Tirumala Darshan Tickets: శ్రీవారి భక్తులకు శుభవార్త- 3 రోజులపాటు పలు సేవల టికెట్లు విడుదల చేయనున్న టీటీడీ
TTD Darshan Tickets: జూలై 24 నుంచి వరుసగా మూడు రోజులపాటు పలు సేవలు, దర్శన టికెట్లను విడుదల చేయనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) వెల్లడించింది.
Tirumala Darshan Tickets: శ్రీవారి భక్తులకు టీటీడీ మరో శుభవార్త చెప్పింది. జూలై 24 నుంచి వరుసగా మూడు రోజులపాటు పలు సేవలు, దర్శన టికెట్లను విడుదల చేయనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) వెల్లడించింది. జూలై 24న ఉదయం అంగప్రదక్షిణ టికెట్లు విడుదల, అదే రోజు మధ్యాహ్నం వృద్ధులు, దివ్యాంగుల దర్శన టికెట్లు భక్తులకు అందుబాటులోకి తీసుకురానుంది టీటీడీ. జులై 25న ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల అదనపు కోటా విడుదల చేయాలని ఏర్పాట్లు చేసింది. తిరుమల, తిరుపతి, తలకోనలో అక్టోబరు నెల గదుల కోటాను జూలై 26న టీటీడీ విడుదల చేయనుంది.
జూలై 24న అంగప్రదక్షిణ టికెట్ల కోటా విడుదల
తిరుమల శ్రీవారి అంగప్రదక్షిణ టికెట్లకు సంబంధించిన అక్టోబరు నెల కోటాను జూలై 24న విడుదల చేయనున్నారు. సోమవారం ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో అంగప్రదక్షిణ టికెట్లను టిటిడి విడుదల చేయనుంది. శ్రీవాణి ట్రస్టు దాతలకు దర్శనం, గదులకు సంబంధించి అక్టోబరుకు గానూ జూలై 24న ఉదయం 11 గంటలకు టిటిడి ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.
వృద్ధులు, దివ్యాంగుల దర్శన కోటా...
వృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా అక్టోబరు నెల ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను జూలై 24న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది టీటీడీ.
ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల అదనపు కోటా విడుదల
జూలై 25న ఉదయం 10 గంటలకు ఆగస్టు, సెప్టెంబరు నెలలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల అదనపు కోటాను టిటిడి ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. జూలై 25న ఉదయం 10 గంటలకు అక్టోబరు నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను టిటిడి ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.
గదుల కోటా... జూలై 26న ఉదయం 10 గంటలకు తిరుమల, తిరుపతి, తలకోనలో అక్టోబరు నెల గదుల కోటాను విడుదల చేస్తారు. https://tirupatibalaji.ap.gov.in వెబ్ సైట్ లో భక్తులు పైన పేర్కొన్న సేవలు, దర్శనాల టికెట్లను బుక్ చేసుకోవాలని టీటీడీ శనివారం ఓ ప్రకటనలో సూచించింది.
తిరుమలలో ఆఫ్ లైన్ విధానంలో శ్రీవారి ఆర్జితసేవలు, బ్రేక్ దర్శనం పొందిన భక్తులు టికెట్లు పొందే ప్రక్రియను మరింత సులభతరం చేసేందుకు టీటీడీ నూతన విధానాన్ని ప్రవేశపెట్టింది. "పే లింక్" ఎస్ఎంఎస్ ద్వారా భక్తులు కౌంటర్ల వద్దకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఆన్‌లైన్‌లో సొమ్ము చెల్లించి సేవా టికెట్లను ప్రింట్ తీసుకోవచ్చు. భక్తులకు మెరుగైన, సత్వర, సులభ సేవలు అందించడంలో భాగంగా ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు. టీటీడీ కొత్తగా తీసుకొచ్చిన పే లింక్ నూతన విధానంలో టికెట్లు పొందిన భక్తులకు ఎస్ఎంఎస్ ద్వారా పే లింక్ ను పంపుతారు. భక్తులు ఆ లింక్ పైన క్లిక్ చేసి యుపీఐ లేదా క్రెడిట్ కా, డెబిట్ కార్డు ద్వారా ఆన్‌లైన్‌లో సొమ్ము చెల్లించి సేవా టికెట్లు ప్రింట్ తీసుకోవచ్చు.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి
Join Us on Telegram: https://t.me/abpdesamofficial