Leopard: వేట మొదలుపెట్టిన చిరుత, తిరుపతిలో రాత్రి బయటకు రావాలంటే వణుకే
తిరుపతి నగరంలోని వెటర్నరీ యూనివర్సిటీ, జీవకోన ప్రాంతాల్లో తరచూ చిరుత పులి సంచారం స్ధానికులకు, విద్యార్ధులకు వణుకు పుట్టిస్తొంది.
తిరుపతిలో చిరుత భయం..
చీకటి పడితే చాలు బయటకు రావాలంటేనే వణికిపోతున్న ప్రజలు
రాత్రి సమయంలో జనవాసాలలో సంచరిస్తోంది
శేషాచలం అటవీ ప్రాంతం సమీపంలో స్ధానికులను భయపెడుతున్న చిరుత
కుక్కలను వేటాడేందుకు అటవీ ప్రాంతం నుంచి బయటకు
చిరుత సంచారాన్ని సీసీ కెమెరాల ద్వారా గుర్తించిన స్ధానికులు
చిరుత పులి సంచారం తిరుపతి వాసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. తిరుపతి నగరంలోని వెటర్నరీ యూనివర్సిటీ, జీవకోన ప్రాంతాల్లో తరచూ చిరుత పులి సంచారం స్ధానికులకు, విద్యార్ధులకు వణుకు పుట్టిస్తొంది. ఈ రెండు ప్రాంతాలు శేషాచలం అటవీ ప్రాంతంకు అతి సమీపంలో ఉండడంతో ఆహార సేకరణకు చిరుత పులులు జన నివాసాలకు వస్తున్నాయి. జీవకోనలోని ఎల్.ఎస్.నగర్, బ్యాంక్ కాలనీ, మొండికోన, బీడీ కాలనీలో ప్రజలు చీకటి పడితే ఇండ్ల నుండి బయటకు వచ్చేందుకు భయపడుతున్నారు. రాత్రి సమయంలో కుక్కలను వేటాడేందుకు అటవీ ప్రాంతం నుండి నివాసాలకు వస్తున్న చిరుత పులిని చూసిన కుక్కల అరుపులకు నిద్ర లేకుండా కాలం గడుపుతున్నారు.
మనుషులపై చిరుత పులి దాడి చేయకున్నా, చిన్నారులపై దాడి చేసే అవకాశం ఉండడంతో స్ధానికులు ఆందోళనకు గురి అవుతున్నారు. అయితే చిరుత పులి సంచారంను సీసీ కెమెరాల ద్వారా గుర్తించిన స్ధానికులు సీసీ కెమెరాల పుటేజ్ ను అటవీ శాఖా అధికారులు చూపించి తమను కాపాడాలంటూ ఫిర్యాదు చేశారు. కానీ అటవీ శాఖ చట్టం ప్రకారం ఆ ప్రాంతాల్లో కంచె వేసేందుకు వీలు లేదని అధికారులు చేతులు దులుపుకోవడంతో దిక్కు తోచని స్ధితిలో స్ధానికులు ఉన్నారు. అయితే చిరుత పులి సంచారంపై తమకు భధ్రత కల్పించాలని, అటవీ ప్రాంతం వద్ద బోన్లు, కంచె ఏర్పాటుతో పాటు, వీధి దీపాలు ఏర్పాటు చేయాలని స్ధానికులు కోరుతున్నారు.
తెలంగాణలోనూ పెద్దపులి భయాలు !
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ మండలంలోని మారుమూల గ్రామాల్లో పెద్దపులి సంచరిస్తూ హడలెత్తిస్తోంది. కాగజ్‌నగర్, సిర్పూర్ (టి) ప్రాంతాల్లో ఇది వరకు కనిపించిన పులి.. ఇప్పుడు బెజ్జూర్ మండలంలోని మారుమూల గ్రామాల్లో సంచరిస్తూ పశువులపై దాడి చేస్తోంది. నిన్న రాత్రి బెజ్జూర్ మండలం కుకూడ గ్రామంలో కొట్టంలో కట్టెసిన ఎద్దుపై పులిదాడి చేసింది. పశువుల అరుపులు విన్న గ్రామస్తులు బయటకు వచ్చి కేకలు వేయడంతో పులి సమీప అడవిలోకి వెళ్ళిపోయింది. దీంతో ఆ ఎద్దు ప్రాణాలతో బయటపడింది. తాజాగా మళ్ళీ ఈరోజు సోమవారం బెజ్జూర్ మండలంలోని మర్తిడి గ్రామంలో మొండికుంట వద్ద నిద్రిస్తున్న పులిని మీసాల రాజు అనే రైతు చూసాడు. పులి చూసి ఒక్కసారిగా ఉలిక్కిపడి అక్కడ నుండి పరుగులు తీసి గ్రామానికి చేరుకున్నాడు. వెంటనే పులి సమాచారాన్ని అటవి శాఖ అధికారులకు అందించారు.
కుమ్రం భీం జిల్లాలో గత నాలుగు రోజులుగా పెద్దపులి సంచారం కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. బెజ్జూరు, దహెగాం, పెంచికల్ పేట్, కాగజ్‌నగర్, సిర్పూరు(టి), చింతలమానేపల్లి, వాంకిడి అటవీ ప్రాంతాల్లో పులుల అన వాళ్లను అధికారులు నిర్ధారించారు. ఇప్పటికే ఒక రైతు బెబ్బులి దాడిలో చనిపోగా.. పదుల సంఖ్యలో పశువులు హతమయ్యాయి. దీంతో పశువులను అటవీ ప్రాంతానికి తీసుకెళ్లడానికి కాపర్లు, పత్తి చేన్లకు వెళ్లడానికి రైతులు జంకు తున్నారు. కుమ్రం భీం జిల్లాలో 12 నుంచి 15 పులులు సంచరిస్తున్నట్లు అటవీ అధికారులు చెబుతున్నారు. అటవీ సమీప గ్రామాలైన వాంకిడి మండలంలోని ఖానాపూర్, సవ్వాతి, దాబా, అంతాపూర్, గడమర, వెలిగి, లక్ష్మిపూర్, పెంచికల్పేట్ మండలంలోని కొండపల్లి, లోడ్ పల్లి, అగర్ గూడ, కమ్మర్ గావ్, నందిగాం, గుండపల్లి, జిల్లెడ, మొర్లగూడ, బెజ్జూర్ మండలంలోని సులుగుపల్లి, పెద్దసిద్దాపూర్, తలాయి, తిక్కపల్లి, రెబ్బెన, కొత్తగూడ, దహెగాం మండలంలోని దిగిడ, రాంపూర్, మొట్లగూడ తదితర గ్రామాల ప్రజలు భయాందోళన చెందుతున్నారు. వాంకిడి మండలం ఖానాపూర్ గ్రామానికి చెందిన సిడాం భీము అనే రైతును హతమార్చిన పులి.. కాగజ్‌నగర్ డివిజన్ లోని అటవీ ప్రాంతంలో సంచరిస్తుంది ఒకటేనని అధికారులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. పాదముద్రలు ఒకే పరిమాణంలో ఉండటంతో ఆ పులి ఇటుపై వచ్చిందని భావిస్తున్నారు.