింది. తెల్లవారుజామున బస్సును ఎత్తుకెళ్లారు దుండగులు. GPS ద్వారా ట్రాక్ చేసిన పోలీసులు నాయుడుపేటలో బస్సును స్వాధీనం చేసుకున్నారు. దొంగల కోసం గాలిస్తున్నారు.
దేవుడి సొమ్ముకే ఆశపడ్డారు దొంగలు. వడ్డీకాసుల వాడి దగ్గరే వక్రబుద్ధి చూపించారు. తిరుమలలో ఎప్పటి నుంచి తచ్చాడుతున్నారో ఏమో.. పక్కా ప్లాన్‌తో స్కెచ్ వేశారు. కాపు కాసి... బస్సుకే ఎసరు పెట్టారు. వేంకటేశ్వరస్వామి భక్తుల సేవ కోసం వినియోగిస్తున్న... ఎలక్ట్రికల్ బస్సును ఎత్తుకెళ్లారు. తిరుమలలో ఈ తెల్లవారుజామున జరిగింది ఈ చోరీ.
తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన ఎలక్ట్రిక్ బస్సును దొంగిలించారు దొంగలు. తిరుమలలో భక్తులను వివిధ ప్రాంతాలకు ఉచితంగా తరలించేందుకు టీటీడీ వినియోగిస్తున్న ఎలక్ట్రిక్ ధర్మరథం బస్సును అపహరించారు. తిరుమలలోని టీటీడీ డీపో దగ్గర రాత్రి బస్సును పార్క్ చేశారు. తెల్లవారి చూసేసరికి గ్యారేజ్‌లో బస్సు లేదు. వెంటనే తిరుమల క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు టీటీడీ అధికారులు. బస్సులోని జీపీఎస్ సిస్టమ్ ద్వారా... ఎంక్వైరీ చేశారు. తెల్లవారుజామున 3గంటల సమయంలో బస్సును దొంగిలించినట్టు గుర్తించారు. అంతేకాదు.. తిరుమల నుంచి తిరుపతికి, అక్కడి నుంచి నాయడుపేటకు తీసుకెళ్లినట్టు గుర్తించారు. అక్కడి క్రైమ్ పోలీసులు పంపారు. నాయుడుపేట బిరదవాడ వద్ద టీటీడీ ఎలక్ట్రిక్ బస్సు గుర్తించిన పోలీసులు... నిందితుల కోసం బిరదవాడ సమీపంలో ఉన్న టిడ్కో ఇళ్ళల్లో గాలిస్తున్నారు.
తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. అధికారులంతా ఆ హడావుడిలో ఉన్నారు. భక్తులతో కలిసిపోయిన దుండగులు... సమయం చూసుకుని ధర్మరథం బస్సును కొట్టేశారు. తెల్లవారుజామున... తిరుమల GNC టోల్‌గేట్ మీదుగా... ఒక బస్సు తిరుపతికి వెళ్తున్నా... GNC టోల్‌గేట్‌లోని టీటీడీ విజిలెన్స్ సిబ్బంది గుర్తించకపోవడం... బస్సును ఆపకపోవడం.. వారి నిర్లక్ష్యానికి అద్దంపడుతోంది. ఉదయం నుంచి ఉచిత బస్సు టీటీడీ డిపోలో లేకపోవడంతో... తిరుమలలోని అన్ని ప్రాంతాలనూ సిబ్బంది తనిఖీ చేశారు. బస్సు చోరీకి గురైనట్లు నిర్ధారించుకున్నాక... తిరుమల క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు జీపిఎస్ ఆధారంగా బస్సు కదలికలను గుర్తించారు. ధర్మరథం బస్సు నాయుడుపేట దగ్గర ఉన్నట్లు గుర్తించి.. బిరదవాడ వద్ద స్వాధీనం చేసుకున్నారు.
వైవీ సుబ్బారెడ్డి చైర్మన్‌గా ఉన్న సమయంలో తిరుమలలో పర్యావరణ పరిరక్షణ కోసం మొత్తం పది ఎలక్ట్రిక్ బస్సులను తీసుకొచ్చారు. మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్‌కు చెందిన ఒలెక్ట్రా గ్రీన్ టెక్ లిమిటెడ్ సంస్థ ఈ బస్సులను తయారు చేసింది. అత్యాధునిక సాంకేతికతతో ఈ బస్సులను తయారు చేశారు. ఒక్కో ఎలక్ట్రిక్ బస్సు ఖరీదు దాదాపు రెండు కోట్ల రూపాయలు వరకు ఉంటుంది.
దేవుడి సొమ్మంటే చాలా మంది భయపడతారు. అందులోనూ కలియుగ దైవ్యం శ్రీవెంకటేశ్వరస్వామిది అంటే... ఎవరూ అటు వైపు కన్నెత్తి చూడరు. అలాంటిది... ఇప్పుడు ఏకంగా రెండు కోట్లు విలువచేసే బస్సునే ధైర్యంగా ఎత్తుకెళ్లారు దొంగలు. బస్సులో జీపీఎస్ సిస్టమ్ ఉంటుంది... ఎక్కడికి వెళ్లినా పట్టుబడిపోతాం అన్న ఆలోచన కూడా లేకుండానే దొంగలు బస్సును ఎత్తుకెళ్లారా..? ఇంతకీ టీటీడీ బస్సును ఎత్తుకెళ్లే సాహనం చేసింది ఎవరు..? అన్ని కోణాల్లోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నాయుడుపేటలోని బిరదవాడ సమీపంలో ఉన్న టిడ్కో ఇళ్లలో దొంగల కోసం గాలిస్తున్నారు. మరోవైపు టీటీడీ ధర్మరథం బస్సు చోరీపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీటీడీ విజిలెన్స్ సిబ్బంది నిర్లక్ష్యం వల్లే బస్సు చోరీ అయ్యిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.