Tirumala Darshan Update: తిరుమలలో వృద్ధుల దర్శనంపై వదంతులు నమ్మొద్దు.. శ్రీవారి భక్తులకు టీటీడీ విజ్ఞప్తి
Tirumala News Update | తిరుమలలో వయో వృద్ధుల దర్శనంపై కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారని.. 3 నెలల ముందే ఆన్‌లైన్ కోటా విడుదల చేస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ తెలిపింది.

Tirupati News Update | తిరుమల: వయోవృద్ధుల దర్శనంపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని నమ్మొద్దని శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) మరోసారి విజ్ఞప్తి చేసింది. వయోవృద్ధులు, దివ్యాంగుల దర్శనానికి సంబంధించి సోషల్ మీడియాలో కొన్ని జరుగుతున్న చక్కర్లు కొడుతున్న వార్తల్లో నిజం లేదని, అవన్నీ అవాస్తవమని తితిదే స్పష్టం చేసింది. ఈ మేరకు టీటీడీ ప్రకటనను విడుదల చేసింది.
3 నెలల ముందే ఆన్‌లైన్ కోటా విడుదల
టీటీడీ ప్రతి రోజు సుమారు 1000 మంది వయోవృద్ధులు, దివ్యాంగుల కోసం 3 నెలల ముందే ఆన్‌లైన్లో కోటా విడుదల చేస్తోంది. ఈ కోటాలో టికెట్ పొందిన భక్తులకు రూ.50 విలువైన శ్రీవారి లడ్డూ ప్రసాదం ఉచితంగా అందజేస్తారు. తిరుమల నంబి ఆలయానికి ఆనుకొని ఉన్న సీనియర్ సిటిజన్ / PHC లైన్ ద్వారా మధ్యాహ్నం 3 గంటలకు వారిని తిరుమల శ్రీవారి దర్శనానికి అనుమతి ఇస్తారు. అయితే సామాజిక మాధ్యమాల్లో ప్రసారమవుతున్న వదంతులను నమ్మవద్దని భక్తులను టీటీడీ కోరింది. భక్తులు అధికారిక వెబ్‌సైట్లు www.tirumala.org , https://ttdevasthanams.ap.gov.in ను సంప్రదించి సరైన సమాచారం పొందాలని సూచించింది.
మందుబాబులు నరకం చూపిస్తున్నారంటూ దుష్ప్రచారం..
వృద్ధుల దర్శనంతో పాటు మరో ఘటనపై కూడా టీటీడీ ఘాటుగా స్పందించింది. తిరుమల వెళ్తున్న భక్తులకు మందుబాబులు నరకం చూపిస్తున్నారని, తిరుమలలో విచ్చలవిడిగా మద్యం అని జరుగుతున్న ప్రచారం నిరాధారమని టీటీడీ ఖండించింది. అలిపిరి మెట్ల మార్గం వద్ద కొందరు మందుబాబులు మద్యం సేవించి మత్తులో సీసాలను పగులగొట్టి వేశారని అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడింది.
🚫 FAKE NEWS ALERT 🚫
— Tirumala Tirupati Devasthanams (@TTDevasthanams) October 4, 2025
Don’t believe or spread false information.#ttd #tirumala #factcheck #fakenews pic.twitter.com/V0mxhAoXm5
వాస్తవానికి, అలిపిరి నుంచి రుయా ఆస్పత్రికి వెళ్లే మార్గంలో కొందరు గాజు సీసా ముక్కలు రోడ్డుపై వేశారని తెలిపింది. అది తితిదే దారి కాదన్నది వాస్తవం. అయినా, కొందరు దీన్ని అలిపిరి మెట్ల మార్గంగా ప్రచారం చేస్తూ భక్తుల్లో భయాందోళన పెంచే ప్రయత్నం చేస్తున్నారని మండిపడింది. భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరిక జారీ చేసింది. ఇలాంటి అసత్య ప్రచారాన్ని నమ్మొద్దని శ్రీవారి భక్తులను టీటీడీ కోరింది.






















