SIT on Tirupati Violence: తిరుపతిలో ఎన్నికల హింసకు కారణం ఎవరు? సిట్ నివేదికపై సర్వత్రా ఉత్కంఠ
Andhra Pradesh Post-Poll Violence: ఏపీ ఎన్నికలకు ముందు, తరువాత చెలరేగిన హింసపై ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) తమ నివేదికను ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకు అందజేసింది. బాధ్యులు ఎవరో త్వరలో తేలనుంది.
Post Poll Violence in Andhra Pradesh తిరుపతి: ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా పూర్తి అయ్యాయని కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘం సంతోషించింది. రాష్ట్రంలో ఎక్కడా రీ-పోలింగ్ అవసరం లేదు చిన్నపాటి సంఘటనలు మినహా మరే వివాదాలు లేవంటూ ప్రకటించిన కొన్ని గంటల వ్యవధిలో చంద్రగిరి నియోజకవర్గంలో అనుకోని విధంగా అల్లర్లు జరిగాయి. పల్నాడు జిల్లా, అనంతపురం జిల్లా తాడిపత్రిలోనూ హింస చెలరేగింది.
చంద్రగిరిలో గొడవలు ప్రారంభం
చంద్రగిరి నియోజకవర్గం బ్రహ్మణ కాలువ వద్ద వైసీపీ, టీడీపీ ఏజెంట్లు పోలింగ్ కేంద్రంలోనే భౌతిక దాడులు చేసుకున్నారు. భారీగా ఇరు పార్టీల నాయకులు కార్యకర్తలు మోహరించి పోలింగ్ కేంద్రం లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో కేంద్ర బలగాలు గాల్లోకి కాల్పులు చేసి పరిస్థితిని చక్కదిద్దారు. రాత్రి కూచివారిపల్లిలో టీడీపీ, వైసీపీ నాయకులు గ్రామంలో మోహరించి ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. టీడీపీ నాయకులు వైసీపీ సర్పంచ్ ఇంటిపై దాడి చేయడం తో పరిస్థితి చేయి దాటిపోయింది. అక్కడికి చేరుకున్న వైసీపీ అభ్యర్దిని టీడీపీ కార్యకర్తలు చుట్టుముట్టడంతో పాటు అతని గన్ మ్యాన్‌ను బంధించారు. దీంతో వైసీపీ అభ్యర్ది ఆ పార్టీ నాయకులు అక్కడి నుంచి వచ్చేశారు. ఈ క్రమంలో వైసీపీ నాయకుడి ఇంటితో పాటు వైసీపీ అభ్యర్ది కారును టీడీపీ నాయకులు దగ్థం చేశారు. టీడీపీ అభ్యర్థి నేరుగా వచ్చి గన్ మ్యాన్‌ను విడిపించి బయటకు పంపారు. కేంద్ర బలగాలు చేరుకుని పరిస్థితిని తమ ఆధీనంలోకి తీసుకున్నాయి.
మరసటి రోజు తిరుపతిలో శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం లోని స్ర్టాంగ్ రూం కు ఈవీఎంలు తరలించే ప్రక్రియ ప్రారంభమైంది. వాటిని పరిశీలించేందుకు తొలుత వైసీపీ అభ్యర్ది తమ నాయకులతో యూనివర్సిటీ కి చేరుకున్నారు. ఆ తరువాత టీడీపీ అభ్యర్థి యూనివర్సిటీ గేటు లోపలికి వచ్చే లోపు వైసీపీ నాయకులు భారీగా చేరుకున్నారు. వాహనం లోపలికి వచ్చిన వెంటనే వైసీపీ మద్దతుదారులు టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిపై దాడి చేశారు. ఆయనను కాపాడే ప్రయత్నంలో గన్ మ్యాన్ గాయాలపాలయ్యారు. పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం లో గాలిలోకి రెండు రౌండ్లు కాల్పులు జరిపారు. ఇందులో ఓ వైసీపీ కార్యకర్తకు గాయాలయ్యాయి. టీడీపీ అభ్యర్థిపై దాడి సమాచారం తెలుసుకున్న టీడీపీ నాయకులు భారీగా తరలివచ్చి అక్కడ విధ్వంసం చేశారు. దీంతో కేంద్ర బలగాలు రంగంలోకి దిగి లాఠీఛార్జ్ చేసి పరిస్థితిని చక్కదిద్దాయి.
పోలీసులు ప్రేక్షక పాత్ర!
చంద్రగిరి నియోజకవర్గంలో ఎన్నికలు ముగిసిన తర్వాత జరిగిన అల్లర్లపై పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించారనే విమర్శలు వస్తున్నాయి. ఎన్నికల సమయం నుంచి యూనివర్సిటీ వద్ద గొడవ జరిగిన ప్రాంతంలో సైతం పోలీసులు తక్కువగా ఉండడం... సర్ది చెప్పే ప్రయత్నంలో పోలీసులవు సైతం ఇరు పార్టీల నాయకులు, కార్యకర్తల్ని కొట్టడం, ఆపై పోలీసుల వాహనాలను ధ్వంసం చేయడంపై కేసులు నమోదయ్యాయి.
ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్...!
చంద్రగిరి నియోజకవర్గంలో గత ఎన్నికల నుంచి గొడవలు, రీ పోలింగ్ వంటి అనేక సంఘటనలు ఉన్నాయి. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఎన్నికల వరకు నియోజకవర్గం ఆర్వో, ఎస్పీ పటిష్ట ఏర్పాట్లు చేశారు కాని గొడవల వరకు వచ్చినా.. స్పందించే తీరు పలు విమర్శలకు తావిచ్చింది. కేంద్ర బలగాలు వచ్చే లోపు గొడవలు జరిగి నష్టం జరిగిన వచ్చిన తరువాత వచ్చి లాఠీఛార్జ్ చేసి పరిస్థితిని చక్కదిద్దారు.
ఎన్నికల ముందు పోలీస్ శాఖలో బదిలీలు జరిగాయి. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తరువాత రాష్ట్ర, కేంద్ర ఎన్నికల సంఘం మరికొన్ని బదిలీలు జరిగాయి. కొందరు పోలీసులు అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని ప్రతిపక్ష పార్ట టీడీపీ నాయకులు ఫిర్యాదు చేయడంతో పోలింగ్ కొన్ని రోజులు ముందు వరకు బదిలీలు జరిగాయి. ఇంత జరుగుతున్నా ఇంటెలిజెన్స్ విభాగం అప్రమత్తంగా లేకపోవడం.. పోలీసులు వెంటనే స్పందించకపోవడం ఇలాంటి పరిస్థితికి కారణమని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.
సిట్ నివేదికలో బాధ్యులు ఎవరో?
చంద్రగిరి నియోజకవర్గంలో జరిగిన గొడవలపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్‌గా తీసుకుంది. సిట్ బృందం ఏర్పాటు చేసి విచారణ చేపట్టింది. గొడవలు జరిగిన అన్ని అంశాలతో పాటు బాధితులు, కేసులో అరెస్టు అయిన బాధితుల బంధువులతో మాట్లాడి అన్నింటిని నివేదికను ఎన్నికల సంఘానికి సమర్పించారు. ఈ నివేదికలో ఎవరు బాధ్యులో తెలియడం... ఎవరి పై చర్యలు ఉంటాయో అని చర్చ నడుస్తుంది. తిరుపతి జిల్లాలో 4 కేసులు నమోదుకాగా, తిరుపతిలో 2, చంద్రగిరిలో 2 ఎఫ్ఐఆర్ లు నమోదైనట్లు సిట్ రిపోర్ట్ చేసింది. చంద్రగిరిలో 2 కేసులలో 37 మంది నిందితులు కాగా, ఒక్కర్ని అరెస్ట్ చేశారు. తిరుపతిలో 2 కేసులలో 24 మంది నిందితుల్ని గుర్తించగా, 13 మందిని అరెస్ట్ చేసినట్లు సిట్ నివేదించింది.